APSRTC Chairman : ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
ABN , Publish Date - Dec 09 , 2024 | 04:47 AM
ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్ ఆర్‌టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు
ముగిసిన ఆర్టీసీ జాతీయ స్థాయి క్రీడా పోటీలు
విశాలాక్షి నగర్ (విశాఖ సిటీ), డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఏపీఎస్ ఆర్‌టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. విశాఖ పోలీస్ క్రీడా మైదానంలో నిర్వహించిన అఖిల భారత రవాణా సంస్థల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలకు 19 రాష్ట్రాల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు హాజరయ్యారు. షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, లాంగ్ జంప్‌తో పాటు పరుగు పోటీలు నిర్వహించారు. ఓవరాల్ చాంపియన్‌గా కర్ణాటక క్రీడాకారులు నిలవగా, రెండో స్థానంలో బెంగళూరు (బెస్ట్), ఏపీఎస్ ఆర్టీసీ క్రీడాకారులు (ఉమ్మడిగా) నిలిచారు. విజేతలకు చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోన్-1 చైర్మన్ ఎస్ దొన్నుదొర తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీకి 15 పతకాలు
క్రీడా పోటీల్లో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు 15 పతకాలు సాధించారు. వాటిలో ఐదు పసిడి, మూడు రజత, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. మహిళల 1,000 మీటర్ల రేస్ వాక్ (50 ఏళ్లలోపు)లో జి.ఫణిచక్రతేజ, 100 మీటర్ల పరుగు పందెంలో ఎ.మంజుల, పురుషుల 100 మీటర్ల రేస్ వాక్‌లో కె.రమేశ్, పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో హేమంత్, పురుషుల 400 మీటర్ల రిలే పరుగు పందెంలో కె.రాంబాబు, ఎన్.ప్రసాదరావు విజేతలుగా నిలిచారు. పోటీల్లో కర్ణాటక ఆర్టీసీ 14పతకాలు, తెలంగాణ ఆర్టీసీ 2, బెస్ట్ ఆర్టీసీ ఏడు పతకాలు, ఎంటీసీ చెన్నై ఒక పతకం కైవశం చేసుకున్నాయి.