Share News

వెంకట్రామిరెడ్డీ.. తప్పుకో!

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:14 AM

సచివాలయ ఉద్యోగుల బాగోగులను పట్టించుకోకుండా ఫక్తు రాజకీయ నాయకుడిలా పని చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆయన కార్యవర్గ సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలంటూ ఓ పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

వెంకట్రామిరెడ్డీ.. తప్పుకో!
Venkatramireddy

  • వాట్సాప్‌లో సచివాలయ ఉద్యోగి పోస్ట్‌ హల్‌చల్‌

  • రాజీనామాకు వెల్లువెత్తుతున్న డిమాండ్లు

  • మీ వల్లే సమస్య.. మీరే పరిష్కరించండి

  • అధ్యక్షుడిని నిలదీసిన సభ్యులు


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల బాగోగులను పట్టించుకోకుండా ఫక్తు రాజకీయ నాయకుడిలా పని చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆయన కార్యవర్గ సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలంటూ ఓ పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో గత జగన్‌ ప్రభుత్వానికి మేలు కలిగేలా అప్సా అధ్యక్ష హోదాలో వెంకట్రామిరెడ్డి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించడంతో అప్సా గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ‘వెంకట్రామిరెడ్డీ.. తప్పుకో’ అంటూ ఒక ఉద్యోగి రాసిన లేఖ వాట్సాప్‌ గ్రూపుల్లో తిరుగుతోంది.


‘రూసా రూల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీకి పని చేయడం పెద్ద తప్పిదం. నీ కారణంగా సంఘం గుర్తింపు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యతను మరిచి, గత ప్రభుత్వ భజనలో మునిగిపోయారు. ఇక ఆ పోస్టులో ఒక్క క్షణం కూడా ఉండే అర్హత మీకు లేదు. ఇన్నాళ్లు ఉద్యోగులకు చేసిందేమీలేదు.


ఇప్పుడయినా మీ పదవులకు రాజీనామా చేసి అప్సా అస్థిత్వాన్ని కాపాడండి’ అని ఆ లేఖలో స్పష్టం చేశారు. కాగా, వెంకట్రామిరెడ్డి, ఆయన పాలకవర్గ సభ్యుల రాజకీయ క్రీ నీడకు తామెందుకు బలవ్వాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇటీవల జరిగిన అప్సా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలోనూ వెంకట్రామిరెడ్డిని పలువురు సభ్యులు ఇదే అంశంపై నిలదీసినట్లు తెలిసింది. ‘మీరు వ్యవహరించిన తీరు వల్లే ఈ రోజు అప్సాకు ప్రభుత్వ గుర్తింపు రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను మీరే సీఎం వద్దకు వెళ్లి పరిష్కరించాలి’ అని సభ్యులు తేల్చిచెప్పినట్టు సమాచారం. అయితే, తమది ఎలక్టెడ్‌ బాడీ అని, తప్పుకొనేదిలేదని వెంకట్రామిరెడ్డి చెప్పినట్టు తెలిసింది. తాను తప్పుకొంటే గనుక, ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్న తన అనుకూలురను అధ్యక్షులుగా నియమించాలని మెలిక పెట్టినట్లు సమాచారం.

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Oct 01 , 2024 | 07:34 AM