Share News

Jagan's Rule : జగన్‌ ‘పోరుబాట’ రద్దు!

ABN , Publish Date - Dec 30 , 2024 | 03:57 AM

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం విద్యుత్‌ చార్జీలు పెంచారు. విద్యార్థులకు బకాయిలు పెట్టారు. అధికారం పోయాక ఆ తప్పులను కూటమి ప్రభుత్వంపై వేస్తూ ఆందోళన బాటపట్టారు.

 Jagan's Rule : జగన్‌ ‘పోరుబాట’ రద్దు!
YS Jagan

  • ఇటీవల రెండు నిరసనలకు ప్రజల స్పందన అంతంతే

  • సొంత కేడర్‌లోనే వ్యతిరేకత.. దీంతో రద్దు బాట

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం విద్యుత్‌ చార్జీలు పెంచారు. విద్యార్థులకు బకాయిలు పెట్టారు. అధికారం పోయాక ఆ తప్పులను కూటమి ప్రభుత్వంపై వేస్తూ ఆందోళన బాటపట్టారు. వరుస పోరాటాలకు తేదీలను ప్రకటించిన జగన్‌... జనం నుంచి తగిన స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గారు. ఇటీవల రైతు పోరుబాట, విద్యుత్తు చార్జీలపై చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కొరవడింది. దీంతో వచ్చే నెల 3న చేపట్టాలని నిర్ణయించిన ‘ఫీజు రీయింబర్స్‌మెంటు’ పోరుబాటను తాజాగా వాయిదా చేసుకున్నారు. అసలు విషయం చెప్పకుండా విద్యార్థుల పరీక్షల పేరిట వాయిదా వేస్తున్నట్టు కవరింగ్‌ ఇచ్చారు. అయితే నిరసన వాయిదా వేయడం కాదు రద్దు చేసుకున్నట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం ఏడాదైనా గడువు ఇవ్వకుండా ప్రజాందోళనలకు పిలుపునివ్వడం ఏంటని వైసీపీ ముఖ్యనేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వం మెడపై కత్తిపెట్టినట్లుగా ఆందోళనలు చేస్తామంటే ప్రజల్లో చులకన అవుతామని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రైతు పోరుబాట కార్యక్రమం విఫలమైందని, రైతులెవరూ వైసీపీ పిలుపునకు స్పందించలేదని చెబుతున్నారు. మరోవైపు.. అధికారంలో ఉండగా విద్యుత్‌ చార్జీలను పెంచేసి, అధికారాన్ని కోల్పోయిన వెంటనే కరెంటు చార్జీలపై ఆందోళన నిర్వహించడాన్ని కూడా కొందరు వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు బకాయిలు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ విషయం మరిచిపోయి కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదంటూ మండలస్థాయిలో నిరసన కార్యక్రమానికి జగన్‌ పిలుపు ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు.


వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇంకా పోలేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాందోళనలు చేసేందుకు కేడర్‌ కూడా సహకరించడం లేదని చెబుతున్నారు. రైతు పోరుబాట, విద్యుత్‌ చార్జీలపై నిరసనలకు పట్టుమని పది జిల్లాల్లో కూడా చెప్పుకోదగ్గ కేడర్‌ పాల్గొనలేదని గుర్తు చేస్తున్నారు. మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన నేతలు కూడా నిరసన కార్యక్రమాలకు కనీసం వంద మందిని తీసుకురాలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో నిరసన కార్యక్రమమంటే ప్రజల్లో చులకనవుతామని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలు, కేడర్‌ ఆహ్వానించడం విశేషం.

Updated Date - Dec 30 , 2024 | 08:19 AM