Andhra Pradesh: జేపీ వెంచర్స్ నోట్‌ఫైల్ గల్లంతు?
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:29 AM
Andhra Pradesh: గనుల శాఖలో చీకటి దందాలు సాగుతున్నాయని, అతి ముఖ్యమైన నోట్‌ఫైల్స్‌ను కనబడకుండా చేశారని ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే అక్షరసత్యమైంది.
జేపీ వెంచర్స్ నోట్‌ఫైల్
‘ఆంధ్రజ్యోతి’ చెప్పినట్టే ఇసుక కీలక డేటా మాయం
జేపీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటూ బ్యాంకులకు
నాడు వెంకటరెడ్డి లేఖ.. ఎన్‌వోసీ, నోడ్యూస్ సర్టిఫికెట్
దానిపై నిర్ణయాల సమాచారం కనిపించడం లేదు
తాజాగా గుర్తించిన గనుల అధికారులు
ఫలితాలకు ముందే గనుల శాఖలో ఫైళ్లు గాయబ్
బకాయుల వసూళ్ల పేరిట జేపీ వెంచర్స్‌కు
మళ్లీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
ఆపై వెంకటరెడ్డిపై చర్యలకు అవకాశం!
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గనుల శాఖలో చీకటి దందాలు సాగుతున్నాయని, అతి ముఖ్యమైన నోట్‌ఫైల్స్‌ను కనబడకుండా చేశారని ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే అక్షరసత్యమైంది. ఇసుక టెండర్లకు సంబంధించి జేపీ వెంచర్స్‌తో జరిపిన లావాదేవీలు, బ్యాంకు గ్యారంటీ చెల్లింపు, బకాయిలు లేవని ధ్రువీకరణ ఇవ్వడానికి సంబంధించిన నోట్‌ఫైల్స్ కనిపించడం లేదు. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి వరకు పంపిన ఫైల్సే ఉన్నాయి. ఏపీఎండీసీ ఎండీ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన నోట్‌ఫైల్స్ కనిపించడం లేదని తాజాగా అధికారులు నిర్ధారించారు. ‘‘గనుల ఫైళ్లు గల్లంతు’’ శీర్షికన గత నెల 21న ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించింది. గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్ష ఉంటుంద ని అధికారులకు మూడురోజుల ముందే సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారం చర్చకొస్తుందని, సీఎం ప్రశ్నించే అవకాశం ఉందని అధికారులు ముందు జాగ్రత్తగానే కొన్ని పైళ్ల ఆనవాళ్లను వెతికారు. ఇందులో ఇసుక కాంట్రాక్టు ఫైళ్లను గుర్తించారు. 2021 మే నుంచి 2023 మే వరకు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన కాంట్రాక్టును జేపీ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ కాంట్రాక్టు తీసుకున్నందుకు ఆ సంస్థ ఏపీఎండీసీకి రూ.120 కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీ సమర్పించింది.
అలాగే, ఆ సంస్థ నికరంగా ఇంకా ఎండీసీకి రూ.289 కోట్ల మేర బకాయి ఉంది. ఎన్నికల ఫలితాలు రావడానికి కొద్ది రోజుల ముందే అత్యంత కీలకమైన ఇసుక ఫైళ్లలో ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను తొలగించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఎండీ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ఫైల్స్ కనిపించడం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నతాధికారులు నివేదించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి..అన్న అంశంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.
జేపీ వెంచర్స్‌కు నోటీసులు..: ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే జేపీ వెంచర్స్‌కు రూ.120 కోట్ల బ్యాంకు గ్యారంటీలు చెల్లించాలని ఏపీఎండీసీ ఎండీ హోదాలో వెంకటరెడ్డి బ్యాంకుకు లేఖ రాసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ సంస్థకు బకాయిలు లేవని (నో డ్యూ) సర్టిఫికెట్, నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు తెలిసింది. వీటి జారీకి అవసరమైన నోట్‌ఫైల్స్ కూడా లేవని గుర్తించారు. ఈ నేపఽథ్యంలో, పాత లెక్కల ప్రకారమే జేపీ వెంచర్స్‌కు బకాయులు రూ.289 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో, ఆ సంస్థ ఎలా స్పందిస్తుందన్నదానిపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ సంస్థ తాను ఎండీసీకి రూపాయి బకాయి లేనంటూ.. నో డ్యూ సర్టిఫికెట్, నిభ్యంతర పత్రం చూపిస్తే వాటి ని రద్దుచేసి, వెంకటరెడ్డిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేసే అవకాశం ఉంది.
Also Read:
నెల రోజులు కాకుండానే ఎదురుదాడి..
జగన్‌కు ఝలక్.. ఇక నో హై సెక్యూరిటీ జోన్!
తొలిసారి 80,000 క్లబ్‌లోకి సెన్సెక్స్.. మరోవైపు నిఫ్టీ కూడా
For More Andhra Pradesh News and Telugu News..