Weather: హై అలర్ట్.. ఏపీకి పొంచి ఉన్న మరోముప్పు..
ABN , Publish Date - Sep 04 , 2024 | 06:19 PM
ఇప్పుడిప్పుడే వరద తగ్గిందని ఊపిరి పీల్చుకుంటుండగా.. మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఒక్కసారిగా వచ్చిపడిన ఉపద్రవం నుంచి ఇంకా తేరుకోకముందే.. పిడుగులాంటి వార్తను ప్రకటించింది ఐఎండీ. మరో ముప్పు పొంచి ఉందంటూ అలర్ట్ చేసింది. అవును.. ఏపీకి భారీ వర్షం సూచన ప్రకటింది వాతావరణ శాఖ.
అమరావతి, సెప్టెంబర్ 04: ఇప్పుడిప్పుడే వరద తగ్గిందని ఊపిరి పీల్చుకుంటుండగా.. మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఒక్కసారిగా వచ్చిపడిన ఉపద్రవం నుంచి ఇంకా తేరుకోకముందే.. పిడుగులాంటి వార్తను ప్రకటించింది ఐఎండీ. మరో ముప్పు పొంచి ఉందంటూ అలర్ట్ చేసింది. అవును.. ఏపీకి భారీ వర్షం సూచన ప్రకటింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఆ జిల్లాలకు అలర్ట్..
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా.. పల్నాడు, ఏలూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జాగ్రత్త..
అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలను అలర్ట్ చేశారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
జనజీవనం అస్తవ్యస్తం..
రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. బుడమేరు, మున్నెరు వరదతో కృష్టమ్మ జల ప్రళయం సృష్టించింది. విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఇళ్లన్నీ నీట మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కనీసం తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. అయితే, వరద ఉధృతి తగ్గడం, వాన లేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ మరోసారి హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక గడిచిన 24 గంటలలో రాష్ట్రంలో పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కైకలూరులో 6 సెంటిమిటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో 4 సెంటిమిటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల చదరుమదరు వర్షం కురిసింది.