YS Jagan: జగన్‌కు మరో ఝలక్.. సొంత పార్టీ నేతలే..!
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:33 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు(YS Jagan) గట్టి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని తిరస్కరణ ఎదురైంది. సొంత జిల్లాల్లోనే ఆయన చేదు అనుభవం ఎదుర్కొన్నారు. శనివారం కడపకు(Kadapa) వెళ్లిన జగన్‌కు..
కడప, జూన్ 22: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు(YS Jagan) గట్టి షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. ఇప్పటికే పార్టీ ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి ఊహించని తిరస్కరణ ఎదురైంది. సొంత జిల్లాల్లోనే ఆయన చేదు అనుభవం ఎదుర్కొన్నారు. శనివారం కడపకు(Kadapa) వెళ్లిన జగన్‌కు రాయలసీమ వైసీపీ నేతలు ముఖం చాటేశారు. ఒకరిద్దరు నేతలు మినహా మిగతా వారెవరూ ఆయనను కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు రాలేదు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత.. ఎమ్మెల్యే వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు శనివారం వెళ్లారు. ఇందులో భాగంగా తాడేపల్లి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, జగన్ రాక సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన కొద్దిమంది వైసీపీ నేతలు మాత్రమే ఎయిర్‌పోర్టుకు వచ్చి స్వాగతం పలికారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముగ్గురు మాజీ మ్మెల్యేలు తప్ప ఇతర నాయకులెవరూ కనిపించలేదు.
కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో..
కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్.. రోడ్డు మార్గంలో పులివెందులకు బయలుదేరారు. పులివెందులలోనే 5 రోజులు ఉండనున్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, సొంతగడ్డ పులివెందులలోనూ ఎన్నడూ లేని విధంగా భారీస్థాయిలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై సమీక్షలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి సీట్లు వస్తాయనుకుంటే అన్ని జిల్లాల్లోనూ ఘోర ఓటమి ఎదురైంది. దీనిపైనా జిల్లాల నేతలతో జగన్ సమీక్ష జరుపుతారని సమాచారం.
డుమ్మా కొట్టిన జగన్..
ఇదిలాఉంటే.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. సభా సంప్రదాయాల ప్రకారం నిన్ననే(శుక్రవారం) స్పీకర్ ఎన్నిక గురించి వైసీపీ నేతలకు చెప్పారు అధికారపక్షం నేతలు. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి చెప్పారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు సభా సాంప్రదాయాలు ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు మంత్రి పయ్యావుల. స్పీకర్ ఎన్నికలో పాల్గొనాలని కోరారు. పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కు కూడా ఈ విషయం చెప్పాలని పెద్దిరెడ్డిని కోరారు మంత్రి కేశవ్. సభా సంప్రదాయాలను పాటించి చెప్పినప్పటికీ.. జగన్ డుమ్మా కొట్టారు. తాను అసెంబ్లీకి రావడం లేదని సమాచారం పంపించారు. శుక్రవారం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు వైఎస్ జగన్. అయితే, జగన్ నిర్ణయంపై సొంత పార్టీలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.