Share News

Andhra Pradesh: మా ఉద్యోగాలు మాకివ్వండి.. మాజీ వాలంటీర్ల డిమాండ్..

ABN , Publish Date - Jun 20 , 2024 | 01:22 PM

ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు గోసపడుతున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని వాపోతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యోగాలిస్తే.. ప్రజా సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Andhra Pradesh: మా ఉద్యోగాలు మాకివ్వండి.. మాజీ వాలంటీర్ల డిమాండ్..
Andhra Pradesh Volunteers(File Photo)

మచిలీపట్నం, జూన్ 20: ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు గోసపడుతున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని వాపోతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఉద్యోగాలిస్తే.. ప్రజా సేవ చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తున్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయానికి రాజీనామా చేసిన వాలంటీర్లు భారీగా చేరుకుంటున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కమిషనర్ బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వాలంటీర్లు అంతా కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు.


కమిషనర్ బాపిరాజు ఏమన్నారంటే..

రాజీనామా చేసిన వాలంటీర్లు ఉద్యోగాల విషయమై తమకు వినతిపత్రం ఇచ్చారని తెలిపారు. ఈ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ముందు మచిలీపట్నంలో 700 పైబడి మంది వాలంటీర్లు వివిధ కారాణాలతో రాజీనామా చేశారని.. వారి రాజీనామాలను ఇప్పటికే ఆమోదించామని కమిషనర్ బాపిరాజు తెలిపారు.


వైసీపీ నాయకులపై వాలంటీర్ల ఫిర్యాదు..

ఇదిలాఉంటే.. గుడివాడ ప్రాంతంలోని మాజీ వాలంటీర్లు వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇళ్లకు వచ్చి బెదిరింపులకు పాల్పడి.. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఆరోపించారు. వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వార్డు వాలంటీర్లు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తాము రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు ఒకటికి పది సార్లు ఫోన్లు చేసి వేధించారని ఆరోపించారు. అన్నీ తాము చూసుకుంటామని.. రాజీనామా చెయ్యండని ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. రాత్రి వేళల్లో తమ ఇళ్లకు వచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు వాలంటీర్లు ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై వైసీపీ నేతలను ప్రశ్నిస్తుంటే పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమని ఆదుకోవాలన్నారు. వైసీపీ నాయకుల టార్చర్ తట్టుకోలేకనే తాము రాజీనామా చేశామన్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 20 , 2024 | 03:26 PM