AP Assembly: ఈలలు వేస్తూ నిరసన.. శాసనసభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:07 AM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అమరావతి, ఫిబ్రవరి 5: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను (TDP MLAs) స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Seetharam) సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసనలతో హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టగా అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సభలో ఏం జరుగుతోంది తెలియని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం సభ పున:ప్రారంభమవగా..మళ్ళీ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. మళ్ళీ పోడియంపైకి వెళ్లి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పైకి పేపర్లు చించి వేసి విసిరేశారు. అసెంబ్లీలో ఈలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అబ్బయ్య చౌదరి.. ‘‘ఈలలు.. బయటకు వెళ్లి వేయండి’’ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ తీర్మానం చదువుతున్న స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అయితే సస్పెండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో వెంటనే వెళ్ళాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకెళ్లారు. ఈలలు వేసుకుంటూనే టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు...
ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...