AP Elections: కారంపూడిలో వైసీపీ మూకల విధ్వంసం
ABN , Publish Date - May 15 , 2024 | 03:50 AM
పట్టపగలు... నడి వీధుల్లో వైసీపీ మూకలు అరాచకం సృష్టించాయి. కిరాయి రౌడీలతో కలిసి వీరంగం వేశాయి.
కారంపూడిలో వైసీపీ మూకల స్వైర విహారం
రాడ్లు, కర్రలతో వందల మంది వీరంగం
30 కార్లు, 300 మంది రౌడీలతో విధ్వంసం
దగ్గరుండి రెచ్చగొట్టిన పిన్నెల్లి సోదరుడు
మాచర్ల టౌన్, మే 14: పట్టపగలు... నడి వీధుల్లో వైసీపీ మూకలు అరాచకం సృష్టించాయి. కిరాయి రౌడీలతో కలిసి వీరంగం వేశాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో మంగళవారం కనీవినీ ఎరుగని స్థాయిలో భయానక వాతావరణం నెలకొంది. ‘‘మాచర్ల నియోజకవర్గంలో మనకు ఎదురుండకూడదు. ఎదిరించే వారిని అంతం చేద్దాం. పోలింగ్ రోజున మనపై ఎదురు తిరుగుతారా! నా కొడుకులందరినీ చంపేద్దాం. ఆస్తులు తగలబెడదాం. మన పేరు చెప్తే నియోజకవర్గం మొత్తం హడలిపోవాలి. మనజోలికి రావాలంటే గుండెలు అదిరిపోవాలి’’... అంటూ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామి రెడ్డి తమ రౌడీ మూకలను రెచ్చగొట్టారు. నియోజకవర్గంలో తన అనుయాయులతోపాటు... పొరుగునే ఉన్న తెలంగాణలోని నల్లగొండ జిల్లా హాలియా మండలం నుంచి 300 మందికిపైగా కిరాయి మూకలను మాచర్లకు రప్పించారు. వీరందరికీ మాచర్ల-సాగర్ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ గ్యారేజీ పక్కన ఉన్న వెంచర్‌లో మందు, విందు ఏర్పాటు చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి వీరందరినీ రెచ్చగొట్టి 30 కార్లు, ఇతర వాహనాల్లో కారంపూడికి చేరుకున్నారు. వీరంతా చెక్‌పోస్టు సెంటర్‌కు చేరుకొని రాడ్లు, కర్రలు, మారణాయుధాలతో రోడ్డుపై హల్ చల్ చేశారు. ‘తన్నండి.. తరమండి.. తగలబెట్టండి.. ఎవర్నీ వదిలిపెట్టొదు’ అంటూ పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి రెచ్చగొట్టారు.
రౌడీలు విధ్వంసం చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ నేత కారును తగలబెట్టారు. చిరువ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేస్తూ రాళ్లు రువ్వారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణస్వామిపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో సీఐ మెడకు గాయాలుకాగా రక్తస్రావమైంది. ఏం జరుగుతోందో అర్థంకాక సామాన్య ప్రజలు భీతిల్లిపోయారు. సుమారు గంటసేపు కారంపూడిలో రౌడీ మూకల విధ్వంసకాండ కొనసాగింది. గురజాల డీఎస్పీ పల్లపురాజు కారంపూడికి చేరుకొని వెంకట్రామి రెడ్డిని, రౌడీ మూకలను కారంపూడి నుంచి బయటకు వెళ్లగొట్టారు. వీరంతా మాచర్ల మండలం రాయవరం జంక్షన్‌కు చేరుకొని మంతనాలు చేశారు. పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాలువాయిగేటులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడిపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు... ఆ గ్రామాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు ఆయన సోదరుడు వెంకట్రామి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రౌడీ మూకలు మంగళవారం రాత్రి పొద్దుపోయాక కూడా పట్టణ శివారులోనే పాగా వేశాయి. ఏ క్షణాన్నైనా నియోజకవర్గంలోని టీడీపీ సానుభూతిపరుల గ్రామాలపై పడి దాడి చేసేందుకు వ్యూహం రచించుకున్నారు.