Police Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ జాబ్స్..
ABN , Publish Date - Aug 12 , 2024 | 06:28 PM
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత..
అమరావతి, ఆగష్టు 12: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గంజాయి నిర్మూలనకు కృషి..
గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తూ, గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామన్నారు. కొవ్వూరు తనకు పుట్టింటి లాంటిదని.. కొవ్వూరు పోలీస్ స్టేషన్‌ను మోడ్రన్ పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు హోంమంత్రి. బ్లేడ్ బ్యాచ్ వంటి వాళ్లపై ప్రత్యక్షంగా నిగాపెట్టామని హోంమంత్రి చెప్పారు.
19 వేలకు పైగా ఖాళీలు..
ఇదిలాఉంటే.. హోంమంత్రి ప్రకటనతో ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 6,100 పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది. వీటినే భర్తీ చేస్తారా? లేక కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే రాష్ట్రం పోలీస్ శాఖలో సుమారు 22 వేల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ భర్తీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియదు. కాగా, రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ నియామక మండలి(APSLPRB) చేపడుతుంది.