Share News

Year Ender 2024: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలను ముంచేసిన జల విలయం ఇదే..

ABN , Publish Date - Dec 21 , 2024 | 10:17 PM

ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా వారాలపాటు కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వర్షాల దెబ్బకు భారీ వదరలు వచ్చి అపార నష్టాన్ని మిగిల్చాయి. రికార్డుస్థాయిలో వరదలు ముంచెత్తి ఆస్తి, పటం నష్టాలతోపాటు ప్రాణ నష్టం కలిగించి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.

Year Ender 2024: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలను ముంచేసిన జల విలయం ఇదే..
Rains in Telugu States-2024

అమరావతి: ఈ ఏడాది ప్రకృతి విపత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా వారాలపాటు కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వర్షాల దెబ్బకు భారీ వదరలు వచ్చి అపార నష్టాన్ని మిగిల్చాయి. రికార్డుస్థాయిలో వరదలు ముంచెత్తి ఆస్తి, పటం నష్టాలతోపాటు ప్రాణ నష్టం కలిగించి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఎగువన కురిసిన వర్షాలకు ఏరులు, నదులకు వరదనీరు పోటెత్తి ప్రజలను నీట ముంచేశాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి వేల కుటుంబాల వారు నిరాశ్రయులు అయ్యారు. రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తి ప్రజలను దిక్కుతోచని స్థితిలో పడేశాయి. ఆహారం, నీళ్లు లేక నానావస్థలు పడ్డారు. ఎన్నో వేల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి అయ్యాయి. ఒక్కసారిగా వరదనీరు వచ్చి మీదపడడంతో ఎటు వెళ్లాలో తెలియని నిస్సాహాయ స్థితికి ప్రజలు చేరుకున్నారు.


ఆగస్టు 31, 2024న రాత్రి నుంచి దాదాపు రెండు వారాలపాటు కురిసిన వర్షాలు తెలుగు రాష్ట్రాలకు ఊపిరాడకుండా చేశాయి. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ నగరాలను వరదనీరు ముంచెత్తింది. రికార్డుస్తాయిలో వరదనీరు ఈ రెండు నగరాలపై పడడంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు నదులు, ఏరులు, చెరువులు, కాలువలకు ఒక్కసారిగా పెద్దఎత్తున నీరు చేరడంతో కట్టలు తెగి వరదనీరు ఇళ్లను ముంచెత్తింది. మెుదటి, రెండో అంతస్తు వరకూ నీరు వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నగరాల్లో వరదలకు బుడమేరు, పాలేరు, మున్నేరు నదులు రికార్డుస్థాయిలో పొంగిపొర్లడమే కారణమని చెప్పొచ్చు.


ఉప్పొంగిన బుడమేరు..

బుడమేరుకు 60 వేల క్యూసెక్యుల వరదనీరు వచ్చి చేరింది. సాధారణంగా బుడమేరు సామర్థ్యం కేవలం 15 వేల క్యూసెక్కులు మాత్రమే. అయితే కృష్ణానదికి సైతం రికార్డుస్థాయిలో వరదనీరు రావడంతో బుడమేరు వదర అందులో కలిసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆగస్టు 31 రాత్రి బుడమేరు డైవర్షన్ ఛానల్‌కు ఏకంగా మూడు గండ్లు పడ్డాయి. దీంతో రాత్రికి రాత్రే ఒక్కసారిగా పెద్దఎత్తున విజయవాడ నగరాన్ని వరదనీరు ముంచెత్తింది. అజిత్‌ సింగ్‌ నగర్‌, రాజరాజేశ్వరీపేట, పైపుల రోడ్‌, రాజీవ్‌ నగర్‌, కండ్రిక, జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. వైఎస్‌ఆర్‌ జక్కంపూడి కాలనీ, వాంబేకాలనీ, ప్రకాశ్‌నగర్‌, సుందరయ్యనగర్‌, బీఎస్ నగర్ కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా ఇంత పెద్దఎత్తున వరదనీరు రావడంతో నగరవాసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇళ్లల్లోకి ఆరు అడుగులకుపైగా నీరు చేరింది. ఆ తర్వాత వరద ఉద్ధృతి మరింత పెరిగి మెుదటి అంతస్తు వరకూ వరదనీరు పెరిగింది. దీంతో అంతా రెండో అంతస్తునకు చేరుకున్నారు. దాదాపు రెండు వారాలపాటు ప్రజలు నానావస్థలు పడ్డారు. బుడమేరు ఉద్ధృతికి విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని కాలనీలు అతలాకుతలం అయ్యాయి.


చంద్రబాబు పర్యటన..

రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు ఆహారం, మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఆయనే నేరుగా బాధితులకు ఆహారం, మంచినీరు అందజేశారు. దాదాపు 10 రోజులపాటు విజయవాడ కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకుని అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. రోజూ టన్నుల కొద్దీ ఆహార పదార్థాలను ప్రజలకు అందేలా పక్కా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులను పలుమార్లు మందలించి క్షేత్రస్థాయిలో పని చేసేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వాసులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి వరద సహాయాన్ని సీఎం చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు వరద సహాయాన్ని వారి ఖాతాల్లో వేసేందుకు చర్యలు చేపట్టింది.


ఆర్థికసాయం..

బుడమేరు వరద విజయవాడ కాలనీలను ముంచెత్తడంతో పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. సామాన్లు మెుత్తం నీటిలోనే దాదాపు రెండు వారాలపాటు నానిపోయాయి. ఇందులో టీవీలు, ఫ్రిజ్‍లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అలాగే వంట సామగ్రి, ఫర్నిచర్ సహా మిగతా వస్తువులూ నీటిలో ముగిపోయాయి. అలాగే కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు వంటివి వరదనీటిలో కొట్టుకుపోగా మరికొన్ని నీటిలో పడవల్లా తేలియాడాయి. మరోవైపు వందల దుకాణాల్లోకి వరదనీరు చేరి సరకులు నీట మునిగాయి. కిరాణా షాపులు, వస్త్ర దుకాణాలు సహా అనేక షాపుల్లోకి వస్తువులు పనికి రాకుండా పోయాయి. దీంతో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.


వరదల్లో చిక్కకున్న ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్‌కు రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేలు చొప్పున ప్రకటించారు. అలాగే వాహనాలు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అదనంగా రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పరిహారం ప్రకటించింది. దుకాణాలు, తోపుడు బళ్లు, చిరు వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహనాలు, పంటలు, పశువులకు ఆర్థికసాయం ప్రకటించింది. ప్రతి ఒక్క కుటుంబానికీ సహాయం అందేలా చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టారు. అందరి వివరాలు సేకరించి బాధితుల ఖాతాల్లో 15 రోజుల్లోనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. మెుత్తం 4.21 లక్షల మందికి రూ.630 కోట్లను పరిహారంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. మరోవైపు వాహనాలకు సైతం పరిహారం అందేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించి లబ్ది చేకూర్చారు.


నష్టం వివరాలు ఇవే..

అయితే భారీ వర్షాలు, వరదలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నష్టం అంచనా వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వరదలకు ఏపీవ్యాప్తంగా 32 మంది మృతిచెందారని ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా వెల్లడించారు. 1,69,370 ఎకరాల్లో పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. మెుత్తం 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వం పేర్కొంది. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయాయని, 22 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయని, 3,973 కిలోమీటర్ల రహదారులు పాడైపోయాయని తెలిపింది. 78 చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయని వెల్లడించింది. వర్షాలు, వరదల కారణంగా మెుత్తం 6,44,536 మంది నష్టపోయినట్టు లెక్కలు వేసింది. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మందికి ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించింది. బాధితులను రక్షించేందుకు 50 ఎన్‌డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్‌ టీమ్‌లు, ఆరు హెలికాఫ్టర్లు, 228 బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పింది. అలాగే 317 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేసినట్లు పేర్కొంది.


ప్రకాశం బ్యారేజీ-రికార్డ్ వరద..

కాగా, భారీ వర్షాలకు సెప్టెంబర్ 1న రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఎన్నడూ లేనంతగా ప్రకాశం బ్యారేజీకి 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అదే సమయంలో బ్యారేజీకి ఎగువన గొల్లపూడి నుంచి ఐదు ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో మూడు బోట్లు బ్యారేజీ కౌంటర్‌ వెయిట్లను బలంగా ఢీ కొట్టాయి. రెండు బోట్లు కిందికి కొట్టుకుపోగా, మూడు బోట్లు బ్యారేజీ 67, 69 పిల్లర్లను ఢీకొట్టడంతో అవి దెబ్బతిన్నాయి. అయితే బోట్లు కొట్టుకురావడంలో వైసీపీ కుట్ర ఉందని అధికార పక్షం నేతలు ఆరోపణలు గుప్పించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే అతి కష్టం మీద అధికారులు బోట్లను కృష్ణానది నుంచి బయటకు తీసుకువచ్చారు.


తెలంగాణలో ఇదీ పరిస్థితి..

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా మున్నేరుకు వరదనీరు పోటెత్తి ఖమ్మం నగరంపై పడింది. ఒక్కసారిగా పెద్దఎత్తున వరదనీరు రావడంతో దిక్కుతోచని స్థితికి ప్రజలు చేరుకున్నారు. పలు కాలనీల్లో మెుదటి అంతస్తు వరకూ నీరు చేరడంతో ప్రజలు ఇళ్లపైకి చేరి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టింది. బాధితులను వరదనీటి నుంచి బయటకు తెచ్చేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బోట్ల సహాయంతో వారిని రిలీఫ్ క్యాంపులకు తరలించి ఆహారం, మంచినీరు అందజేశారు. వర్షాలు, వరదలు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.5438 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. 33 జిల్లాల్లో 29 జిల్లాలు వదర బాధిత జిల్లాలుగా సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు. అలాగే వరదలకు 29 మంది మృతిచెందారని తెలిపారు.


ఖమ్మంలో దారుణం..

ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల మూలంగా రూ.730 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మున్నేరు, పాలేరు వరదలకు 15,096 ఇళ్లు దెబ్బతిన్నాయని, 150 ఇళ్లు పడిపోయినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఒక్కో బాధిత కుటుంబానికి రూ.16,500 ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.10 వేలు చొప్పున రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది. మిర్చి, పండ్ల తోటలకు మరో రూ.68 కోట్లు ప్రకటించింది. జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.151 కోట్ల మేర నష్టం జరిగిందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. అలాగే పంచాయతీ రాజ్‌ రోడ్లకు రూ.34 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లెక్కలు వేశారు. ఇరిగేషన్‌ శాఖకు భారీగా సైతం నష్టం జరిగిందని, ఎన్‌ఎస్పీ కాలువలకు పలుచోట్ల గండ్లుపడడం, తెగిపోవడంతో సుమారు రూ.434 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం తెలిపింది.


కేంద్ర ప్రభుత్వం- ఆర్థికసాయం..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా నష్టపోయిన 14 రాష్ట్రాలకు కేంద్రం రూ.5,858.6 కోట్ల నిధులు ప్రకటించింది. ఇందులో ఏపీకి రూ.1,036 కోట్లు, తెలంగాణకు రూ.416.8 కోట్లు కేటాయించింది. మిగిలిన నిధుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు ప్రకటించగా.. గుజరాత్‌కు రూ.600 కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌కు రూ.189 కోట్లు, కేరళకు రూ.145 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, నాగాలాండ్‌కు రూ.25 కోట్లు కేటాయించింది.

Updated Date - Dec 21 , 2024 | 10:20 PM