Share News

RIP: మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత..

ABN , Publish Date - Aug 25 , 2024 | 09:12 PM

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

RIP: మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత..
David Raju(File)

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. గత కొంతకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


రాజకీయ జీవితం..

పాలపర్తి డేవిడ్ రాజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామంలో 1958 మే7వ తేదీన జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఎల్ఎల్‌బి పూర్తిచేశారు. 1987లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్తు ఛైర్మన్‌గా పనిచేశారు. 1999లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010లో వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు.


పలువురు సంతాపం..

మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు మృతిపట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రకాశం జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు డేవిడ్ రాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. శాసనసభ్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 09:24 PM