Share News

MP Purandheswari : జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీ

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:57 AM

రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు.

MP Purandheswari : జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీ

  • ఇందిరమ్మ చీకటి రోజులు గుర్తున్నట్టే

  • వైసీపీ పాలనను కూడా జనం మరిచిపోరు

  • బీజేపీ విస్తృతస్థాయి భేటీలో నేతల ఫైర్‌

  • మోదీతోనే దేశాభివృద్ధి: కేంద్ర మంత్రి మురుగన్‌

  • నోరు విప్పితే అట్రాసిటీ కేసులు పెట్టారు

  • గుడులు కూల్చారు.. రథాలు కాల్చారు

  • వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన పురందేశ్వరి

రాజమహేంద్రవరం, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఐదేళ్ల జగన్‌ పాలన మరో ఎమర్జెన్సీని తలపించిందని, నోరు విప్పి ప్రశ్నించడమే పాపం అన్నట్టుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. గుడులు కూల్చడంతోపాటు రథాలను కూడా కాల్చారని, ఇదేమని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. గతంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీ చీకటి పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదన్నారు.

అదేవిధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనను కూడా ప్రజలు మరిచిపోరని వ్యాఖ్యానించారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక హోటల్‌లో బీజేపీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పురందేశ్వరి అధ్యక్షోపన్యాసం చేశారు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ చేస్తున్న ప్రకటనలపై ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘గతంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ఇంచుమించు అలాంటి ఎమర్జెన్సీ వాతావరణమే నడిచింది. ఎవరు గళం విప్పినా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు మరచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు.

రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. బహుశా ఆయనకు జ్ఞాపకశక్తి సన్నగిల్లిందేమో. ఐదేళ్ల కిందట వైసీపీ అధికారం చేపట్టాక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అంతర్వేది రథం కాల్చివేత, పిఠాపురంలో ఆలయ విధ్వంసం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇవన్నీ విధ్వంసం కాదా?’’ అని పురందేశ్వరి నిప్పులు చెరిగారు.

డబులింజన్‌ సర్కారుతో అభివృద్ధి

ప్రధాని నరేంద్రమోదీ విజన్‌ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్‌. మురుగన్‌ అన్నారు. బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మురుగన్‌ మాట్లాడుతూ.. డబులింజన్‌ సర్కార్‌ ద్వారా దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే ఏపీలోనూ రాబోయే రోజుల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. సామాజిక న్యాయం చేయడంలో మోదీనే రియల్‌ హీరో అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయిందన్నారు. సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.

జగన్‌ తప్పులను జనంలోకి తీసుకెళ్లండి

‘‘ఇంట్లో కూర్చొవద్దు. వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు చేసిన తప్పిదాలను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లండి. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పనులను కూడా ప్రజలకు చెప్పాలి’’ అని బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి సీనియర్‌ నాయకులు పార్టీ కేడర్‌కు హితబోధ చేశారు. జగన్‌ వల్లే రాష్ట్రం 30 ఏళ్లు వెనుక్కి వెళ్లిపోయిందన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 03:57 AM