AP Politics: రాజకీయాలకు గుడ్‌బై.. వారసుడికి బాధ్యతలు?
ABN , Publish Date - Aug 04 , 2024 | 06:04 PM
శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే.. రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం.
శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే.. రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం. కింజారపు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండగా.. ధర్మాన కుటుంబం తొలుత కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు. శ్రీకాకుళం రాజకీయాల్లో సీనియర్ నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సొంతం. మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. రెండు సార్లు నరసన్నపేట నుంచి, మూడు సార్లు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీచేసి తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఓడిపోయారు. ధర్మానతో పోలిస్తే రాజకీయాల్లో జూనియర్ అయిన శంకర్ చేతిలో ఓడిపోవడాన్ని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో ఇక రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆయన గతంలోనే ప్రకటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారుడికి శ్రీకాకుళం టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అధినేత నో చెప్పడంతో ధర్మాన ప్రసాదరావు పోటీచేయాల్సి వచ్చింది. ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి అప్పగించాలనే ఆలోచనలో ధర్మాన ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రితో పాటు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. పార్టీలో క్రీయాశీలకంగా లేరు. ప్రస్తుతం ధర్మాన ప్లేస్‌ను తన కుమారుడితో భర్తీ చేసే ప్లాన్‌లో ధర్మాన ప్రసాదరావు ఉన్నట్లు తెలుస్తోంది.
Kiran Kumar Reddy: ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు
భారీ ఓటమితో..
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ అప్పలసూర్యనారాయణ, ధర్మాన కుటుంబం మధ్య రాజకీయం నడుస్తూ వచ్చింది. 1985 నుంచి 2019 వరకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ రెండు కుటుంబాల నుంచి ఎవరో ఒకరు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1985 నుంచి 1999 వరకు గుండ అప్పలసూర్యనారాయణ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉండగా.. 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ధర్మాన ప్రసాదరావు గెలిచారు. ఇక 2014లో గుండ లక్ష్మిదేవి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మరోసారి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి గెలవగా.. 2024లో ఆయన ఓటమి చెందారు. ఈ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని ధర్మాన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నేరుగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించకపోయినా.. తన అనుచరులు, సన్నిహితుల వద్ద మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారట.
Minister Atchannaidu: రైతులు అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
కుమారుడి కోసమేనా..!
ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి అప్పగించి.. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తన వయసు 66 సంవత్సరాలు కావడంతో మళ్లీ ఎన్నికల సమయానికి 70 ఏళ్లు వస్తాయి. అప్పటికీ రాజకీయాల్లో ఉంటే తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతినే అవకాశం ఉందని.. అందుకే ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు బాధ్యతలు అప్పగిస్తే అప్పటికే కొంత అనుభవాన్ని సంపాదిస్తాడనే ఆలోచనలో ధర్మాన ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మాన రాజకీయాలకు గుడ్ బై చెప్తారా.. లేదా గతంలో చేసినట్లు చేస్తారా అనేది మాత్రం వేచిచూడాలి మరి.
Nara Lokesh: ఐఐటీ విద్యార్థికి అండగా మంత్రి నారా లోకేశ్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News