Rice Smuggling Scandal: ఆంధ్రా టు ఆఫ్రికా
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:10 AM
ఏపీలో ఆ బియ్యం ఉచితం! ఆఫ్రికాలో అవే బియ్యం కిలో రూ.150. ‘ఈ బియ్యం మాకు వద్దు’ అని అక్కడికక్కడే అమ్ముకొనే రేషన్‌కార్డు దారులతో మొదలుకుని... అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతోంది!
ఇక్కడ ఉచితం.. అక్కడ కిలో రూ.150
లబ్ధిదారుల నుంచే అసలు దందా మొదలు
బండి దగ్గరే ఎండీయూ ఆపరేటర్ల కొనుగోలు
మండల, జిల్లా స్థాయి వ్యాపారులకు విక్రయం
అనధికార స్టాక్ పాయింట్లకు తరలింపు
ఆపై రాష్ట్రస్థాయి ఎగుమతిదారులు రంగంలోకి
పాలిష్ చేసి నూకలు, ఉప్పుడు బియ్యం ముద్ర
పోర్టుల్లో కస్టమ్స్ హౌస్ ఏజెంట్లకూ లంచాలు
కాకినాడ పోర్టే అక్రమాలకు ప్రధాన ‘ద్వారం’
ప్రభుత్వానికి విజిలెన్స్ సవివరమైన నివేదిక
రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగింది. ఎండీయూ ఆపరేటర్లు రేషన్ కార్డు దారుల నుంచి కిలో రూ.12 నుంచి 15కు కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని ఐదారు రూపాయల లాభానికి మండల, జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత... ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. కిలో బియ్యం రూ.26కు కొని... మిల్లుల్లో పాలిష్ చేసి రూ.45నుంచి 50కి ఆఫ్రికాకు తరలిస్తారు. ఇలా చేతులు మారుతూ వెళ్లిన ‘ఉచిత బియ్యం’ ఆఫ్రికాకు చేరేసరికి రూ.120 నుంచి 150 అవుతుంది.
బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ లోగో ముద్రించిన ఎండీయూలనే (రేషన్ వాహనాలు) వినియోగించారు. మిల్లర్లు పాలిష్ పట్టి పంపిణీ చేసే బియ్యానికి ఉప్పుడు బియ్యం అనో, నూకలనో ఓ ముద్ర వేసి పోర్టు వరకూ చేర్చేవారు.
సరుకు సరైనదేనని, న్యాయబద్ధమైన రవాణానే జరుగుతోందని కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు (సీహెచ్‌ఏలు) నిర్ధారించాలి. ఆ తర్వాతే బియ్యం నౌకలోకి చేర్చాలి. కొందరు బడా ఎగుమతిదారులు వారిని కూడా మేనేజ్ చేసి తమ దందాకు లంగరు ఎత్తేశారు. లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే ఆపరేటర్ మొదలుకొని పోర్టులో ఉండే సీహెచ్‌ఏల వరకూ అందరినీ వాడుకున్నారు.
జిల్లా స్థాయిలో రేషన్ బియ్యం కొనేవాళ్లలో కొందరు
1. కోనల ఆనందరెడ్డి 2. కర్రి రామిరెడ్డి 3. పసలపూడి గంగరాజు 4. పండల ప్రసాద్ 5. సుంకర రామకృష్ణ 6. మానేపల్లి కృష్ణారెడ్డి 7. ఉండమట్ల వీర వెంకట సత్యనారాయణ.
ఎగుమతిదారుల్లో కొందరు...
1. వినోద్ అగర్వాల్ 2. సరళ ఫుడ్స్ 3. వీరభద్ర ఎక్స్‌పోర్ట్సు 4. లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్ట్సు...
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఏపీలో ఆ బియ్యం ఉచితం! ఆఫ్రికాలో అవే బియ్యం కిలో రూ.150. ‘ఈ బియ్యం మాకు వద్దు’ అని అక్కడికక్కడే అమ్ముకొనే రేషన్‌కార్డు దారులతో మొదలుకుని... అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతోంది!ప్రభుత్వం కిలోకు రూ.43 ఖర్చు పెట్టి పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం... చివరికి అక్రమార్కులకు లాభాల పంట పండిస్తోంది. ఐదేళ్ల వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగిన తీరుపై విజిలెన్స్ విభాగం సవివరమైన నివేదిక ఇచ్చింది. ఈ అక్రమ రవాణాలో 80 మంది కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. రైస్ మిల్లర్ల నుంచి సేకరణ... లబ్ధిదారులకు పంపిణీ....ఆ తర్వాత కొనుగోలు చేసి తిరిగి మిల్లులకు చేరే మార్గాలను వివరించింది. అక్కడి నుంచి సివిల్ సప్లైస్, పోలీసు, పోర్టు అధికారులు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను మేనేజ్ చేసి ఆంధ్రా తీరం నుంచి ఆఫ్రికా దేశాలకు లక్షల టన్నులు ఎలా తరలించారో నివేదించింది. అక్రమ ఎగుమతి జరిగే ప్రక్రియ నుంచి..అందులో కీలకమైన వాటాదారులు, ఓడ రేవుల్లో వ్యవహారాలు, కట్టడిలో సవాళ్ల వరకు.. ముప్పై పేజీలకు పైగా ఉన్న నివేదికలో ప్రభుత్వానికి వివరించింది. అందులో పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే...
ఎండీయూలతో రాచబాట..
మన రాష్ట్రంలో ఉచిత బియ్యం సరఫరాకు చిన్న సైజు ఎండీయూలను (రేషన్ వాహనాల) గత వైసీపీ ప్రభుత్వంలో ఉపయోగించారు. అక్రమ రవాణా ఈ వాహనాలతోనే మొదలవుతుంది. లబ్ధిదారుల్లో 30 నుంచి 40శాతం రేషన్ బియ్యం వాడటంలేదు. కొందరు పాక్షికంగా ఉపయోగించుకొంటున్నారు. ఇలాంటి వాళ్ల నుంచి ఎండీయూ ఆపరేటర్లే బియ్యాన్ని కొనుగోలు చేసేవాళ్లు. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి కాబట్టి కొన్నిచోట్ల కృత్రిమ వేలిముద్రలు కూడా ఉపయోగించారు. ఇలా లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మండల, జిల్లా స్థాయిలో కొందరు వ్యాపారులకు విక్రయించేవారు. ఈ బియ్యమంతా ఎక్కడికక్కడ అనధికార స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేవారు. ఆ తర్వాత బడా ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. మండల, జిల్లా స్థాయి వ్యాపారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. ఆ బియ్యాన్ని ఎండీయూ వాహనాలతోపాటు లారీల్లోనూ మిల్లులకు తరలిస్తారు. మిల్లుల్లో బియ్యాన్ని పాలిష్ పట్టి... నూక, ఉప్పుడు బియ్యం పేరుతో రేవుల ద్వారా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారు. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశంలో కొంత భాగం నుంచి కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు బియ్యం వెళ్లేవి. గుంటూరు నుంచి విశాఖపట్నం జిల్లాల వరకూ కాకినాడ యాంకరేజీ పోర్టుకు చేరుకుని అటు నుంచి విదేశాలకు వెళ్లిపోయేవి. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల నుంచీ రేషన్ బియ్యం సేకరించినట్లు విజిలెన్స్ గుర్తించింది. ఇలా గత ఐదేళ్ల పాటు లక్షల టన్నుల బియ్యాన్ని స్మగ్లింగ్ చేయగలిగారు. ప్రభుత్వ పెద్దలు కీలక నేతల సహకారం లేకుండా ఇది జరిగేది కాదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వివరించింది.
సివిల్ సప్లైస్ విజిలెన్స్ 6(ఏ)తో సరి..
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన సివిల్ సప్ల్సై విజిలెన్స్ విభాగం తూతూ మంత్రంగా అప్పుడప్పుడు సోదాలు చేస్తుందని, పట్టుబడ్డ బియ్యంపై ఆ శాఖ చట్టం 6(ఏ) కింద నామమాత్రంగా జరిమానా విధిస్తోందని విజిలెన్స్ పెదవి విరిచింది. ఆటోలు, టెంపోలు మొదలుకొని పాతిక ముప్పై టన్నుల భారీ వాహనాల్లో రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాలకు తరలి పోతున్నా పట్టించుకోలేదని తేల్చింది. కాకినాడ పోర్టుకు వెళ్లే బియ్యం అయితే టోల్ గేట్లను సైతం మేనేజ్ చేసి ఏకంగా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారని పేర్కొంది. రాజకీయ నాయకులతో కుమ్మక్కై వ్యాపారులు, అధికారులు 2019నుంచి 2024మధ్య మొత్తం రేషన్ బియ్యాన్ని ఊడ్చేశారని వివరించింది.
విజిలెన్స్ నివేదికలోని ముఖ్యాంశాలు
బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఐపీసీ, బీఎన్‌ఎస్ 2023 చట్టాల మేరకు కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపితేనే ఫలితం ఉంటుంది. బాధ్యులను గుర్తించి సరఫరా నెట్‌వర్క్‌ను తెగ్గొట్టి కీలక స్మగ్లర్లకు సంకెళ్లు వేయాలి.
ప్రతి జిల్లాలోనూ రేషన్ మాఫియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇలాంటి 80మంది కింగ్ పిన్స్‌ను కట్టడి చేయాలి.
అక్రమార్కులకు శిక్షలు పడేలా వాదించేందుకు ప్రతి జిల్లాలోనూ అనుభవజ్ఞులైన ప్రాసిక్యూటర్లను నియమించాలి.
కాకినాడ పోర్టు చుట్టూ ఉన్న ప్రైవేటు వ్యక్తుల కట్టడికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి.
వాహనాల తనిఖీలు, బియ్యం అనధికారిక నిల్వల తనిఖీ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉండాలి.
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం పాలిషింగ్ నిరోధించాలి. గడిచిన ఐదేళ్ల రికార్డులన్నీ పరిశీలించి విద్యుత్ బిల్లులు సైతం తనిఖీ చేయాలి.
పీడీఎస్ పంపిణీలో లొసుగుల కట్టడికి డిజిటల్ రికార్డుల నిర్వహణ, రవాణాలో వాహన ట్రాకింగ్ కోసం జీపీఎస్ ఏర్పాటు లాంటి చర్యలు తీసుకోవాలి.
జిల్లాల కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటుచేసి రేషన్ బియ్యం సరఫరాపై నిరంతర నిఘాపెట్టి కమిటీలు ఇచ్చే సూచనలు, సమాచారంతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి.
బియ్యం సేకరణ, పంపిణీలో..
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించే వరిని రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతుధరతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇస్తే ప్రతి వంద కిలోలకు 67కిలోల చొప్పున బియ్యం తిరిగి వెనక్కి మిల్లర్లు ఇస్తారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధీనంలో ఉండే గోడౌన్లలో వాటిని నిల్వచేసి మండల కేంద్రాల్లోని స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి రేషన్ డీలర్‌కు అంతిమంగా ఎండీయూ వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దకు చేర్చాలి. ఇందులో బియ్యం సేకరణ నుంచి లబ్ధిదారులకు చేరే వరకూ ఎక్కడికక్కడ లోపాలను విజిలెన్స్ నివేదిక ఎత్తి చూపింది. బియ్యం నాణ్యత, నిల్వలో జాగ్రత్తలు, తూకాల్లో తేడాలు, దొంగతనాలు ఇతరత్రా జాగ్రత్తల్లో ఆయా విభాగాల బాధ్యుల నిర్లక్ష్యం, అవినీతిని ఎండగట్టింది. ఈ-పోస్ నుంచి రేషన్ బియ్యం రీ సైక్లింగ్ వరకూ అన్ని చోట్లా మేనేజ్ చేశారని, యాదృచ్చిక తనిఖీలు చేపట్టి తూతూ మంత్రంగా ఆడిట్ చేశారని తేల్చింది.