TDP: ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడే..: అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Apr 14 , 2024 | 07:04 AM
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల ప్రచారానికి (Election Campaign) ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి (Kodikatti) 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడేనని అన్నారు. డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజీ నేతృత్వంలో రూపొందించిన డ్రామా ఇదని ఆయన అన్నారు.
2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదని అచ్చెన్నాయుడు అన్నారు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే జగన్ అండ్ కో పేర్నినాని, అంబటి రాంబాబు లైన్‌లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించారని నీలిమీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, కాలం చెల్లిన ఇటువంటి డ్రామాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని జగన్ గుర్తించాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కాగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని వ్యాఖ్యానించింది. దెబ్బతగిలిందని నటించబోయే ముందు... కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. కాగా ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. విజయవాడలో సీఎం వైయస్ జగన్‌పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.
జగన్‌పై రాయి దాడి.. స్వల్ప గాయం
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.