Share News

CRPF Delay : ‘సాగర్‌’ గట్టుపై హైడ్రామా!

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:49 AM

నాగార్జునసాగర్‌ డ్యాం మీద శనివారం హైడ్రామా నడిచింది. అక్కడ గస్తీ కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలాలు.. కేంద్ర హోం శాఖ నుంచి మౌఖికంగా గానీ..

CRPF Delay : ‘సాగర్‌’ గట్టుపై హైడ్రామా!

  • డ్యాం భద్రత నుంచి ఆకస్మికంగా వైదొలగిన సీఆర్‌పీఎఫ్‌

  • కేంద్ర హోం శాఖ ఆదేశాలతో మళ్లీ వెనక్కి

అమరావతి/మాచర్ల టౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ డ్యాం మీద శనివారం హైడ్రామా నడిచింది. అక్కడ గస్తీ కాస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలాలు.. కేంద్ర హోం శాఖ నుంచి మౌఖికంగా గానీ.. లిఖితపూర్వకంగా గానీ ఎలాంటి ఆదేశాలూ లేకుండానే అకస్మాత్తుగా వైదొలగడం కలకలం రేపింది. భద్రత బాధ్యతలను సీఐఎ్‌సఎ్‌ఫకు అప్పగించి.. సాగర్‌ తెలంగాణ వైపు గట్టు నుంచి ములుగు కేంద్రంగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు శనివారం వెళ్లిపోయాయి. ఆంధ్ర సరిహద్దు వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. అయితే.. వాహనాలు రావడం ఆలస్యం కావడంతో అక్కడే ఉండిపోయాయి. సీఐఎ్‌సఎఫ్‌ దళాలు వచ్చేలోపు తెలంగాణ ప్రత్యేక పోలీసు (ఎస్‌పీఎఫ్‌) బలగాలు తమ రాష్ట్ర సరిహద్దు వైపు మోహరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చోటు చేసుకున్న ఈ పరిణామాలు 2023 నవంబరు 29వ తేదీన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తరుణంలో బీఆర్‌ఎ్‌సకు మేలు చేయడం కోసం, తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు సాగర్‌ డ్యాంపైకి వెళ్లి గేట్లను స్వాధీనం చేసుకుని జలాలను దిగువకు వదిలిన ఘటనను గుర్తుకు తెచ్చాయి.


కేంద్ర జలశక్తి, హోం శాఖలతో చర్చలు..

సీఆర్‌పీఎఫ్‌ బలగాలు భద్రతా విధుల నుంచి వైదొలగిన సమాచారం రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులకు తెలిసిన వెంటనే.. ప్రభుత్వ సలహాదారు, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ అతుల్‌ జైన్‌తో మాట్లాడారు. ఈ పరిణామంపై జైన్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తనకేమీ తెలియదన్నారు. అటు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ కూడా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీని సంప్రదించారు. ఈ పరిణామం తన దృష్టికి రాలేదన్న దేబర్షి.. వెంటనే కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు జరిపారు. అయితే సాగర్‌ భద్రత బాధ్యతల నుంచి సీఆర్‌పీఎ్‌ఫను తొలగిస్తూ తామెలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆమెకు తెలియజేశారు. వెనక్కి మళ్లిన బలగాలు తక్షణమే సాగర్‌పై గస్తీని పునరుద్ధరించాలని హోం శాఖ సీఆర్‌పీఎ్‌ఫను ఆదేశించింది. దీంతో.. ములుగు వెళ్లిన బలగాలు మళ్లీ వెనక్కి వచ్చి విఽధుల్లో చేరాయి. విశాఖ వెళ్లేందుకు ఎదురుచూస్తున్న రెండో దళం కూడా యథావిధిగా బాధ్యతలు చేపట్టింది.


ఏం జరిగిందో..?

తాజా పరిణామంపై జల వనరుల శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాల్లేకుండా సీఆర్‌పీఎఫ్‌ ఎందుకు తప్పుకొంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరగాలని అంటున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సుహృద్భావ వాతారణం నెలకొందని.. భావోద్వేగాలు లేవని.. ఇలాంటి తరుణంలో అకస్మాత్తుగా ఈ పరిణామం ఎలా జరిగిందో వారికి అంతుపట్టడం లేదు. దీనిపై విస్మయం చెందిన జలశక్తి, హోం శాఖల ఉన్నతాధికారులు సైతం తమకేమీ తెలియదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సాగర్‌ డ్యాం భద్రత నుంచి వైదొలగి ములుగు వెళ్లిపోయామని సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ షాహీర్‌ తెలిపారు. వారి నిర్దేశం మేరకే మళ్లీ విధుల్లోకి చేరామని చెప్పారు. అయితే వసతులు సరిగా లేనందునే బలగాలు వెనక్కి వెళ్లాయన్న వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై విశాఖ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తమ డైరెక్టర్‌కు ఇదివరకే విన్నవించనట్లు తెలిసింది. వీరు సాగర్‌ సమీపంలోని విజయపురిసౌత్‌ ఏపీఆర్‌జేసీ కళాశాలలో బసచేసి వంటావార్పు చేసుకుంటున్నారు. అటు తెలంగాణ వైపు జవాన్లు హిల్‌కాలనీలోని బాలవిహార్‌లోని క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 05:49 AM