Justice Prashant Kumar Mishra : హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:36 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఘన సన్మానం
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం జస్టిస్ మిశ్రాకు శాలువా కప్పి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వచ్చిన జస్టిస్ మిశ్రా.. న్యాయవాదుల సంఘం ఆహ్వానం మేరకు హైకోర్టుకు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీజేగా పనిచేసిన కాలంలో ఎంతగానో ఆదరించారని అన్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఎంతో సౌమ్యులు, మంచివారని కొనియాడారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమని తెలిపారు. ఏపీ హైకోర్టులో బార్ అండ్ బెంచ్ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీహరి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.