Nara Lokesh.. ‘జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’: నారా లోకేష్
ABN , Publish Date - Jan 25 , 2024 | 12:22 PM
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని... వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఓడినా విచారం లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని... వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఓడినా విచారం లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని.. ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 'హ్యాపీగా దిగిపోతా.. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ' పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను లోకేష్ షేర్ చేశారు. '56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా' అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు ఈ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార వైపీసీలో భయం బెరుకు కనిపిస్తోంది. ‘వై నాట్ 175’ అంటూ ఇన్నాళ్లూ ఊదరగొట్టిన సీఎం జగన్ స్వరం ఇప్పుడు మారిపోయింది. ఆయన స్వరంలో నిరాశ సుస్పష్టంగా కనిపిస్తోంది. 56 నెలలుగా అధికారంలో ఉన్నానని, మెరుగ్గానే చేశానని భావిస్తునానన్న ఆయన ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతానని అన్నారు.
తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో జగన్ వ్యాఖ్యలు..
‘వై నాట్ 175’ అంటూ ఊరూవాడా ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... తొలిసారిగా నిరాశాపూరిత ‘స్వరం’ వినిపించారు. ‘56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అని వ్యాఖ్యానించారు. పథకాల పేర్లు, అమలు తీరు మార్చి, బటన్ నొక్కిన ప్రతిసారీ సొంత పత్రికకు కోట్ల రూపాయలతో ప్రకటనలు గుమ్మరిస్తున్న జగన్... తాజాగా ప్రజాధనంతో మరో ప్రచార జాతర మొదలుపెట్టారు. రూ.4 కోట్ల ఖర్చుతో తిరుపతిలో ‘ఎడ్యుకేషన్ సమ్మిట్’ పేరిట రెండు రోజుల చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసిన చానల్‌కే రూ.3.50 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ప్రభుత్వ ‘ఇమేజ్ బిల్డప్’ కోసం టైమ్స్ గ్రూప్‌కు రూ.25 కోట్లు సమర్పించిన జగన్... ఇప్పుడు ‘ఇండియా టుడే’ చానల్‌తోనూ అదే తరహా డీల్ కుదుర్చుకోవడం గమనార్హం.
అక్కడా రాజకీయాలే...
బుధవారం రెండో రోజు జరిగిన ‘ఎడ్యుకేషన్ సమ్మిట్’లో సీఎం జగన్ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చర్చను విద్యారంగానికే పరిమితం చేశారా అంటే అదీ లేదు. సుమారు గంటపాటు సాగిన చర్చలో దాదాపు 25 నిమిషాలు రాజకీయాంశాలకు కేటాయించారు. ‘ముందే అనుకున్నట్లు’గా అన్నట్లుగా ఈ ప్రశ్నోత్తరాలు సాగడం మరో విశేషం. ‘మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా’ అని రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశ్నించగా... ‘హోప్ ఈజ్ స్ట్రాంగర్ దేన్ రియాలిటీ’ (వాస్తవం కంటే ఆశ/నమ్మకం బలమైనది) అని జగన్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత... ‘56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అంటూ ఎన్నికల ముందు ‘ఓటమి’ స్వరం వినిపించారు.
‘విభజన’ ఇప్పుడు గుర్తుకొచ్చిందా?
విభజన హామీలు సాధించేందుకు జగన్ ఇన్నేళ్లలో చేసిన ప్రయత్నమే లేదు. కేంద్రానికి తూతూమంత్రం లేఖలు రాయడం తప్ప... ఘాటుగా ప్రశ్నించిందే లేదు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రె్‌సను విమర్శించిందీ లేదు. కానీ... రాష్ట్ర విభజన అన్యాయమైన పద్ధతిలో జరిగిందంటూ హఠాత్తుగా గుర్తుకొచ్చింది. సోదరి షర్మిల పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలపై వరుస ప్రశ్నలు సంధిస్తుండటంతో కాంగ్రె్‌సపై జగన్‌కు బాగా కోపమొచ్చింది. ‘‘కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోంది. అది ఆ పార్టీ సాంప్రదాయం. విభజించి పాలించడం ఆ పార్టీకి అలవాటు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అన్యాయమైన పద్ధతిలో విభజించారు. అలాగే... మా కుటుంబాన్ని కూడా విభజించారు. నేను కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చినప్పుడు... మా చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి, మాపై పోటీకి నిలబెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ సారఽథ్య బాధ్యతలు నా సోదరికి అప్పగించారు. వారికి దేవుడే బుద్ధి చెబుతాడు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. కొత్త రాష్ట్రం కావడంతో కేంద్ర సహకారం అవసరమంటూ ఎన్డీయేలో కొనసాగిన టీడీపీని... జగన్ విపక్షంలో ఉండగా నిత్యం వేధించుకుతిన్నారు. ఇప్పుడు మాత్రం తాను రాష్ట్రంలో అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఉనికి లేదని, తమకు టీడీపీ-జనసేన పార్టీలతోనే పోటీ అని స్పష్టం చేశారు.
నాపై సానుకూలం.. నేతలపై వ్యతిరేకత
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎడాపెడా మార్చేస్తున్న, టికెట్లు నిరాకరిస్తున్న జగన్... తన నిర్ణయాలను సమర్థించుకున్నారు. ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని, కొందరు స్థానిక నాయకుల విషయంలో అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే కొందరికి టికెట్లు ఇవ్వలేదన్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. సామాజిక సమీకరణల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేశామన్నారు.
ప్రతీకారం లేనేలేదట!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ విపక్ష నేతలను కేసుల్లో ఇరికించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ... చంద్రబాబు విషయంలో ప్రతీకారం లేనే లేదని ‘ఎడ్యుకేషన్ సమ్మిట్’లో జగన్ స్పష్టం చేశారు. సీఐడీని దుర్వినియోగం చేశామన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. సీఐడీ కేసులు పెట్టినా కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా అని ప్రశ్నించారు.