Share News

Mangalagiri AIIMS: పేరు ఘనం.. సేవ గగనం

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:13 AM

పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో... గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది.

 Mangalagiri AIIMS: పేరు ఘనం.. సేవ గగనం

  • ఇదీ మంగళగిరి ఎయిమ్స్‌ పరిస్థితి

  • 2019లో వైద్య సేవలు ప్రారంభం

  • అప్పట్లో 300-400 మంది రోగులకు సేవలు

  • నేడు రోజూ 3 వేల మంది వరకూ రాక

  • డిమాండ్‌కు తగ్గట్టు లేని వైద్యులు, వసతులు

  • ఓపీ రిజిస్ట్రేషన్‌కు గంటల కొద్దీ నిరీక్షణ

  • డాక్టర్‌ను కలవాలంటే చాంతాడంత క్యూ

  • అత్యవసరమైతే అంతే సంగతులు

  • ఇంకా ఆరంభంకాని ప్రధాన విభాగాలు

  • పది రూపాయలకే వైద్య సేవలు... అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలు... తక్కువ ధరలకే పరీక్షలు.. సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు.. మంగళగిరి ఎయిమ్స్‌ ప్రత్యేకలు ఇవీ. ఇదంతా ఓ పార్శ్వం మాత్రమే.

  • ఓపీ రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలన్నా.. డాక్టర్‌ను కలవాలన్నా... మందులు తీసుకోవాలన్నా... పరీక్షలు చేయించుకోవాలన్నా గంటల కొద్దీ క్యూలో నిరీక్షించాలి. వైద్యం పొందాలంటే రోగికి ఎంతో ఓపిక, శక్తి ఉండాలి. సీటీస్కాన్‌ లేదా ఎమ్మారై స్కాన్‌ చేయించుకోవాలంటే రోజుల కొద్దీ ఎదురుచూడాలి. పరిస్థితి అత్యవసరమైతే అంతే సంగతులు!

2019లో మంగళగిరి ఎయిమ్స్‌లో వైద్యసేవలు ప్రారంభించినపుడు 300-400 మంది రోగులు వచ్చేవారు. ఇపుడు రోజుకు 3 వేలమంది వరకు ఓపీకి వస్తున్నారు. అందుకు తగినట్టుగా ఓపీ రిజిస్ట్రేషన్స్‌, బిల్లింగ్‌ కౌంటర్లు కానీ, మందుల దుకాణంలోని కౌంటర్లు కానీ పెంచలేదు. మొదట్లో ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ అన్నే ఉన్నాయి. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో వైద్యులు లేరు. కీలకమైన వైద్య విభాగాలను ఇంకా ప్రారంభించనేలేదు.

(మంగళగిరి)

పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో... గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది. బాగా ప్రచారం జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తున్నారు. ఆస్పత్రి నిత్యం కిటకిటలాడుతోంది. ఇదంతా పైకి కనిపించే


దృశ్యం. కానీ రోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. చుట్టు పక్కల జిల్లాల నుంచి మంగళగిరి వచ్చిన రోగులకు... అటు బైపాస్‌ నుంచి కానీ ఇటు బస్టాండ్‌ లేదా రైల్వేస్టేషన్‌ నుంచి కానీ ఎయిమ్స్‌ ప్రాంగణానికి చేరుకోవడం ఓ ప్రహసనంలా ఉంటుంది.

తగిన రవాణా సదుపాయం లేదు. ఎలాగోలా వ్యయప్రయాసలు ఓర్చి ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరాక... అక్కడి నుంచి అసలు కష్టాలు మొదలవుతాయి. ముందుగా టోకెన్‌ కోసం పరిగెత్తాలి. ఆ తర్వాత ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం పరిమితంగా ఉండే కౌంటర్ల వద్ద గంటల కొద్దీ క్యూలో ఉండాలి.

అనంతరం సంబంధిత వైద్యుడి చాంబర్‌ను వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఉండే చాంతాడంత క్యూ లైన్లలో వేచివుండాలి. డాక్టర్‌ రాసిచ్చిన పరీక్షలు చేయించుకోవడానికి ఫీజు కట్టేందుకు మళ్లీ బిల్లింగ్‌ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాలి. బిల్లింగ్‌ అయ్యాక మళ్లీ ల్యాబ్‌ల వద్ద రక్తనమూనాలను ఇచ్చేందుకు ఇంకోసారి కాళ్లకున్న శక్తిని పరీక్షించుకోవాలి.

ఒకవేళ వైద్యుడు ఏ సీటీస్కానో లేదా ఎమ్మారై స్కానో రాశారంటే అంతే సంగతులు. టెక్నీషియన్లు ఇప్పుడు కుదరదంటూ నెలకో, నెలన్నరకో షెడ్యూల్‌ ఇస్తారు. అప్పుడొచ్చి ఆ స్కాన్‌ ఏదో చేయించుకుంటే మళ్లీ పది, పదిహేను రోజుల తరువాత కానీ రిపోర్టు ఇవ్వరు. మంగళగిరి ఎయిమ్స్‌లో రోగులు ఎదుర్కొంటున్న అవస్థలు ఇవీ!


ఆలస్యం ఎందుకంటే...

మంగళగిరి ఎయిమ్స్‌లో 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఓపీడీ బ్లాకు, ఆయుష్‌ బ్లాకులను వినియోగించుకుని అవుట్‌ పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తూ కార్యకలాపాలను కొనసాగించింది.

ఆస్పత్రిలో అతి ప్రధానమైన ఇన్‌పేషెంట్‌ వార్డు తాలూకు భారీ బ్లాకును కూడా సన్నద్ధం చేసుకున్నాక ఈ ఏడాది ఫిబ్రవరి 25న అధికారికంగా ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఆరంభించారు.

2019 ఆరంభకాలంలో ఓపీ రిజిస్ట్రేషన్స్‌ కౌంటర్లు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ అన్నే ఉన్నాయి. మొదట్లో మూడొందల నుంచి నాలుగొందల మంది వరకు రోగులు వచ్చేవారు. ఇపుడు రోజుకు మూడు వేలమంది వరకు ఓపీకి వస్తున్నారు.

రోగుల సంఖ్యకు తగినట్టుగా రిజిస్ట్రేషన్స్‌ కౌంటర్లు కానీ, బిల్లింగ్‌ కౌంటర్లు కానీ, మందుల దుకాణంలో కౌంటర్లు కానీ పెంచలేదు. మొదట్నుంచీ ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ అన్నే ఉన్నాయి. దీంతో ఎయిమ్స్‌ ఓపీడీ బ్లాకు అంతా రద్దీగా క్యూ లైన్లతో దర్శనమిస్తూ ఉంటుంది.

ఇక సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌లకు సంబంఽధించి రోజుకు నాలుగొందల వరకు కేసులు వస్తున్నాయి. కానీ టెక్నీషియన్లు, మిషన్ల కొరతతో రోజుకు 70 నుంచి 100 వరకు మాత్రమే తీయగలుగుతున్నారు. దీంతో అనివార్యంగా మిగిలినవన్నీ పెండింగ్‌ పడిపోయి ఒక్కో కేసు షెడ్యూల్‌ నెలలు దాటుతోంది. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.


ప్రచారం ఫుల్‌ కానీ..!

2019 నుంచి దఫదఫాలుగా వివిధ విభాగాలకు చెందిన వైద్యులను రిక్రూట్‌ చేసుకుంటూ క్రమంగా వైద్యసేవలను విస్తరింపజేస్తూ వచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ... ఆచరణలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. డిమాండ్‌కు తగ్గస్థాయిలో వైద్యులు లేరు.

మౌలికసదుపాయాలు లేవు. అసలు ఇంతపెద్ద ఎయిమ్స్‌లో ఐసీయూ పడకల సంఖ్య 20 మాత్రమే ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ 20లో కూడా ప్రస్తుతం రెండు పనిచేయడం లేదు. అంటే.. 18 మాత్రమే వినియోగంలో ఉన్నాయన్నమాట! మరోవైపు ఎయిమ్స్‌లో ఎమర్జెన్సీ సేవలను కూడా 24్ఠ7గా అందించాలని నిర్ణయించారు.

దీంతో రోడ్డు యాక్సిడెంట్‌ వంటి కేసులతో పాటు ఇతరత్రా ఐసీయూ బెడ్‌ల అవసరంతో కూడిన కేసులను సంబంధిత రోగుల బంధువులు ఎంతో ఆశగా ఎయిమ్స్‌కు తీసుకువస్తున్నారు.

అయితే ఐసీయూ బెడ్‌ల కొరత కారణంగా వారికి ప్రాథమిక చికిత్సను అందించి ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలని పురమాయిస్తున్నారు. మొత్తం 960 పడకలతో కూడిన ఎయిమ్స్‌ ఆసుపత్రిగా ముమ్మర ప్రచారం జరిగినా ప్రస్తుతం 500 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


ప్రధాన విభాగాలేవీ..?

మంగళగిరి ఎయిమ్స్‌లో ఇంకా ప్రధాన డిపార్టుమెంటులు ఏవీ ఆరంభం కాలేదు. పనిచేస్తున్న కొన్ని విభాగాల్లో అరకొర సేవలు మాత్రమే లభిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో గుండె, కేన్సర్‌, కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత కేసులు బాగా ఎక్కువయ్యాయి. అయితే అవసరమైనంత మంది వైద్యులు అందుబాటులో లేరు. మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలు ఆరంభానికే నోచుకోలేదు.

ఎనస్థీషియా విభాగం కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎనస్థీషియా విభాగంలో చెప్పుకోదగిన స్థాయిలో డాక్టర్లు ఉన్నప్పటికీ మరికొంత మంది కావాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఐసీయూలో ఎనస్థీషియన్‌ల కొరత బాగా ఉందంటున్నారు. పోస్ట్‌ ఆపరేషన్స్‌ రోగులను ఐసీయూలో పరిశీలించేందుకు తగినంతమంది ఎనస్థీషియన్‌లు లేరని చెబుతున్నారు.


ఆయుష్‌ విభాగం ప్రారంభమెప్పుడో?

మంగళగిరి ఎయిమ్స్‌లో ఓపీడీ బ్లాకుతో పాటు అన్ని హంగులతో తయారైన భవనం ఆయుష్‌ బ్లాకు. 2019 నాటికే దాదాపు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. కానీ ఇప్పటికీ ఇందులో ఆయుష్‌ విభాగాన్ని ఏర్పాటు చేయలేదు.

ప్రతీ ఎయిమ్స్‌లో ఆయుష్‌ విభాగాన్ని విధిగా నెలకొల్పి అందులో ఆయుర్వేదం లేదా హోమియోపతి లేదా యునాని, సిద్ద, యోగా వంటి ప్రాచీన వైద్య విభాగాలను నెలకొల్పాలన్న విధానాన్ని కేంద్రప్రభుత్వం ఎయిమ్స్‌ చట్టాలలో తీసుకొచ్చింది.

కానీ ఇక్కడ ఆయుష్‌ బ్లాకులో ఆ తరహా వైద్యవిభాగాలను ఏళ్ల తరబడి అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. హోమియోపతి విభాగాన్ని ఏర్పాటు చేస్తారని కొందరు, ఆయుర్వేద విభాగాన్ని నెలకొల్పుతారని మరికొందరు అంటున్నారు.


అవుట్‌ సోర్సింగ్‌లో అంతా మాయ

మంగళగిరి ఎయిమ్స్‌లో సిబ్బంది చాలావరకు అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నావారే! నియామకంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎయిమ్స్‌లో అవుట్‌ సోర్సింగ్‌ కింద సుమారు 600 మందికిపైగా విధులు నిర్వహిస్తున్నారు.

వీరందరినీ విజయవాడకు చెందిన ఓ వ్యక్తి తన ఏజెన్సీ కింద నియమించారు. మంగళగిరి ఎయిమ్స్‌ ఆవిర్భావం నుంచి కూడా ఈ ఏజెన్సీ యజమాని అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకంలో చక్రం తిప్పుతూ వచ్చారని అంటున్నారు.

మొదట్లో 3 నెలల పాటు నామినేషన్‌ పద్ధతిపై సాగిన కాంట్రాక్టు ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ నాలుగేళ్లుగా కొనసాగడం గమనార్హం. సదరు ఏజెన్సీ యజమాని అవుట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇవ్వాలంటే హౌస్‌ కీపింగ్‌కు రూ.లక్ష, కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు రూ.మూడు లక్షల చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 26 , 2024 | 04:13 AM