Share News

AP News: పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:52 AM

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

AP News: పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా
Perni Nani wife Jayasudha

కృష్ణా జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani) సతీమణి జయసుధ (Wife Jayasudha) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై (Anticipatory Bail Petition)విచారణ శుక్రవారంనాటికి వాయిదా (Postponement) పడింది. తమ గోడౌన్‌లలో రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోరారు. ఈలోపు జయసుధను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తొందర పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వాలని జయసుధ తరపు న్యాయవాదులు కోరారు. అలా ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే వేసింది.


కాగా 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం (బందరు) తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె గత శుక్రవారం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా జడ్జి బదిలీ చేశారు. దీంతో ఈనెల 16న విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల నుంచి సీడీ ఫైల్ రాకపోవటంతో విచారణను ఈనె 19కి (గురువారం) వాయిదా వేసింది. ఈరోజు విచారణ జరిపినన్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే గత వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆయన కుటుంబ సభ్యుల కోసం బందరు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నాని సన్నిహితుల కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు.


ఇంకోవైపు పీడీఎస్‌ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్‌ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో రేషన్‌ బియ్యం మాయమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో సుమారు 187 టన్నుల పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలించినట్టు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ స్వాహా పర్వం వెలుగు చూడలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలాకాలం పాటు పేర్ని నానికి అనుకూలమైన అధికారులే పౌరసరఫరాల శాఖలో ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు కొద్దిరోజుల క్రితం బియ్యం స్వాహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం టీడీపీ నాయకులకు తెలియడానికి ముందే పేర్ని నానికి చేరిపోయింది. కేసు తీవ్రత గుర్తించిన పేర్ని నాని తప్పించుకునేందుకు తొలి నుంచీ ప్రయత్నిస్తున్నారు. నవంబరు 25న నెలవారీ తనిఖీల్లో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాములకు వెళ్లారు. తనిఖీలు చేస్తే తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో తాళాలు లేవంటూ వారిని తిప్పి పంపేశారు. ఆ మరుసటి రోజే నవంబరు 26న ఆయన కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు లేఖ రాశారు. తన గోదాముల్లో వేబ్రిడ్జిలో లోపాల కారణంగా బియ్యం షార్టేజి వచ్చినట్టు తెలిసిందని, ఎంత మొత్తంలో తక్కువ వస్తే ఆ మేరకు నగదు చెల్లిస్తానంటూ లేఖ రాశారు.

ఈ లేఖతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని బఫర్‌ గోదాముల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. నవంబరు 28, 29, 30 తేదీల్లో అధికారులు బఫర్‌ గోదాముల్లో తనిఖీలు చేశారు. పేర్ని నానికి చెందిన గోదాముల్లో 3,708 బ్యాగుల బియ్యం 187 టన్నులు తగ్గినట్టుగా తేలింది. ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం జేసీ పౌర సరఫరాల శాఖ ఎండీకి లేఖ రాశారు. తగ్గిన బియ్యం ధరకు రెట్టింపు అంటే సుమారు రూ.1.70 కోట్లు జరిమానాగా కట్టించుకుని క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని జేసీకి సూచించారు. జరిమానా నోటీసులు అందిన వెంటనే పేర్ని నాని ఆగమేఘాలపై పావులు కదిపారు. తన సతీమణిపై క్రిమినల్‌ కేసు నమోదైతే ఆమెను అరెస్టు చేస్తారని ఊహించి ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించడంతో పాటు జరిమానా సొమ్మును చెల్లించేశారు. ఈ నెల 11న కేసు నమోదు చేస్తే 14న ఆయన కోటి రూపాయలు చెల్లించేశారు. సోమవారం మిగిలిన రూ.72 లక్షలు కట్టేశారు. సోమవారం రోజే జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఉండటంతో ఆ రోజుకు మొత్తం జరిమానా చెల్లించేస్తే కోర్టు నుంచి ఊరట పొందవచ్చన్న ఆలోచనతో పేర్ని నాని పావులు కదిపారు. అయితే అధికారులు మాత్రం జరిమానా చెల్లించినా పేర్ని జయసుధ క్రిమినల్‌ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేరళలో మంకీపాక్స్ వైరస్ కలకలం

భారత్‌కు అమెరికా గుడ్ న్యూస్..

గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి

గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూత

రైతు కండువాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 19 , 2024 | 11:52 AM