Share News

Kakinada : చిన్నారి ప్రాణం తీసిన జగన్‌ పుట్టినరోజు వేడుక!

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:30 AM

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి.

 Kakinada : చిన్నారి ప్రాణం తీసిన జగన్‌ పుట్టినరోజు వేడుక!
YS Jagan

  • నడి రోడ్డుపై వైసీపీ నాయకుల దానధర్మాలు

  • బీరువా పడి తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు దారివ్వని వైనం

  • చిన్నారిని భుజంపైనే వేసుకుని ఆసుపత్రికి తండ్రి

  • అంబులెన్స్‌ రాకా ఆలస్యం.. చిన్నారి తుదిశ్వాస

  • కాకినాడ జిల్లా కొత్తపల్లిలోని ఉప్పాడలో ఘోరం

  • మైలవరంలో మాజీ మంత్రి జోగి హంగామా

  • ‘పోలీసు సైరన్ల’తో వాహన ర్యాలీ.. ట్రాఫిక్‌ జామ్‌

కొత్తపల్లి(కాకినాడ)/మైలవరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లిలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు దారిలేక ఆమె తండ్రి చిన్నారిని భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. అప్పటికే సమయం గడిచిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించేందుకు అంబులెన్స్‌ సమయానికి రాకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక, ఎన్టీఆర్‌ జిల్లాలోని మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అనుచరులు హంగామా సృష్టించారు. ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్లు పెట్టి మోగిస్తూ.. రోడ్లపై హల్చల్‌ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ ఆగిపోయింది. ఈ ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ చిక్కుకుంది.

కొంచెం దారిచ్చి ఉంటే..

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో క్రీస్తు గాస్పెల్‌ చర్చి నిర్వాహకులు రాజబాబు ఇటీవల నూతన చర్చి నిర్మాణం చేపట్టారు. పాత చర్చిలో సామగ్రిని తరలించడంలో భాగంగా శనివారం చెక్క బీరువాను బయటకు తీశారు. ఈ లోగా అక్కడే ఆడుకుంటున్న రాజబాబు మనవరాలైన రెండేళ్ల చిన్నారి బెట్సీ జయకీర్తన.. చెక్కబీరువాకు వేలాడుతున్న తాళాల గుత్తిని చూసి లాగింది.

Untitled-5 copy.jpg


దీంతో బీరువా ఒక్కసారిగా ఆ చిన్నారిపై పడింది. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారిని తండ్రి షారోన్‌కుమార్‌ కారులో కొత్తపల్లి పీహెచ్‌సీకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో ప్రధాన రహదారి వాకతిప్పలో వైసీపీ కార్యకర్తలు మాజీ సీఎం జగన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు దానధర్మాల కార్యక్రమం చేపట్టారు.దుప్పట్లు, చీరల కోసం పెద్ద ఎత్తున పేదలు, వృద్ధులు రోడ్డుపై గుమిగూడారు. దీంతో షారోన్‌కుమార్‌ కారు పీహెచ్‌సీకి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ఆయన తన కుమార్తెను భుజాన వేసుకొని పీహెచ్‌సీకి పరుగున పరుగున తీసుకెళ్లారు. పీహెచ్‌సీలో చిన్నారిని పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం కాకినాడ తరలించాలని చెప్పారు. దీంతో అంబులెన్స్‌ కోసం 2 గంటలు నిరీక్షించారు. 108 రాకపోవడంతో ప్రైవేటు ఆంబులెన్స్‌లో తరలిస్తుండగా కీర్తన మార్గమధ్యంలో మృతిచెందింది. అయితే.. తమ కారుకు కొంచెం దారిచ్చి ఉంటే ముందుగానే పీహెచ్‌సీకి చేరుకునే వారమని, చిన్నారికి ప్రాణాపాయం తప్పేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.


  • మైలవరంలో జోగి.. యాగీ

జగన్‌ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ మైలవరంలో నానా యాగీ చేశారు. నాలుగైదు కార్లలో ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళుతూ తమ ప్రైవేటు వాహనాలకు ‘పోలీసు లేదా అత్యవసర సేవల వాహనాల సైరన్‌’లు పెట్టి మోగిస్తూ హంగామా చేశారు. సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే.. ఇంత జరిగినా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు పోలీసులతో పాటు మైలవరం పోలీసులు కూడా జోగి హడావుడిని ప్రశ్నించిన పాపాన పోలేదు. మైలవరంలో ఎల్‌హెచ్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద డ కార్యక్రమంలో జోగి పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. దీంతో నడిరోడ్డుపై అరగంటకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ కూడా చిక్కుకుపోయింది. అయినా ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోలేదు. ఈ విషయంపై మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. మైలవరంలో వైసీపీ నేతల కార్యక్రమం ఉన్నట్లు తమకు సమాచారం లేదన్నారు. తామెవరికీ అనుమతులివ్వలేదని తెలిపారు. ప్రైవేటు వాహదారులు పోలీసు లేదా అత్యవసర సేవల వాహనాల సైరన్‌ను వినియోగించరాదని చెప్పారు.

Updated Date - Dec 22 , 2024 | 11:19 AM