Share News

Nellore : విజయసాయి విశాఖ దందాలో సుభాశ్‌, శాంతి ప్రమేయం

ABN , Publish Date - Jul 19 , 2024 | 03:30 AM

‘వైజాగ్‌లో విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో ప్రభుత్వ న్యాయవాది సుభాశ్‌ రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ప్రమేయం ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉంది.

Nellore : విజయసాయి విశాఖ దందాలో సుభాశ్‌, శాంతి ప్రమేయం

  • అవకతవకలపై త్రిసభ్య కమిటీ

  • ‘విజిలెన్స్‌’ కూడా విచారిస్తోంది: ఆనం

నెల్లూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘వైజాగ్‌లో విజయసాయిరెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో ప్రభుత్వ న్యాయవాది సుభాశ్‌ రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి ప్రమేయం ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం ఉంది. ప్రభుత్వ, రెవెన్యూ భూములకు సంబంధించి రికార్డులు మార్చినట్లు కొన్ని ఫిర్యాదులూ ఉన్నాయి’ అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జరిగిన అవకతవకలపై శాఖ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ వేశాం. దేవదాయ శాఖ విజిలెన్స్‌ కూడా విచారణ జరుపుతోంది. ఈ నివేదికలు వారంలో అందుతాయి. విశాఖలో కోల్పోయిన భూములపై రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల అధికారులూ విచారణ చేస్తున్నారు.

ఆ నివేదికలూ అందాక వాటిని సీఎం చంద్రబాబు ముందుంచుతాం. ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. అవినీతి ఆరోపణలపై సస్పెండైన శాంతికి విస్తృత రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఆమె చాలా చోట్ల అవినీతికి పాల్పడినట్లు తేలింది. విల్లా కొనుగోలుకు అనుమతి కోసం కమిషనర్‌కు శాంతి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అంత విలువైన విల్లాను ఆమె కొనుగోలు చేయడానికి అర్హత లేదు కాబట్టి మా కమిషనర్‌ పర్మిషన్‌ ఇవ్వలేదు.


తర్వాత అపార్ట్‌మెంట్‌ కొనుక్కునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి కమిషనర్‌ అనుమతిచ్చారు. విల్లా కొన్న విషయం మాకు తెలియదు. దీనిపై విచారణ జరుపుతాం. విజయసాయిరెడ్డి ఎక్స్‌లో పెట్టిన సందేశానికి శాంతి స్పందిస్తూ... ‘మీరు వైసీపీకి వెన్నెముక వంటి వారు’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు ఇలా చేయడం తప్పు. విజయసాయి తండ్రి ఓ హత్య కేసులో ఏ 2గా ఉన్నారు. ఇప్పుడు విజయసాయి కూడా ఏ 2గా మారారు. ఏ1గా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు కాబట్టి ఆ ఏ1 స్థానానికి ఎదగాలని విజయసాయిరెడ్డి దుర్మార్గాలు చేశారు. సభ్యసమాజం ఛీ కొట్టేలా వైజాగ్‌లో అరాచకాలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడడం మాని మీడియాపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడిన విజయసాయిరెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం సిగ్గు చేటు’ అని ఆనం మండిపడ్డారు.

Updated Date - Jul 19 , 2024 | 03:30 AM