Share News

PDS Rice Scam : పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో.. పోలీసు విచారణకు పేర్ని నాని డుమ్మా

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:48 AM

గోదాముల నుంచి పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం పోలీసుల ముందు హాజరు కాలేదు.

 PDS Rice Scam : పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో.. పోలీసు విచారణకు పేర్ని నాని డుమ్మా

  • ఆయన భార్య, గోడౌన్‌ మేనేజర్‌ కోసం గాలింపు

  • జయసుధపై లుకవుట్‌ నోటీసులు జారీ

మచిలీపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): గోదాముల నుంచి పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయినా మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం పోలీసుల ముందు హాజరు కాలేదు. ఈ కేసులో బందరు తాలూకా పోలీసులు ఈనెల 10న పేర్ని నాని భార్య జయసుధ, గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌ తేజపై కేసు నమోదు చేయడం.. దీంతో వారు ముందస్తు బెయిల్‌ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించడం.. విచారణ ఈనెల 24కు వాయిదా పడడం తెలిసిందే. నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం అర్ధరాత్రి పోలీసులు పేర్ని నాని ఇంటికెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అతికించి వచ్చారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ కార్యాలయ టెక్నికల్‌ అసిస్టెంట్‌ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పొట్లపాలెం గోడౌన్లలో పీడీఎస్‌ బియ్యం మాయం ఘటనలో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని అందులో పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీసు స్టేషన్‌కు రావాలని.. లేదంటే బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 208 ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయన రాలేదని ఆర్‌పేట సీఐ ఏసుబాబు తెలిపారు. ఇంకోవైపు.. జయసుధ, గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌ తేజ అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జయసుధపై లుకవుట్‌ నోటీసులు జారీ చేశారు. మాన్‌సతేజ బంధువులిద్దరిని ఆదివారం ఆర్‌పేట స్టేషన్‌కు పిలిపించారు. అయితే తమకేమీ తెలియదని, మాన్‌సతేజ ఎక్కడున్నాడో కూడా తెలియదని వారు చెప్పారు. కాగా.. పొట్లపాలెం గిడ్డంగుల్లో 444.406 టన్నుల పీడీఎస్‌ బియ్యం ఉండాల్సి ఉండగా.. 248.74 టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు.

Updated Date - Dec 23 , 2024 | 03:48 AM