Share News

Home Minister Anitha : భూకబ్జాలపై జిల్లాల వారీగా ప్రత్యేక సెల్‌

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:55 AM

భూ ఆక్రమణలు, కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Home Minister Anitha : భూకబ్జాలపై జిల్లాల వారీగా ప్రత్యేక సెల్‌

  • వైసీపీ నేతల బండారం బయటపడుతుంది

  • శకుని మామ విజయసాయికి విలువల్లేవు

  • సీఎంను దూషించినందుకు చర్యలు తప్పవు: అనిత

విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): భూ ఆక్రమణలు, కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దీంతో వైసీపీ నేతల బండారం బయటపడుతుందని తెలిపారు. ఆదివారమిక్కడ విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున భూకబ్జాలు, ఆక్రమణలు జరిగాయని.. విశాఖ భూకబ్జాలపై ఏర్పాటుచేసిన ప్రత్యేక సెల్‌ మాదిరిగానే అన్ని జిల్లాల్లోనూ ప్రారంభించాలని డీజీపీ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జాలను వెలికితీస్తే మరెంతో మంది బాధితులు బయటకు వస్తారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో కబ్జాల బాధితులు వినతులు అందజేస్తున్నారని, పోలీసు శాఖ కూడా దీనిలో భాగస్వామ్యం అవుతుంది కాబట్టి ఫిర్యాదులపై లోతైన విచారణ జరుగుతుందని చెప్పారు.

కాకినాడ పోర్టును.. బెదిరించి, భయపెట్టి లాక్కున్న విషయం బయటపడ్డాక.. వైసీపీ నాయకులు చేసిన నేరాలు, ఘోరాలు, అందుకోసం అవలంబించిన విధానాలను చూసి.. ఇలా కూడా నేరాలు చేయవచ్చా అని పోలీసులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. రూ.6 వేల కోట్ల ఆస్తిని కేవలం రూ.590 కోట్లకు భయపెట్టి లాక్కొన్నారని ఆధారాలతో బయటపడడంతో.. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నేతలు సీఎం చంద్రబాబును దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వయసు, హోదాను విస్మరించి ఎంపీ విజయసాయిరెడ్డి అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని, దీనిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ‘విలువల్లేని శకుని మామ విజయసాయిరెడ్డి’ అని అనిత విమర్శించారు.

Updated Date - Dec 09 , 2024 | 04:55 AM