Share News

Jagan's 'Disha' Act : జగన్‌ పాలనలో 6,927పోక్సో కేసులు

ABN , Publish Date - Dec 17 , 2024 | 05:47 AM

‘మహిళలు, చిన్నారుల రక్షణకు దిశ చట్టం తెస్తున్నాం. ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరికంబం ఎక్కిస్తాం’.. ఐదేళ్ల క్రితం (2019 డిసెంబరు 13) అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి.

Jagan's 'Disha' Act : జగన్‌ పాలనలో 6,927పోక్సో కేసులు

  • గత ఐదేళ్లలో చిన్నారులపై పెరిగిన ఘోరాలు

  • రోజూ సగటున నలుగురిపై అత్యాచారాలు

  • పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘మహిళలు, చిన్నారుల రక్షణకు దిశ చట్టం తెస్తున్నాం. ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరికంబం ఎక్కిస్తాం’.. ఐదేళ్ల క్రితం (2019 డిసెంబరు 13) అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి. కానీ వాస్తవంలో అందుకు పూర్తి భిన్నంగా ఆయన పాలన సాగించారు. పార్లమెంటులో తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో చిన్నారులు, మహిళలలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. జగన్‌ పాలనలో ప్రతిరోజు సుమారు నలుగురు మైనర్లపై అత్యాచారాలు జరిగినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 6,927 మంది మైనర్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగినట్లు ‘పోక్సో’ కేసులు నమోదైనట్టు తెలిపింది. శిక్షల విషయానికి వస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అధ్వానంగా కేవలం రెండంటే రెండు శాతంగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది(2019) 1,255 పోక్సో కేసులు నమోదయ్యాయి. 2020లో కరోనా రావడంతో ప్రజలు కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితం కావడంతో కాస్త తగ్గాయి. ఆ ఏడాది 1,211 కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. 2021లో 1,331, 2022లో 1,957, 2023లో 1,173 కేసులు నమోదయ్యాయి. ఐదేళ్లలో రాష్ట్రంలో మొత్తం 6,927 కేసులు నమోదు కాగా, 134 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పోక్సో కేసుల్లో ఇంత తక్కువ శాతం శిక్షలు పడలేదు. కేవలం జగన్‌ ప్రచారానికి తప్ప ‘దిశ’ ద్వారా చిన్నారుల్ని కాపాడలేదని, మహిళలకు రక్షణ కల్పించలేదని కేంద్రం వెల్లడించిన గణాంకాలతో స్పష్టమైంది. దిశ అనేది కేవలం ఓ మొబైల్‌ యాప్‌ మాత్రమే.


  • నాడు మహిళలకు అవమానం

జగన్‌ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలే కాదు వారి ఆత్మగౌరవానికీ భంగం వాటిల్లింది. ఇద్దరు మహిళలు (సుచరిత, వనిత) హోంమంత్రులుగా ఉన్నా.. మహిళలను అవమానించినకేసుల సంఖ్య ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల కంటే దేశంలోనే ఏపీలో అత్యధికంగా ఉంది. జగన్‌ పార్టీ ప్రోత్సాహంతో సోషల్‌ సైకోలు, స్థానిక చోటా నాయకులు రెచ్చిపోయారు. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఆధారంగా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో రాష్ట్రంలో మహిళలను అవమానించినట్లు 3,145 కేసులు (11.9 శాతం) నమోదయ్యాయి. ఇక మహిళలపై దాడుల కేసులు 2020లో 17,089, 2021లో 17,752, 2022లో 25,503 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి ఘటనలు జగన్‌ హయాంలో ఎక్కువగా జరిగాయని కేంద్రం వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగాయని పేర్కొంది.

  • నాడు-నేడు ఎంత తేడా..

జగన్‌ ప్రభుత్వంలో ఎన్నో ఘోరాలు జరిగినా చర్యలు తీసుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్‌ సమీపంలో అంధ బాలికపై గంజాయి మత్తులో ఉన్న యువకుడు అత్యాచారయత్నం చేసి, కత్తితో దాడి చేశాడు. కేసు నమోదైంది కానీ శిక్ష పడలేదు. కాబోయే భర్తతో కలిసి జగన్‌ నివాసానికి కూతవేటు దూరంలో కృష్ణా నది ఒడ్డున సేద తీరుతున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే...వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం నిందితుల్లో ఒకడిని అరెస్టు చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాకే గుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. జగన్‌ పార్టీకి చెందిన వ్యక్తులు రేపల్లెలో అమర్నాథ్‌గౌడ్‌ అనే బాలుడ్ని దహనం చేశారు. ఆర్నెళ్ల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి మారింది. నంద్యాల, కడప, తిరుపతి, విశాఖపట్నం, చీరాల తదితర ప్రాంతాల్లో ఒకటి, రెండు రోజుల్లోనే పోలీసులు బాధ్యుల్ని అరెస్టుచేసి కటకటాల్లోకి నెట్టారు. భార్యపై అనుమానంతో ఆరేళ్ల కుమారుడిని చంపి పాతిపెట్టి పారిపోయిన నిందితుడిని పాతికేళ్ల తర్వాత సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.


  • సంచలన తీర్పు

ఇటీవల ఓ కేసులో ప్రకాశం జిల్లా కోర్టు విధించిన శిక్ష దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రకాశం జిల్లా కంభం ప్రాంతానికి చెందిన షేక్‌ అన్వర్‌ బాషా స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు. అదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు. ఆ అమ్మాయి మైనర్‌ కావడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో అన్వర్‌ బాషాను బతికినంత కాలం జైల్లో పెట్టాలంటూ ఒంగోలు పోక్సో కోర్టు డిసెంబరు మొదటి వారంలో సంచలన తీర్పు వెలువరించింది. మైనర్లపై నేరాల కేసుల్లో కఠినంగా వ్యవహరించనున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 17 , 2024 | 05:53 AM