Share News

Historical Place: ఈ చారిత్రక ప్రదేశం గురించి మీకు తెలుసా..

ABN , Publish Date - Dec 08 , 2024 | 03:57 PM

Challapalli Rajavari Fort: చల్లపల్లి.. ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది చల్లపల్లి రాజావారి కోట. నాలుగున్నర శతాబ్దాల చరిత్రకు సజీవసాక్ష్యంగా రాజా వారి రాచరికానికి చిహ్నంగా నిలుస్తోంది.

Historical Place: ఈ చారిత్రక ప్రదేశం గురించి మీకు తెలుసా..
Challapalli Rajavari Fort

  • చరిత్రకు సజీవసాక్ష్యం చల్లపల్లి కోట

  • దేవరకోట సంస్థానానికి రాజధానిగా చల్లపల్లి

  • పర్యాటకులను ఆకర్షించే రాజసౌధం

  • జడ్పీ చైర్మన్‌గా, రాష్ట్రమంత్రిగా చల్లపల్లి రాజా

  • నేటికీ కోటలో మోగే కంచు గంట

చల్లపల్లి, డిసెంబర్ 08: చల్లపల్లి.. ఈ పేరు చెబితే గుర్తుకొచ్చేది చల్లపల్లి రాజావారి కోట. నాలుగున్నర శతాబ్దాల చరిత్రకు సజీవసాక్ష్యంగా రాజా వారి రాచరికానికి చిహ్నంగా నిలుస్తోంది. చల్లపల్లి వచ్చిన వారెవరైనా కోట చూసి వెళ్లాల్సిందే. చల్లపల్లి రాజాగా పేరొందిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్‌ బహద్దూర్‌ రాచరిక ప్రభువుగానే కాకుండా, ప్రజాప్రతినిధిగానూ ప్రజలకు సేవలందించారు. పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకునే చల్లపల్లి రాజా వారి కోట, వారి చరిత్రపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


కృష్ణా మండలంలోని జమిందారీ సంస్థానాల్లో అతిపురాతనమైన వాటిలో దేవరకోట ఒకటి. చల్లపల్లి రాజధానిగా జమిందార్లు పరిపాలన చేపట్టారు. 190 చదరపు మైళ్ల జమీ వైశాల్యంతో ఉన్న చల్లపల్లి సంస్థానానికి 448ఏళ్ల చరిత్ర ఉంది. దీని పరిధిలో 66 గ్రామాలు, రెండు అగ్రహారాలు, పాలేలు, శివార్లు కలుపుకుని సుమారు 100 గ్రామాలకు పైనే ఉండేవి.


రాచరికానికి ‘ప్రజాప్రతినిధి’..

చల్లపల్లి రాజాగా పేరొందిన శ్రీమంతు యార్లగడ్డ శివరామప్రసాద్‌ బహదూర్‌ రాచరికంలోనే కాక ప్రజాస్వామ్యంలోనూ రాణించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందించి చిరస్థాయిగా నిలిచారు. కృష్ణాజిల్లా పరిషత్‌కు తొలి చైర్మన్‌గా వ్యవహరించారు. అవనిగడ్డ ద్విశాసనసభకు ఎన్నికైన చల్లపల్లి రాజా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. చల్లపల్లి రాజాకు ముగ్గురు కుమారులు మల్లిఖార్జునప్రసాద్‌, అంకినీడుప్రసాద్‌, పద్మనాభప్రసాద్‌, ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమారుడు అంకినీడు ప్రసాద్‌ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. దేవరకోట సంస్థానంలో చిట్టచివరగా పట్టాభిషిక్తుడైన రాజు శివరామప్రసాద్‌ బహదూర్‌ మాత్రమే.

Challapalli-Raja.jpg


చల్లపల్లి రాజా పేరిట స్థాపించిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్‌ జూనియర్‌ కళాశాల ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దింది. దివిసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం, పెదకళ్లేపల్లి శ్రీదుర్గా నాగేశ్వర క్షేత్రం, శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి దేవాలయాలకు చల్లపల్లి రాజా వంశీయులు వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. మచిలీపట్నంలో శివగంగ అమ్మవారి ఆలయానికి చల్లపల్లి రాజా వంశీయులే ధర్మకర్తలు. వీటితోపాటు యార్లగడ్డలోని శ్రీరుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయం సైతం ఎస్టేట్‌ ఆలయాల పరిధిలో ఉంది. చల్లపల్లి రాజా వంశీయులు సంగీత, సాహిత్యాభివృద్ధికి విశేష కృషిచేశారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య చల్లపల్లి ఆస్థాన పండితుడిగా ఉండేవారు. చల్లపల్లి రాజా వంశీయులు జగజ్జనని అమ్మవారిని పూజిస్తారు. కోటలో నేటికీ అమ్మవారికి నిత్యపూజలు జరుగుతుంటాయి. గతంలో పర్వదినాల్లో ప్రజలు అమ్మవారిని దర్శించేవారు. దీపావళి, దసరా సమయాల్లో కోటలో అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఆ ప్రదేశంలో ప్రతిరోజూ ముగ్గువేసి ఖాళీగా ఉంచుతారు. విజయదశమికి ఆయుధపూజ చేయటం నేటికీ ఆనవాయితీగా వస్తోంది.

Challapalli-Kota.jpg


ప్రతి గంటా మోగంగా..

చల్లపల్లి కోటలో కంచు గంట ప్రతి గంటకూ మోగుతూనే ఉంటుంది. పూర్వకాలంలో ప్రజలకు సమయాన్ని తెలిపేందుకు కంచుతో తయారుచేసిన గంటలను ఏర్పాటుచేశారు. గడియారాలు అందుబాటులో లేని కాలంలో కోటలో గంటల సమయం ఆధారంగా ప్రతి నిత్యం దినచర్య ప్రారంభమయ్యేదని చెబుతుంటారు. పూర్వం కోటలో 4 గంటలు మోగుతుండేవి. కోటలో ఒకచోట, కోట ఆవరణ కింద భాగంలో, ఉత్తర, దక్షిణ దర్వాజాల వద్ద గంటలు మోగిస్తూ ఉండేవారు. తొలుత కోటలో గంట మోగించిన తర్వాత మిగిలిన చోట్ల గంటలు మోగించేవారు. శబ్దకాలుష్యం తక్కువగా ఉన్న ఆ రోజుల్లో కోట గంట చుట్టు పక్కల గ్రామాలకు సైతం వినిపించేదని చెబుతారు. కోట గంట ద్వారా సమయం తెలుసుకోవాల్సిన అవసరం లేకున్నా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికీ 2 చోట్ల గంట మోగిస్తూనే ఉన్నారు. కోట ఆవరణలో ఒకచోట, దక్షిణంవైపు ప్రధాన ప్రవేశద్వారం వద్ద మరో గంట మోగిస్తున్నారు.

Challapalli-Kota-Ganta.jpg


పర్యాటక ఆకర్షణ..

చల్లపల్లి కోటకు మూడున్నర శతాబ్దాల చరిత్ర ఉన్నట్టు చెబుతారు. ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. సుదూర ప్రాంతాలు, దివి ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలను చూసేందుకు వచ్చినవారు చల్లపల్లి వచ్చి కోటను చూసి వెళుతుంటారు. సుమారు 20 ఎకరాల్లో ఉండే కోట, కోట బురుజులు, పచ్చదనానికి, ప్రశాంతతకు చిహ్నంగా ఉండే అశోక వృక్షాలు, విశాలమైన ఆవరణ, పూర్వకాలం నాటి జాడీలు, నాటి శిల్పసంపద, ఎత్తైన ప్రధాన ద్వారం సందర్శకులకు ఆకర్షిస్తుంది. చల్లపల్లి రాజా మనుమడు యార్లగడ్డ రామేశ్వరప్రసాద్‌ (అంకినీడు ప్రసాద్‌ కుమారుడు) కోటను గతంలో అభివృద్ధి చేశారు. కోట పైఅంతస్తులో దూలాలు దెబ్బతినటం, ఆర్చ్‌లు పాడవటంతో వాటికి మరమ్మతులు చేయించి సుందర రూపు తీసుకొచ్చారు. ప్రస్తుతం కోటకు ఇంకా మరమ్మతులు చేయాల్సి ఉంది. కోటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే దివిసీమ పర్యాటకంగా అభివృద్ధి చెంది మరింతగా సందర్శకులు పెరిగే అవకాశం ఉంది.


Also Read:

ఇవి అసలు కూరగాయలు కాదట.. పండ్లేనట.

ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..

ఓటమికి వాళ్లే కారణం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Dec 08 , 2024 | 03:57 PM