తాడిపత్రిలో హైటెన్షన్!
ABN , Publish Date - Aug 21 , 2024 | 04:45 AM
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు.
పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి
ఇంట్లో సామగ్రి, రెండు కార్లు, స్కూటర్ ధ్వంసం
ఏబీఎన్ రిపోర్టర్‌ను గన్‌తో బెదిరించిన కందిగోపుల
ఎస్పీ జగదీశ్‌కు ఏపీయూడబ్ల్యుజే నేతల ఫిర్యాదు
తాడిపత్రి, ఆగస్టు 20: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు.
కానీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం సాయంత్రం తాడిపత్రికి భారీ అనుచరగణంతో బయలుదేరారు. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన వస్తున్న విషయం తెలియగానే పోలీసులు ఎ.కొండాపురం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడిపత్రిలోని తన ఇంట్లో కొన్ని పత్రాలు ఉన్నాయని, వాటికోసం వెళ్తున్నానని వాదించారు. దీంతో పోలీసులు ఆయన్ను వెంటబెట్టుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఆయన తనకు కావాల్సిన పత్రాలు తీసుకునిఅరగంటలో పోలీసు బందోబస్తు మధ్య అనంతపురానికి వెళ్లారు.
తరువాత కాసేపటికే ఘర్షణలు మొదలయ్యాయి. పెద్దారెడ్డి వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగాయి. వైసీపీ మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వైసీపీ వర్గీయులు రాళ్లు విసరడంతో టీడీపీ వర్గీయులు ఎదురు దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ వర్గీయుడు అడ్డు రఫీ గాయపడ్డారు.
పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళుతున్న వైసీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి.. టీడీపీ వర్గీయులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు నేరుగా పుట్లూరు రోడ్డులోని ఆయన ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. ఇంట్లో ఫర్నిచర్‌తో పాటు బయట నిలిపి ఉంచిన రెండు కార్లు, స్కూటర్‌ను ధ్వంసం చేశారు.
ఏబీఎన్ రిపోర్టర్‌కు బెదిరింపులు
ఘర్షణను కవర్ చేస్తున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రమణను కందిగోపుల మురళి బెదిరించారు. ‘నువ్వెందుకు వచ్చావ్..? బయటకు వెళ్లకపోతే గన్‌తో కాల్చిపారేస్తా..’ అని గన్ బయటకు తీసి బెదిరించారు. ఈ తతంగమంతా పోలీసుల ఎదుటే జరిగినా వారు నోరు మెదపలేదు. మురళీప్రసాద్‌రెడ్డి తనను గన్‌తో బెదిరించారని, దుర్భాషలాడారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు రమణ ఫిర్యాదు చేశారు. కందిగోపుల మురళిపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే నాయకులు ఎస్పీని కోరారు.
భద్రత కట్టుదిట్టం
జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో ఘర్షణలు చెలరేగడంతో ఎస్పీ జగదీశ్ వెంటనే తాడిపత్రికి చేరుకున్నారు. ఘటన గురించి పోలీసు స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేయాలని సూచించారు.
ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి నివాసం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్‌రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.