Minister Narayana : ‘షీలాబిడే’ సిఫారసులు అమలు చేయాలి
ABN , Publish Date - Jun 30 , 2024 | 04:31 AM
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.
కేంద్రానికి లేఖ రాద్దాం: మంత్రి నారాయణ
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించి షీలా బిడే కమిటీ సిఫారసులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాద్దామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. శనివారం సీఆర్‌డీఏ కార్యాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసింది. అయినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే వేల కోట్ల విలువైన ఆస్తులున్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది.
ముఖ్యంగా తొమ్మిదో, పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత పంపకాల విషయంలో ఎక్కడ ఉన్నవి ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తవాదన తెరపైకి తెచ్చింది. ఇప్పటికే కొన్ని సంస్థల విషయంలో పీటముడి వీడటం లేదు.
ఇలాంటి సంస్థల్లో కొన్ని మున్సిపల్ శాఖకు చెందినవి కూడా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు రూ.5,170 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. సమీక్షలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.