Peddireddy: పెద్దిరెడ్డి రాజీనామాపై పుంగనూరులో హైటెన్షన్..?
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:47 AM
చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..
చిత్తూరు: జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చి మరీ టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గానికి వస్తున్న పెద్దిరెడ్డి అడ్డుకోవాలనే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఎందుకిలా..?
పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలుకుని 2024 ఎన్నికల వరకూ అరాచకానికి పాల్పడినా కూడా అతి స్వల్ప ఓట్ల మెజారిటీతో మాత్రమే పెద్దిరెడ్డి గట్టెక్కారు. ఇక పుంగనూరుకు మీ సేవలు చాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోకి పెద్దిరెడ్డి అడుగుపెట్ట రాదంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు, నేతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
సవాళ్లు విసిరి.. ఆఖరికి..?
చిత్తూరు జిల్లా మొత్తం తనదే అన్నట్టుగా పెద్ది రెడ్డి వ్యవహరించారు. ఒకానొక దశలో చంద్రబాబును సైతం ఓడిస్తామంటూ సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. చివరకు చావు దప్పి కన్ను లొట్ట బోయినట్టుగా అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. చంద్రబాబును సైతం ఓడిస్తామని సవాళ్లు విసిరిన వ్యక్తి చిత్తూరు జిల్లాలో తను మినహా వేరెవ్వరూ వైసీపీ తరుఫున విజయం సాధించలేదు. అధికారంలో ఉండగా పెద్ది రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్ష నేతలను ఎన్నో రకాలుగా హింసించారు. పెద్దిరెడ్డి కారణంగా ప్రతిపక్ష నేతలు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. గిర్రున ఐదేళ్లు తిరిగొచ్చాయి. ఏపీలో సీన్ రివర్స్ అయ్యింది.