Share News

CID Investigation : బ్యాంకుకూ బురిడీ!

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:21 AM

వాటాల కోసం అసలు యజమానిని బెదిరించి, భయపెట్టడమే కాదు... బ్యాంకునూ బురిడీ కొట్టించారు. నిబంధనలను అతిక్రమించి మరీ కాకినాడ సీపోర్టులో 41 శాతం వాటాను కొట్టేశారు. ‘మాఫియా మోడల్‌’లో బయటపడిన కొత్త కోణమిది! విజిలెన్స్‌, మారిటైం బోర్డులను ఉసిగొల్పి...

CID Investigation : బ్యాంకుకూ బురిడీ!

  • కాకినాడ పోర్టులో బలవంతపు దందా

  • ఎన్‌వోసీ ఇచ్చేందుకు యాక్సిస్‌ బ్యాంకు ‘నో’

  • బాకీ కట్టకుండా వాటాల బదిలీ కుదరదని స్పష్టం చేసిన బ్యాంకు

  • అయినా పట్టించుకోని విక్రాంత్‌ రెడ్డి

  • బలవంతంగా కేవీ రావుతో సంతకాలు

  • దీనిపై అప్పట్లోనే బ్యాంకు తీవ్ర స్పందన

  • నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహం

  • 2021 ఏప్రిల్‌ 25న కేవీరావుకు ఘాటు లేఖ

  • బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేందుకు నిరాకరణ

  • పోర్టులో సీఐడీ బృందం విస్తృత తనిఖీలు

  • పెన్‌ డ్రైవ్‌లలో కీలక సమాచారం

  • పదుల సంఖ్యలో కీలక ఫైళ్లు స్వాధీనం

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

వాటాల కోసం అసలు యజమానిని బెదిరించి, భయపెట్టడమే కాదు... బ్యాంకునూ బురిడీ కొట్టించారు. నిబంధనలను అతిక్రమించి మరీ కాకినాడ సీపోర్టులో 41 శాతం వాటాను కొట్టేశారు. ‘మాఫియా మోడల్‌’లో బయటపడిన కొత్త కోణమిది! విజిలెన్స్‌, మారిటైం బోర్డులను ఉసిగొల్పి... సంతానం ఆడిట్‌ కంపెనీతో తప్పుడు నివేదిక ఇప్పించి... ప్రభుత్వానికి రూ.994కోట్లు ఎగవేశారంటూ కాకినాడ సీపోర్టు యజమాని కేవీరావును బెదిరించి 41శాతం వాటాను కారుచౌకగా కొట్టేసిన వైనంపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది. అప్పట్లో కేవీరావును అమెరికా నుంచి రప్పించి మరీ సంతకాలు చేయించుకున్నారు. ఈ క్రమంలో... వారికి యాక్సిస్‌ బ్యాంకు నుంచి కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఆ బ్యాంకును సైతం బురిడీ కొట్టించి... ‘డీల్‌’ ముగించినట్లు తెలిసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కాకినాడ సీపోర్టు వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం హైదరాబాద్‌లోని యాక్సిస్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. పోర్టులో వాటాలు బదిలీ చేయాలంటే యాక్సిస్‌ బ్యాంకు నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. ఈ నేపథ్యంలో బ్యాంకును ఎన్‌వోసీ కోరుతూ 2020 డిసెంబరు 28న కేవీరావుతో లేఖ రాయించారు. 41.12శాతం వాటాను అరబిందోకు రాసిచ్చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.


కానీ... అరబిందోతో డీల్‌ను పరిశీలించిన బ్యాంకు ఎన్‌వోసీ ఇవ్వడానికి అంగీకరించలేదు. తమకు సీపోర్టు బాకీ ఉన్న నేపథ్యంలో ఎన్‌వోసీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ... విక్రాంత్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి బ్యాంకుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే.. బకాయిలు చెల్లించందే ఎన్‌వోసీ ఇచ్చేదిలేదని బ్యాంకు తేల్చి చెప్పింది. దీంతో... ‘బ్యాంకు ఎన్‌వోసీ ఇవ్వకున్నా పర్లేదు. వాటాలు బదిలీ చేయండి’ అంటూ కేవీరావుపై ఒత్తిడి తెచ్చారు. ఇలా చేస్తే తర్వాత న్యాయపరంగా తాను చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపినా వినిపించుకోలేదు. బ్యాంకు ప్రమేయం, అనుమతి లేకుండానే వాటాలు రాయించేసుకున్నారు. దీనిపై అప్పట్లో యాక్సిస్‌ బ్యాంకు తీవ్రంగా స్పందించింది. తమ బ్యాంకు అనుమతి లేకుండా వాటాలు బదిలీ చేయడం తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంది. తమ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడమేనని హెచ్చరించింది. సీపోర్టుకు ఇకపై ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చేది లేదని 2021 ఏప్రిల్‌ 22న స్పష్టం చేసింది. కొత్తగా రూ.131కోట్ల బ్యాంకు గ్యారెంటీ కోసం పెట్టుకున్న దరఖాస్తును తోసిపుచ్చింది.

  • పెన్‌డ్రైవ్‌ల్లో మొత్తం సేకరణ..

కాకినాడ సీపోర్టులో రెండు రోజుల కిందట 12 మందితో కూడిన సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాటాల బదిలీ ప్రక్రియలో విక్రాంత్‌రెడ్డి ప్రమేయంపై ఆరా తీశారు. ఐదేళ్ల కార్గో లావాదేవీలు, పోర్టుకు వచ్చిన ఆదాయం.. అరబిందో చేతిలోకి వాటా వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆ కంపెనీ తరఫున పని చేస్తున్న డైరెక్టర్లకు సంబంధించిన వివరాలు సేకరించారు. కీలక సమాచారాన్ని పెన్‌డ్రైవ్‌లలో తీసుకున్నారు. 51 కీలక ఫైళ్లను గుర్తించి వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 08 , 2024 | 04:22 AM