Heavy Rains: కుండపోత
ABN , Publish Date - Sep 01 , 2024 | 04:44 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి.
రోజంతా ముంచెత్తిన వాన.. బెజవాడ అతలాకుతలం
పలు జిల్లాల్లోనూ జనజీవనం అస్తవ్యస్తం
బెజవాడ, గుంటూరుల్లో 9 మంది బలి
ముంపులో 62,550 హెక్టార్ల పంటలు
కొండ రాళ్లు ఇళ్లపై పడి ఆరుగురు దుర్మరణం
వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
నూజివీడులో పెద్ద చెరువుకు గండి తాళ్ల సాయంతో బయటపడిన స్థానికులు
కాజ టోల్‌ప్లాజా వద్ద హైవే పైకి భారీగా వరద బెజవాడలో 50 ఏళ్ల రికార్డు వాన
ఒక్క ‘తూర్పు’లోనే 174.2 మి.మీ. నమోదు రెండు ప్రధాన హైవేలపైకీ నీరు
నేడూ అతి భారీ వర్షాలు
రాత్రి పొద్దుపోయాకా సీఎం సమీక్ష
సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు కుండపోత
వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. ఉదయం నుంచి కురిసిన జడివాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. . రాష్ట్రవ్యాప్తంగా 9 మంది చనిపోగా, 62,550 హెక్టార్లలో పంటలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా వద్ద నడుం లోతున వరదనీరు ప్రవహించి, కోల్‌కతా-చెన్నై హైవే బ్లాక్ అవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో వాగు పొంగి హైదరాబాద్-విజయవాడ హైవేపైకి నీరు చేరడంతో కొంతసేపు ట్రాఫిక్ మళ్లించాల్సి వచ్చింది.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62,550 హెక్టార్లలో పంట ముంపుబారిన పడినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి 50వేల హెక్టార్లు, పత్తి 5వేలు, మొక్కజొన్న 3,100, కంది 2వేల, మినుము వెయ్యి, వేరుశనగ 500, ఇతర పంటలు 950 హెక్టార్లలో ముంపునకు గురైనట్లు ఆ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. అపరాల పంటలు దెబ్బతినగా, పత్తి, మిర్చి పైర్లు ఉరకెత్తే స్థితిలో ఉన్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి, లో-లెవల్ వంతెనలపై నీరు పారింది. భారీవర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, వర్షాలు, వరద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
జిల్లాలు అతలాకుతలం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, టమోటా, ఉల్లి వంటి ప్రధాన పంటలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో కురిసిన వర్షం ఖరీ్‌ఫలో సాగు చేసిన పైర్లకు జీవం పోయడంతో పాటు నెల క్రితం విస్తారంగా వేసిన జామాయిలుకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో సుమారు 18గంటల పాటు కురిసిన వర్షంతో అవుట్‌ఫాల్ డ్రెయిన్లు పొంగి వీధుల్లోకి పొర్లడంతో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై కాజా టోల్‌ప్లాజా వద్ద నడుం లోతున వరదనీరు ప్రవహించడంతో హైవే బ్లాక్ అయింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వాగులు రోడ్లపై ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఊయందున వాగులో కొట్టుకు పోతున్న వెంకట్రావు అనే వ్యక్తిని వీఆర్‌వో బాషా కాపాడారు. అచ్చంపేట వద్ద రెండు వాగులు పొంగడంతో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుంది. బస్సును సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. ప్రకాశం జిల్లా నల్లమల అటవీప్రాంతంలో కురిసిన భారీవర్షంతో నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం వద్ద గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించగా కొందరు భక్తులు గుడి వద్ద చిక్కుకుపోయారు. పోలీసులు ట్రాక్టర్‌పై వారిని తీసుకొచ్చారు.
కాకినాడ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
కాకినాడ జిల్లాకు వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాకినాడ పోర్టు నుంచి మూడోరోజు కూడా విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి.
నూజివీడు జలమయం
ఏలూరు జిల్లా నూజివీడులోని తిరువూరు బస్టాండు సమీపాన పెద్ద చెరువుకు భారీ గండిపడటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానికులు తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల ఎస్సీ హాస్టల్ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో హాస్టల్‌లో ఉన్న 157మంది బాలికలను పట్టణంలోని బాలికల సమీకృత వసతి గృహానికి తరలించారు. ఇంకోవైపు నూజివీడు సమీపాన రామిలేరు ఉప్పొంగడంతో పోతిరెడ్డిపల్లి గ్రామం వైపు వెళ్లే ఒక దేవాలయం సమీపాన ఫంక్షన్‌కు హాజరైన 25మందికి పైగా నీటిలో చిక్కుకుపోయారు. అధికారులు ఎక్స్‌కవేటర్లను రంగంలోకి దింపి వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
తిరుమలలో భక్తురాలిపై కూలిన భారీ వృక్షం
వర్షాలకు తిరుమలలో ఓ భారీ వృక్షం కూలడంతో భక్తురాలు తీవ్రగాయాలపాలయ్యారు. ఏఎంసీ ప్రాంతంలోని 305వ కాటేజీ వద్ద చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి కూర్చొని ఉండగా, సమీపంలోని భారీ వృక్షం కూలిపోయింది. చెట్టు కొమ్మలు ఆమెకు తగలడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కూలిన వృక్షాన్ని తొలగించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు తిరుమలలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. చలి విపరీతంగా పెరిగింది.
మంగళగిరి-నంబూరు మధ్య దెబ్బతిన్న రైల్వే ట్రాక్
భారీ వర్షం కారణంగా మంగళగిరి-నంబూరు మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో శనివారం మంగళగిరి వైపు నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లను నిలిపేసి డౌన్‌లైన్‌లో నడిపారు. ఈ కారణంగా విజయవాడ- హుబ్లీ ఎక్స్‌ప్రె్‌సను ఐదున్నర గంటలపాటు మంగళగిరి రైల్వేస్టేషన్‌లో నిలిపేశారు. మధ్యాహ్నం 2.24 గంటలకు మంగళగిరి వచ్చిన ఈ రైలు రాత్రి 8గంటలకు కదిలింది. అలాగే, విజయవాడ-చెన్నై సెంట్రల్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ 2గంటలు ఆలస్యంగా వెళ్లింది. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు మణిపురం క్యాబిన్ వద్ద డ్రెయినేజీ నీరు ట్రాక్ పైకి చేరడంతో త్రివేండ్రం సెంట్రల్‌కు బయలుదేరిన శబరి ఎక్స్‌ప్రె్‌సను గుంటూరు రైల్వేస్టేషన్‌లో 40నిమిషాలు నిలిపేశారు. ట్రాక్‌కు మరమ్మతులు చేసేందుకు అవసరమైన సామగ్రిని వేజండ్ల రైల్వేస్టేషన్ నుంచి మంగళగిరికి తరలించారు.