Share News

జే ట్యాక్స్‌ పోయింది.. మద్యం ధర తగ్గింది

ABN , Publish Date - Nov 29 , 2024 | 02:55 AM

జగన్‌ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్‌’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్‌కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే.

 జే ట్యాక్స్‌ పోయింది.. మద్యం ధర తగ్గింది

  • తాజాగా రేట్లు తగ్గించిన 3 పాపులర్‌ బ్రాండ్లు

  • కంపెనీల ప్రతిపాదనలకు ఎక్సైజ్‌ ఆమోదం

  • వెంటనే అమల్లోకి రానున్న కొత్త ధరలు

  • క్వార్టర్‌పై 30, ఫుల్‌ బాటిల్‌పై 200 తగ్గింపు

  • గత ప్రభుత్వంలో తాడేపల్లికి కప్పం

  • కట్టేందుకు జనం నుంచి పిండేశారు

  • ప్రభుత్వం మారడంతో కమీషన్లు మాయం

  • 3 రోజుల్లో మరో 2 కంపెనీల ధరలు తగ్గుదల

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ ప్రభుత్వం దిగిపోవడంతో ‘జే ట్యాక్స్‌’ కూడా పోయింది. దీంతో మద్యం ధరలు తగ్గాయి. ఈ జే ట్యాక్స్‌కు, మద్యం ధరలకు సంబంధం ఏంటంటే... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం అమ్ముకోవాలంటే ఏ కంపెనీ అయినా అప్పటి ప్రభుత్వ పెద్దలకు కప్పం కట్టాల్సిందే. ఒక్కో లిక్కర్‌ కేసుపై రూ.200 నుంచి రూ.250, బీరు కేసుపై రూ.100 చొప్పున కంపెనీలు కమీషన్లు చెల్లించాయి. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఈ కమీషన్ల దందా కొనసాగింది. వైసీపీ పెద్దలు అడిగిన కప్పం కట్టిన కంపెనీలకే అప్పట్లో ఆర్డర్లు ఇచ్చారు. కమీషన్లు ఇచ్చినందుకుగాను బదులుగా ఆయా కంపెనీలకు ప్రభుత్వం చెల్లించే రేట్లు పెంచారు. అలా పెంచిన మొత్తాన్ని కంపెనీలు ఆ చేత్తో తీసుకుని, ఈ చేత్తో తాడేపల్లి ప్యాలె్‌సకు పంపాయి. ఇలా రూ.3,100 కోట్లను కమీషన్‌గా మళ్లించినట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

జగన్‌ ప్రభుత్వం మారడంతో కమీషన్ల బెడద తప్పింది. దీంతో కంపెనీలు వెంటనే ధరలు తగ్గించేశాయి. ఒక్క క్వార్టర్‌పై రూ.30 ధర తగ్గించాయి. దీన్నిబట్టి గత ప్రభుత్వంలో ఏ స్థాయిలో కమీషన్లు దండుకున్నారో, వినియోగదారులపై ఎంతభారం వేశారో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీ మారిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగా మద్యం ధరలు తగ్గాయి. గత ప్రభుత్వంలో భారీగా పెంచిన రేట్లను తగ్గించుకునేందుకు స్వయంగా కంపెనీలే ముందుకొస్తున్నాయి.


తాజాగా మరో మూడు పాపులర్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఎక్సైజ్‌ శాఖ వాటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తగ్గించిన ధరలు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం షాపుల్లో పాత ఎమ్మార్పీలతో ఉన్న బాటిళ్లను ఆ ధరలకే విక్రయిస్తారు. ఇకపై షాపులకు కొత్తగా వచ్చే స్టాకును తగ్గించిన ధరలతో అమ్ముతారు. ఇంకా అనేక కంపెనీలు ధరలు తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

  • తగ్గిన బ్రాండ్‌ ధరలివే...

మాన్షన్‌ హౌస్‌ బ్రాందీ క్వార్టర్‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. అదే బ్రాండ్‌ హాఫ్‌ బాటిల్‌ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్‌ బాటిల్‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గాయి. రాయల్‌ చాలెంజ్‌ సెలెక్ట్‌ గోల్డ్‌ విస్కీ క్వార్టర్‌ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఇదే బ్రాండ్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. యాంటిక్విటీ బ్లూ విస్కీ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది.

  • త్వరలో కొత్త ధరలు

మద్యం ధరలపై ఇటీవల ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో చర్చించి ధరల సవరణపై సిఫారసు చేయనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. అయితే ఈలోపే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించుకునేందుకు ముందుకొస్తున్నాయి. మరో రెండు పాపులర్‌ బ్రాండ్లు మూడు రోజుల్లో ధరలు తగ్గించనున్నాయి. ప్రస్తుతం కంపెనీలు ధరలు తగ్గించుకుంటున్న తీరు పరిశీలిస్తే... గత ప్రభుత్వంలో అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేశారని స్పష్టమవుతోంది. ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై దాదాపు రూ.200 అదనంగా వసూలు చేశారు. పక్క రాష్ర్టాల్లో ఒక ధర, ఏపీలో మరో ధర అనే విధానం అమలైంది. తాడేపల్లి ప్యాలె్‌సకు కమీషన్లు ఇవ్వాల్సి రావడమే ఇందుకు కారణం.


  • కమిటీ ముందు తప్పించుకోవడానికా?

మద్యం కంపెనీలు ఇప్పుడే ధరలు తగ్గించుకోవడం వెనుక మరో కోణం కూడా కనిపిస్తోంది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో మద్యం ధరల సవరణ కమిటీని ప్రభుత్వం ఇటీవల నియమించింది. త్వరలో ఆ కమిటీ అన్ని కంపెనీలతో ధరల సవరణపై చర్చలు జరపనుంది. ఓ బాటిల్‌ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది? అవే బాటిళ్లను పక్క రాష్ర్టాల్లో ఎంతకు విక్రయిస్తున్నారు? ఇతరత్రా ఖర్చుల వివరాలు పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ఏ ధరకు ఇస్తారనే దానిపై కమిటీ చర్చించనుంది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న ధరల్లో భారీ వ్యత్యాసాలుంటే... ఎక్కువ ఎందుకు ఉందనే కోణంలో కంపెనీలను కమిటీ ప్రశ్నించే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రేట్లు తగ్గించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.

Updated Date - Nov 29 , 2024 | 03:00 AM