Rain Alert: ఏపీలో భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. పెను విషాదం
ABN , Publish Date - Aug 31 , 2024 | 09:26 AM
Andhrapradesh: విజయవాడలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తు రాజపురంలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
విజయవాడ, ఆగస్టు 31: విజయవాడలో (Vijayawada) కుండపోతగా వర్షాలు (Heavy Rains)కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. క్రీస్తురాజపురంలో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండవచ్చని సహాయ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తోంది. ప్రొక్లెయిన్ సాయంతో కొండ రాళ్లను పోలీసులు తొలగిస్తున్నారు. మరోవైపు.. సహాయక చర్యలను దగ్గరుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీ రాజశేఖర్ బాబు పర్య వేక్షిస్తున్నారు.
ఆదుకుంటాం..!
కొండచరియలు విరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని మొదట అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ విషాద వార్త బయటికి వచ్చింది. స్థానికులతో మాట్లాడి ప్రభుత్వం పరంగా అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం పరంగా సాయం అందిస్తామని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు. బస్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు బస్సులు, లారీ లు, కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయిన పరిస్థితి.
రెండు బస్సుల్లో దాదాపు యాభై మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజాము నుంచి బస్సులోనే పడిగాపులుకాస్తున్నారు. అయితే సహాయక చర్యలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది. అటు భారీ వర్షాలకు సున్నపు బట్టీల వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు పడటంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండరాళ్ల కింద ముగ్గురు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వన్‌టౌన్ పితాని అప్పలస్వామి స్ట్రీట్ వద్ద సపోర్ట్ గోడ మెట్లు కూలడంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్న వారు బయటకి రావడంతో ప్రమాదం తప్పినట్లైంది. డ్రైనేజీ నీరు ఇంట్లోకి రావడంతో రాత్రి నుంచి చిన్న పిల్లలు, మహిళలతో జాగారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
సీఎం సమీక్ష
మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తం గా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్‌హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలన్నారు. అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
AP Pensions: ఏపీలో పింఛన్ల పండుగ ప్రారంభం.. సింగవరంలో ఆసక్తికర ఘటన..
భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్లీజ్.. నన్ను విడిచి వెళ్లొద్దు!
Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్
Read Latest AP News And Telugu News