Tiruvuru: భయంతో పరుగులు పెట్టిన మహిళ.. విషయం ఇదే..
ABN , Publish Date - Dec 01 , 2024 | 08:05 AM
తిరువూరు గొల్లపల్లి ఎంక్లేవ్‌లో తాచుపాము హల్‌చల్ చేసింది. రవికుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశించిన తాచుపాము కుటుంబసభ్యులను భయాందోళనలకు గురి చేసింది. రోజువారీ లాగానే రవికుమార్ భార్య ఇవాళ ఉదయం వంటగదిలోకి వెళ్లింది.
తిరువూరు: ఆదివారం తెల్లవారుజామున ఓ కుటుంబం మెుత్తం షాక్‌కు గురైంది. పని నిమిత్తం వంట గదిలోకి వెళ్లిన మహిళకు ఊహించని ఘటన ఎదురైంది. గదిలో ఉన్న దాన్ని చూసి భయభ్రాంతులకు గురైంది. ఆమె వెంటనే కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనంతరం మహిళ వద్దకు చేరుకోగా ఆమె చెప్పిన విషయం విని అంతా అవాక్కయ్యారు. భయంతో వారంతా ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు.
తిరువూరు గొల్లపల్లి ఎంక్లేవ్‌లో తాచుపాము హల్‌చల్ చేసింది. రవికుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశించిన తాచుపాము కుటుంబసభ్యులను భయాందోళనలకు గురి చేసింది. రోజువారీ లాగానే రవికుమార్ భార్య ఇవాళ ఉదయం వంటగదిలోకి వెళ్లింది. అయితే అప్పటికే పాము అక్కడ తిష్టవేసింది. ఇది గమనించని ఆమె వంట పనులు చేయడం ప్రారంభించింది. కాసేపటి తర్వాత అలికిడి వినిపించడంతో ఏంటా అని అటువైపు చూసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాచుపాముని చూడడం, ఆమెను చూసి అది పడగ విప్పి బుసలు కొట్టడంతో కేకలు వేస్తూ హాలులోకి పరుగులు పెట్టింది. అప్పటికే నిద్రలో ఉన్న కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తం అయ్యారు. భార్య వద్దకు చేరుకున్న రవికుమార్ విషయం ఏంటని ప్రశ్నించగా.. వంటగదిలో జరిగిన విషయం చెప్పింది ఆ మహిళ. దీంతో వారంతా ఇంటి నుంచి పరుగులు పెట్టారు.
అనంతరం రవికుమార్.. ఉయ్యూరుకు చెందిన స్నేక్ క్యాచర్ జయప్రకాశ్‌కు సమాచారం అందించారు. కాసేపటి తర్వాత జయప్రకాశ్ అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, కుటుంబసభ్యులు, స్నేక్ క్యాచర్ అంతా కలిసి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే వంట గది నుంచి హాలులోకి వచ్చిన తాచుపాముని గమనించి చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే ఇలా పాము ఇంట్లోకి ప్రవేశించడంపై స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు.
శీతాకాలంలో వేడి ప్రదేశాల కోసం పాములు వెతుకుతాయని నిపుణులు చెబుతున్నారు. వెచ్చగా ఉండే వంటగది, గ్యాస్ స్టవ్ లోపల పాములు ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రోజూ ఉదయం ఓ సారి వంటగదిని చెక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.