స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ
ABN , Publish Date - Oct 17 , 2024 | 12:25 AM
శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
శ్రీశైలం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ, పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో నిర్వహించిన ఉత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. సాక్షిగణపతికి, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమం ఆకట్టుకుంది.
శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం భ్రమరాంబికాదేవికి లక్ష కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ముందుగా అర్చకులు పూజా సంకల్పం పఠించి అనంతరం మహాగణపతికి పూజలు చేశారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలలో పాల్గ్గొనేందుకు ఆన్‌లైన్ ద్వారా రూ. 1,116 సేవా రుసుమును చెల్లించి పాల్గొనవచ్చు. కాగా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు మొత్తం 24 మంది భక్తులు ఈ సేవలో పాల్గొన్నారు. భక్తులు ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు సూచించారు.
అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఈవో డి.పెద్దిరాజు బుధవారం పరిశీలించారు. వంటశాలలో వండిన వంటకాలు, ప్రాంగణాన్ని, వంటపదార్థాలు, కూరగాయలు భద్రపరచే గదులను పరిశీలించారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరిస్తున్న భక్తులతో అన్న ప్రసాద వితరణపై భక్తుల అభిపాయాలను తెలుసుకున్నారు. రాబోవు కార్తీకమాసంలో భక్తులరద్దీకి అనుగుణంగా అన్నప్రపాద వితరణ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.