Share News

YSRCP: వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్

ABN , Publish Date - Nov 12 , 2024 | 07:29 AM

సోషల్‌ మీడియాలో అత్యంత హేయమైన భాషను ఉపయోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, జగన్‌ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రా రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.

YSRCP: వర్రా రవీంద్ర రెడ్డికి 14 రోజుల రిమాండ్

కడప జిల్లా: వైఎస్సార్‌సీపీ (YSRCP) సోషల్ మీడియా యాక్టివిస్ట్ (Social Media Activist) వర్రా రవీంద్ర రెడ్డిని (Varra Ravindra Reddy) పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటలకు కడప రెండో అదనపు మెజి స్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం రవీందర్‌రెడ్డికి జడ్జి 14 రోజుల రిమాండ్‌ (14 days Remand) విధించారు. అలాగే ఈ కేసులో అరెస్టయిన మరో ఇద్దరు నిందితులు ఉదయ్, సుబ్బారెడ్డిలకు 41A నోటీసులు ఇచ్చి పంపాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన పేపర్లను వర్రా రవీంద్రరెడ్డి తరపు లాయర్లు మెజిస్ట్రేట్ ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి వర్రాకు ఈ మేరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు రవీంద్ర రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.


కాగా సోషల్‌ మీడియాలో అత్యంత హేయమైన భాషను ఉపయోగించి పోస్టులు చేసిన ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, జగన్‌ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రా రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి చెందిన ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పీసీసీ చీఫ్‌ షర్మిల సహా కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టిన పాపం ఇప్పుడు వర్రాను వెంటాడుతోంది. ఇటీవల కడప చిన్నచౌక్‌ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పించారు. దీంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌తో పాటు చిన్నచౌక్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తేజోమూర్తిపై వేటు పడింది.

కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వర్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈ సైబర్‌ సైకోపై వచ్చిన ఫిర్యాదులు అన్నింటినీ పోలీసులు సీరియ్‌సగా తీసుకుని ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. అనధికారిక సమాచారం మేరకు ఆదివారం సాయంత్రానికి 20కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలిసింది. కడప, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో వర్రాపై కేసులు నమోదయ్యాయి. అతని పోస్టుల్లోని వ్యాఖ్యల్లో తీవ్రత, వీడియోల్లో అశ్లీలత, ఫొటోల్లో అసభ్యత ఆధారంగా బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌లలో చేర్చినట్లు తెలిసింది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలకు బలమైన అండగా ఉండే కులాల మధ్య చిచ్చుపెట్టేలా పెట్టిన పోస్టులపై బీఎన్‌ఎస్‌ 111 కింద.. ఫేక్‌, మార్ఫింగ్‌ ఫొటోలు పోస్టు చేయడంపై 67ఏ ఆఫ్‌ ఐటీ యాక్ట్‌, జుగుస్పాకరంగా ఉన్న వీడియోలకు సంబంధించి బీఎన్‌ఎస్‌ 353(2), సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులపై పెట్టిన పోస్టులకు బీఎన్‌ఎస్‌ 336(4) సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేసినట్లు సమాచారం. వర్రా రవీంద్రా రెడ్డి చేసిన పోస్టులకు ఈ సెక్షన్లన్నీ వర్తిస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బీఎన్‌ఎస్‌ 111, చైల్డ్‌ అబ్యూజ్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే ఆ వ్యక్తి జీవితం ఇక జైలుకే పరిమితం అవుతుంది.


వర్రాతో పాటు రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరెవరు, ఎప్పుడెప్పుడు చేశారనే వివరాలను ప్రతి జిల్లాలో పది మందితో కూడిన పోలీసు టెక్నికల్‌ బృందం వెలికి తీస్తోంది. ఎక్కడికక్కడ బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని సోషల్‌ సైకోలను వీలైనంత ఎక్కువకాలం జైలుకు పంపేందుకు పోలీసులు ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నారు. దీనికితోడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని బిల్లు రూపంలో పెట్టే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అది అమల్లోకి వస్తే సోషల్‌ మీడియాలో జుగుప్సాకరమైన పోస్టులు పెట్టిన సుమారు 80మందికి పైగా వైసీపీ సోషల్‌ సైకోలను ఏళ్ల తరబడి జైల్లో పెట్టే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం ద్వారా వర్రా రవీంద్రా రెడ్డి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారనీ, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్‌ రాజు ఆదివారం మడకశిర పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అడ్డగోలు పోస్టులు.. నిజామాబాద్‌ వాసి అరెస్టు..

వైసీపీ సోషల్‌ మీడియా ముసుగులో టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్న వ్యక్తిని మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నార్త్‌ సబ్‌డివిజన్‌ డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ కథనం మేరకు... తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా మెడోరా గ్రామానికి చెందిన బద్దం అశోక్‌రెడ్డి వైసీపీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేశ్‌ తదితర ముఖ్యనేతల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సా్‌పలలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. అశోక్‌రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించి అశోక్‌రెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడ్ని మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించిందని డీఎస్పీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం.. వెండి ధరలు..

తెలంగాణ నిన్ను మర్చిపోయింది

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 12 , 2024 | 07:40 AM