Share News

CM Chandrababu: తెల్లారేపాటికి లబ్దిదారుల చేతిలో పింఛన్.. స్వయంగా రంగంలోకి చంద్రబాబు

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:57 AM

ఒకటో తారీఖు వచ్చేసింది. పెన్షన్ వస్తుందా? లేదంటే లేటవుతుందా? అనే చింత లేకుండా తెల్లవారేపాటికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు.

CM Chandrababu: తెల్లారేపాటికి లబ్దిదారుల చేతిలో పింఛన్.. స్వయంగా రంగంలోకి చంద్రబాబు

అమరావతి: ఒకటో తారీఖు వచ్చేసింది. పెన్షన్ వస్తుందా? లేదంటే లేటవుతుందా? అనే చింత లేకుండా తెల్లవారేపాటికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు. తన నియోజకవర్గానికి విచ్చేసిన చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ స్వయంగా స్వాగతం పలికారు. పెండింగ్ బకాయిలు కలిపి నేడు రూ.7వేలు చొప్పున ఫించన్లను అందజేశారు. మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు ఏప్రిల్ నుంచే అమలు కాబోతోంది.


నేడు రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్ధిదారులకు పెంచిన పింఛను అందజేస్తున్నారు. పెరిగిన పింఛను రూ.4000, గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి చంద్రబాబు రూ.7000 పింఛన్ అందజేస్తున్నారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను అందజేయనున్నారు. దివ్యాంగులకు రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


తీవ్ర అనారోగ్యంతో బాధపడే విభాగంలో పింఛను పొందే వారి సంఖ్య 24,318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు భారం పడుతోంది. పింఛన్ల కోసం రూ.4,408 కోట్లు ఒక్క రోజులో ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు భారం పడుతోంది. గత ప్రభుత్వంలో పింఛను కోసం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేసేవారు. దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Updated Date - Jul 01 , 2024 | 07:22 AM