Share News

Electricity Department : డిస్కమ్‌లు దివాలా!

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:05 AM

ముఖ్యమంత్రిగా జగన్‌ ముంచేసిన ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్‌ రంగమే ముందు వరసలో ఉంటుంది. అటు వినియోగదారులను బాదేస్తూ, ఇటు విద్యుత్‌ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టే స్తూ ఐదేళ్ల పాలనలో ఏపీకి కళా‘కాంతి’ లేకుండా చేశారు.

Electricity Department : డిస్కమ్‌లు దివాలా!

  • రూ.1,38,000 కోట్లకు చేరువలో అప్పులు

  • జగన్‌ ఎగ్గొట్టిన సబ్సిడీ రూ.70,000 కోట్లు

  • అస్మదీయుల చేతికి విద్యుత్‌ సంస్థలు

  • కలకలం రేపిన ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల తీరు

  • రేపు విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా జగన్‌ ముంచేసిన ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్‌ రంగమే ముందు వరసలో ఉంటుంది. అటు వినియోగదారులను బాదేస్తూ, ఇటు విద్యుత్‌ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టే స్తూ ఐదేళ్ల పాలనలో ఏపీకి కళా‘కాంతి’ లేకుండా చేశారు. 2014-19 మధ్య కాలంలోని వాస్తవ వ్యయాల వసూలు పేరిట.. రూ. 3,542 కోట్లను ట్రూఅప్‌ చార్జీల పేరిట భారం వేశారు. అదేవిధంగా నెలకు 500 యూనిట్లకుపైగా వాడే వారి నుంచి రూ.1,300 కోట్లు వసూలు చేశా రు. శ్లాబులు పెంచి రూ.1500 కోట్ల భారం వేశారు.

కిలోవాట్‌కు రూ.10 పెంచడం ద్వారా రూ.2,600 కోట్లను వసూలు చేశారు. ప్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్ఛేజి కాస్ట్‌ కింద రూ.700 కోట్ల మేర భారం వేశారు. సర్దుబాటు చార్జీల కింద రూ.3,669 కోట్లను గుంజారు. గృహ విద్యుత్తు చార్జీల పెంపు, సర్దుబాటు కింద రూ.4,300 కోట్ల భారం వేశారు. ఇలా రూ.16,611 కోట్లను ప్రజలపై చార్జీల భారాన్ని వేశారు. 2022-23లో రూ.7,200 కోట్లు.. 2023-24లో రూ.10,015 కోట్లు.. భారం వేశారు. ఇలా ఐదేళ్లలో రూ.33,826 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపారు.

విద్యుత్తు చార్జీలను 2014- 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పెంచలేదు. అయినా.. ప్రతిపక్షంలో ఉండగా, బాదుడే బాదుడు అంటూ జగన్‌ ఆరోపణలు చేసేవారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్తు చార్జీలు పూర్తిగా తగ్గించేస్తానంటూ హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీల్లోనూ, గిరిజన తండాల్లోనూ నెలకు 200 యూనిట్ల దాకా ఉచితంగా కరెంటును అందిస్తానని హామీ గుప్పించారు. కానీ .. తర్వాత .. దానికి షరతులు విధించారు.

హామీలన్నీ హుళక్కే

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నిరంతరాయంగా విద్యుత్తును ఇస్తానని ఆనాడు జగన్‌ హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి రాగానే వ్యవసాయ విద్యుత్తు వాడకంపై గణాంకాలు సేకరించాల్సిందేనని డిస్కమ్‌ లకు షరతులు విధించారు. వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లను బిగించేందుకు సిద్ధమయ్యారు. తన బంధువుకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీకి మీటర్ల బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా గృహాలకు స్మార్ట్‌ మీటర్లను బిగిస్తామంటూ టెండర్లను పిలిచారు. ఈ బాధ్యతను తన మిత్రుడు అదానీకి అప్పగించారు. వ్యవసాయ మీటర్లపై భారం ప్రభుత్వం భరిస్తుంటే, గృహ విద్యుత్తు భారం రూ.12000 వినియోగదారులపై పడుతోంది. ఈ రెండింటి కోసం డిస్కమ్‌లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.14,000 కోట్లను రుణంగా తీసుకున్నాయి. వీటి వడ్డీభారం కూడా వినియోగదారుల పైనే పడనుంది.


డిస్కమ్‌లను ముంచేశారు

జగన్‌ నిర్వాకంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు, జెన్కో రూ.వేల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయాయి. గత ఏడాది అఽధికారికంగా అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల మేరకు ఏపీసీపీ డీఎల్‌ అప్పులు రూ.28,832.95 కోట్లకు చేరుకున్నాయి. ఏపీసీపీడీసీఎల్‌ అప్పు రూ.11,005.48 కోట్లు.. ఏపీఈపీడీసీ ఎల్‌ అప్పు రూ.12,633.99 కోట్లుగా ఉంది. మొత్తం డిస్కమ్‌ల అప్పు రూ.42533.16 కోట్లుగా ఉందని విద్యుత్తు సంస్థలు చెబుతున్నాయి. ఇక, జెన్కో అప్పులు రూ.19,438.06 కోట్లు.

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రం రుణం రూ.29,000 కోట్లకు చేరుకుంది. వీటీపీఎ్‌సను కమర్షియల్‌ అపరేషన్‌లోకి తీసుకురావడంలో చేసిన జాప్యం వల్ల రూ.26,000 కోట్ల మేర జెన్కోకు నష్టం వాటిల్లిందని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే, మొత్తంగా విద్యుత్తు సంస్థలు చేసిన రుణాలు రూ.1,38,000 కోట్లకు చేరుకున్నాయని చెబుతున్నారు. ఈ రుణాలన్నీ సంస్థలకు తలకు మించిన భారంగా మారాయి.

ఇప్పటికీ రెండు పోస్టుల్లో సంతోశ్‌రావు

రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలను సొంత సామ్రాజ్యాలుగా, వాటి సీఎండీలను సామంత రాజులుగా చేసుకుని నాడు సీఎం జగన్‌ ఇష్టారాజ్యం పాలించారు. కీలకమైన పోస్టులను అస్మదీయులతో నింపేశారు ఏపీఈపీడీసీఎల్‌లో సంతోశ్‌రావును రెండేళ్లపాటు కొనసాగించారు. ఏపీసీపీడీసీఎల్‌లో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ యజమాని విశ్వేశ్వరరెడ్డి బంధువు పద్మా జనార్ధనరెడ్డిని నియమించారు. జగన్‌ అండ చూసుకుని సీఎండీలు చెలరేగిపోయారు. విచ్చలవిడిగా షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ నుంచి రెట్టింపు ధరలకు ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేశారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు తెలంగాణ కంటే రెట్టింపు ఉండటంపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

చివరికి..డిస్కమ్‌లలో వ్యవహారం శ్రుతి మించిందని ఉన్నతాధికారులు సైతం అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏపీఈపీడీసీఎల్‌కు ఐఏఎస్‌ అధికారి పృఽథ్వీతేజ్‌ను నియమించారు. అక్కడ సీఎండీగా ఉన్న సంతోశ్‌రావును ఏపీఎస్పీడీసీఎల్‌కు మార్చారు. ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీగా ఉన్న పద్మాజనార్ధనరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వవద్దంటూ వచ్చిన ఒత్తిడితో .. ఈ సంస్థకు సంతో్‌షరావును సీఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చి కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి, జగన్‌ ఇంటికి వెళ్లిపోయినా, ఇంకా రెండు పదవుల్లోనూ ఇప్పటికీ సంతోశ్‌రావును కొనసాగించడంపై విద్యుత్తు పంపిణీ సంస్థల ఉద్యోగులు, నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 30 , 2024 | 05:05 AM