AP Politics: అన్నతో న్యాయపోరాటానికి సిద్ధమంటున్న షర్మిల..!
ABN , Publish Date - Jul 21 , 2024 | 09:49 AM
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య ఆస్తుల వివాదానికి సంబంధించి ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇద్దరి మధ్య ఆస్తుల వివాదానికి సంబంధించి ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. జగన్ (YS Jagan) వ్యాపారాల్లో షర్మిల తరపున ఓ వ్యాపారవేత్త వంద కోట్ల రూపాయిల పెట్టుబడి పెట్టారంటూ గోనె బాంబు పేల్చారు. ఆ వ్యాపారవేత్త తన షేర్లను షర్మిలకు బదిలీ చేయాలని కోరగా.. జగన్ ఆ ప్రతిపాదనకు ఒప్పులేదన్నారు. తన ఆస్తికోసం గతంలో ఇందిరాగాంధీపై మేనకాగాంధీ చేసినట్లు.. తన ఆస్తికోసం షర్మిల న్యాయ పోరాటం చేయబోతున్నారంటూ గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన ప్రాణమిత్రుడి ద్వారా షర్మిల కోసం రూ.100 కోట్ల వైట్ మనీని పెట్టుబడిగా పెట్టించారని.. ప్రస్తుతం వ్యాపారంలో షేర్లను షర్మిలకు బదిలీ చేసేందుకు జగన్ అంగీకరించడం లేదంటూ గోనె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
ఎన్నికల ముందు నుంచి..
ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్, షర్మిల మధ్య మొదలైన వివాదం చిలికి.. చిలికి గాలివానగా మారిందని.. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల పనిచేసిందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరి ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో పాటు.. తన సొంత అన్నయ్యపై రాజకీయంగా విమర్శలు చేయడం వైసీపీకి గత ఎన్నికల్లో ప్రతికూలంగా మారిందనే చర్చ సాగుతోంది. సొంత తల్లి సైతం కుమార్తెకు అండగా నిలవడం కూడా జగన్‌కు నష్టం చేకూర్చిందనే అభిప్రాయం వైసీపీ నాయకుల నుంచి వ్యక్తమవుతోంది. వైసీపీ ఘోర పరాజయానికి షర్మిల, విజయమ్మ ఒక కారణమంటూ పార్టీలో సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ క్రమంలో అన్నా, చెల్లెల మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. జగన్ నుంచి తన వాటా ఆస్తి పొందడానికి షర్మిల న్యాయ పోరాటం చేయబోతున్నారంటూ ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
రాష్ట్రపతి పాలనకు పార్లమెంటులో నినదించండి
అసలు విషయం ఏమిటంటే..
రాజశేఖర్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ షర్మిల తరపున జగన్ వ్యాపారాల్లో ఓ మధ్యవర్తి వంద కోట్ల రూపాయిల పెట్టుబడి పెట్టారని గోనె తెలిపారు. ప్రస్తుతం ఆ మధ్యవర్తి తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బులను షర్మిల పేరిట బదిలీ చేయాలని కోరగా.. జగన్ అంగీకరించడంలేదని.. దీంతో షర్మిల సైతం తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగినా సానుకూలంగా స్పందిచకపోవడంతో.. న్యాయపోరాటం చేయాలని షర్మిల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఆస్తిలో వాటాపై షర్మిల కోర్టులో కేసు వేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయమై షర్మిల ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆస్తుల పంపకం విషయంలో జగన్‌పై కోపంగా ఉన్నట్లు గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ఆస్తి తగదా కారణంగానే షర్మిల, జగన్ మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొందరు వైసీపీ నేతలే చెబుతున్నారు. షర్మిల ఆస్తి పంపకాలకు సంబంధించిన వివాదం ఉంటే కోర్టును ఆశ్రయించాల్సిందని.. కానీ ఆ వివాదాన్ని రాజకీయాల్లోకి లాగి వైసీపీకి షర్మిల నష్టం చేసిందంటూ స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్పటికీ ఆస్తిలో తనకు రావాల్సిన వాటా తనకు ఇచ్చేయాలని లేదంటే చివరిగా న్యాయపోరాటానికి దిగుతానంటూ జగన్‌ను షర్మిల హెచ్చరించిందనే ప్రచారం జరుగుతోంది.
ఇందిరా పై మేనకా గాంధీ..
తనకు రావాల్సిన ఆస్తికి సంబంధించి మేనకా గాంధీ ఇందిరాగాంధీపై ఏవిధంగా న్యాయ పోరాటం చేశారో.. అదే విధంగా తనకు చెందాల్సిన ఆస్తికి సంబంధించి షర్మిల జగన్‌పై న్యాయపోరాటం చేసే అవకాశం ఉందంటూ గోనె ప్రకాశరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. షర్మిల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. చట్టం ప్రకారం షర్మిల ఆస్తిలో వాటా పొందే అవకాశం ఉంటుందని.. అదే జరిగితే జగన్ రాజకీయంగా మరింత నష్టపోవడంతో పాటు.. జనంలో మరింత చులకన అవుతారనే అభిప్రాయాన్ని గోనె వ్యక్తం చేశారు. నిజంగా ఇందిరాగాంధీపై మేనక గాంధీ చేసినట్లు.. షర్మిల న్యాయ పోరాటం చేస్తారా లేదా అనేదానిపై కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.
జగన్ రాజీ పడతారా..!
షర్మిలతో విబేధాలను పెంచుకోవడం ద్వారా గత ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయామని గ్రహించిన జగన్.. రాజీ మార్గం ద్వారా ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉందని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ వివాదాన్ని మరింత పెంచుకుంటూ పోతే షర్మిల కంటే జగన్ ఎక్కువుగా నష్టపోవల్సి వస్తుందని.. తద్వారా పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా జగన్ చెల్లెళ్లుతో రాజీకి వస్తారా.. లేదా అన్నపై షర్మిల న్యాయ పోరాటం చేస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News