Revanth Reddy : కడప నుంచే కాంగ్రెస్ జెండాఎగరేద్దాం
ABN , Publish Date - Jul 09 , 2024 | 03:24 AM
‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఉప ఎన్నిక వస్తే ఊరూరా తిరుగుతా: రేవంత్‌రెడ్డి
ఏపీలో షర్మిలదే విపక్ష పాత్ర.. 2029లో ఆమే సీఎం
ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ కోరిక తీరుద్దాం
జయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపు
బీజేపీతో తెరవెనుక పొత్తు పెట్టుకున్నవారు వైఎస్ వారసులా?
రాహుల్ గాంధీ భావి ప్రధాని: షర్మిల
పీసీసీ సభకు తరలివచ్చిన నేతలు, తెలంగాణ మంత్రులు
సోనియా, రాహుల్ ప్రత్యేక సందేశం
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రలో ప్రతిపక్షం లేదని, ప్రజల తరఫున ఆ పాత్ర పోషించేది పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రమేనని తెలిపారు. ఆమెకు తోడుగా, ఏపీలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా తాము ఉంటామన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీరెండు కళ్లుగా పాలించి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పదిహేనేళ్లుగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారమిక్కడ మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్‌లో పీసీసీ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తన మంత్రివర్గ సహచరులతో కలిసి వచ్చిన రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ముళ్లబాటను ఎంచుకున్న షర్మిల.. 1999లో తన తండ్రి ప్రతిపక్ష నేతగా పోరాడిన స్ఫూర్తితో ఏపీ ప్రజల తరఫున కొట్లాడతారని అన్నారు. 1984లో పోరాటం మొదలు పెట్టిన వైఎస్ 2004లో సీఎం అయ్యారని, తండ్రిని కోల్పోయి అనివార్య పరిస్థితుల్లో 2009లో రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల 2029లో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
రాహుల్‌ను ప్రధాని చేయాలన్న వైఎస్ ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్న పీసీసీ అధ్యక్షురాలికి అడుగడుగునా తాము తోడుంటామన్నారు. 2007లో శాసనమండలిలో మొదటిసారి అడుగు పెట్టిన తాను ముందు రోజు రాత్రంతా ప్రజా సమస్యలపై ప్రిపేరై మరుసటి రోజు ప్రస్తావిస్తే వైఎస్ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు కూడా సభలో ఉండి కొత్త వారిని ప్రోత్సహించాలంటూ తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారని అన్నారు.
ఏళ్ల తరబడి కష్టపడినా కాంగ్రె్‌సలో పదవి రాలేదని ఎన్నడూ పార్టీని వదల్లేదని, 2004 పాదయాత్రతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. అదే స్ఫూర్తితో రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా మండే ఎండల్లో.. మంచు కొండల్లో.. పాదయాత్ర చేసి ప్రజా సమస్యల్ని తెలుసుకుని ప్రతిపక్ష నేతగా పార్లమెంటులో ప్రధాని మోదీకి చెమటలు పట్టిస్తున్నారని అన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తెచ్చారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి జయంతి సభకు వెళ్లాలంటూ రాహుల్, ఖర్గే తమను ఆదేశించారని.. వారి తరఫున వచ్చిన తాము.. పీసీసీ చేసే ప్రజా పోరాటాల్లో వందశాతం అండగా నిలుస్తామన్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పేదల వైద్యానికి ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఇళ్లు లేని వారిని ఇందిరమ్మ ఇళ్లు అంటూ సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని అన్నారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ.. ఏపీ నేతలు కేవీపీ రామచంద్రరావు, పళ్లంరాజు, తులసిరెడ్డి, శైలజానాథ్, రుద్రరాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వామపక్ష నేతలు కె.నారాయణ, రామకృష్ణ తదితరులు మాట్లాడారు. సోనియా గాంధీ పంపిన సందేశాన్ని ఏఐసీసీ ప్రతినిధి మెయ్యప్పన్ చదివి వినిపించారు. రాహుల్ వీడియో సందేశాన్ని సభలో ప్రదర్శించారు. కార్యక్రమంలో మాణిక్కం ఠాగూర్, దీపా దాస్‌మున్షీ, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాన్న ప్రజల్లోనే..
అధికారం లేనప్పుడు ప్రజల్లోకి వెళ్లి..వచ్చాక పట్టించుకోని నేతల్లా కాకుండా ఎప్పుడూ ప్రజల కోసమే నాన్న(వైఎస్) తపన పడే వారని షర్మిల అన్నారు. రెండోసారి సీట్లు తగ్గినప్పుడు నువ్వు ప్రజల్ని అంతగా ఇష్ట పడినా వాళ్లు నీపై అంతగా చూపలేదని తానంటే పర్లేదంటూ అదే ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ ప్రజాసేవలోనే దేవుడి దగ్గరకు వెళ్లిపోయారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన్ను ప్రాణంగా ఇష్టపడే తనకు ఏమీ కాలేదన్నారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రె్‌సతోనే మంచి జరుతుందని ఎంతగానో విశ్వసించే తన తండ్రికి మత రాజకీయాలు చేసే బీజేపీ అంటే అసలు గిట్టదన్నారు. అదే బీజేపీతో తెరవెనుక రాజకీయాలు చేసే నాయకులు(జగన్) వైఎ్‌సకు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.