Andhra Jyothy Lucky Draw: ఆంధ్రజ్యోతి డ్రా లో ‘లక్ష’ గెలిచారు!!
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:51 AM
కూటమికి 164 సీట్లు వస్తాయి. వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుంది’ అని ఎన్నికల ఫలితాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసిన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు బహుమతుల పంట పండింది.
‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ డ్రా
పార్కింగ్ స్టాండ్ ఉద్యోగికి తొలి బహుమతి
కర్నూలు గృహిణికి రూ.50 వేలు
మరో ఐదుగురికీ బహుమతులు
కూటమి, వైసీపీకి దక్కే సీట్లపై ఖచ్చితమైన అంచనా
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘కూటమికి 164 సీట్లు వస్తాయి. వైసీపీ 11 స్థానాలతో సరిపెట్టుకుంటుంది’ అని ఎన్నికల ఫలితాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసిన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు బహుమతుల పంట పండింది. ‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ పోటీలో విజేతలను మంగళవారం విజయవాడ ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయంలో డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మొత్తం 13 మంది కచ్చితమైన అంచనా వేయగా... డ్రాలో తొలి బహుమతి విజయవాడకు చెందిన వీరపనేని ముసలయ్యకు లభించింది. ఆయనకు రూ.లక్ష బహుమతి అందించడం జరుగుతుంది. ముసలయ్య విజయవాడ ఆర్టీసీ బస్టాండులో పార్కింగ్ స్టాండ్‌లో ఉద్యోగి. ‘డ్రా’లో రెండో బహుమతి రూ.50వేలు కర్నూలు నగరం కల్లూరుకు చెందిన గృహిణి ఎస్.మహేశ్వరికి దక్కింది. ఇక... ఎ.సాంబశివరావు (ఒంగోలు), ఏసీ బాలన్న (కడప), మామిడి వేదవర్ష (గాజువాక, విశాఖపట్నం), వజ్జా శిరీష (నందిగామ, శ్రీకాకుళం) పుల్లూరు మాధవ్ (మట్టపల్లె, చిత్తూరు)కు రూ.10వేల చొప్పున బహుమతి లభించింది. ఈ ‘డ్రా’ కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ సర్క్యులేషన్ డైరెక్టర్ రామకృష్ణారావుతోపాటు ఎడిటోరియల్, సర్క్యులేషన్, అడ్వర్టైజింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజకీయాలపై ఆసక్తివల్లే..
నేను ‘ఆంధ్రజ్యోతి’ అభిమానిని. 20 ఏళ్లుగా ఆ పత్రిక చదువుతున్నా. రాజకీయాలపై ఆసక్తి బాగా ఎక్కువ. రాజకీయ వార్తలన్నీ చదువుతూ అందరితో చర్చిస్తూ ఉంటాను. నాకున్న అవగాహనతో కూటమికి, వైసీపీకి వచ్చే సీట్లను అంచనా వేసి కూపన్ పంపించాను. అదే నిజమైంది, అదృష్టం వరించింది. ఆంధ్రజ్యోతికి కృత్ఞజతలు!
- వీరపనేని ముసలయ్య
వ్యతిరేకత పసిగట్టాను..
ప్రతిరోజూ ఆంధ్రజ్యోతి దినపత్రిక చదువుతాను. పత్రికలో వచ్చే కథనాలపై ప్రజల్లో బాగా చర్చ జరిగేది. ఎక్కడకు వెళ్లినా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు గురించే మాట్లాడుకునే వాళ్లు. రోడ్లు శిథిలమయ్యాయి. వైసీపీ పాలనపై ప్రజలు విసిగి పోయారని గ్రహించాను. కూటమి భారీ విజయం తథ్యమని అంచనా వేశాను. నా ఊహ నిజమైంది. రెండో బహుమతి గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
- మహేశ్వరి, గృహిణి, కర్నూలు
విజేతలు వీరే..