Share News

Tungabhadra Dam : స్టాప్‌లాగ్‌ నుంచి లీకేజీ బంద్‌

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:02 AM

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో అమర్చిన స్టాప్‌లాగ్‌లో లీకేజీని ఆదివారం పూర్తిగా అరికట్టారు. సిమెంటు, స్టోన్‌పౌడర్‌, బెల్లంతో తయారు చేసిన మిశ్రమాన్ని నీరు లీక్‌అవుతున్న చోట అతికించారు.

Tungabhadra Dam : స్టాప్‌లాగ్‌ నుంచి లీకేజీ బంద్‌

  • చుక్క నీరు కూడా లీక్‌కాకుండా పనులు పూర్తి

  • తుంగభద్ర డ్యాం గేట్లన్నీ మూసివేత

  • ప్రస్తుత నీటిమట్టం 73.553 టీఎంసీలు

  • పరీవాహక ప్రాంతంలో జోరుగా వానలు

  • త్వరలో మళ్లీ డ్యాం నిండే అవకాశం

  • కన్నయ్యనాయుడికి తుంగభద్ర బోర్డు సన్మానం

  • హైదరాబాద్‌లో ఘనస్వాగతం

బళ్లారి/కర్నూలు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో అమర్చిన స్టాప్‌లాగ్‌లో లీకేజీని ఆదివారం పూర్తిగా అరికట్టారు. సిమెంటు, స్టోన్‌పౌడర్‌, బెల్లంతో తయారు చేసిన మిశ్రమాన్ని నీరు లీక్‌అవుతున్న చోట అతికించారు. స్టాప్‌లాగ్‌ గేటులో మొత్తం 5 సెగ్మెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. వాటిని బిగించాక వాటి మధ్య నుంచి 500 క్యూసెక్కుల నీరు లీక్‌ అవుతుండడాన్ని గుర్తించారు. ఇప్పుడు దానికీ అడ్డుకట్ట వేశారు.

Untitled-2 copy.jpg

డ్యాం గేట్లన్నీ మూసివేశారు. పంట కాలువలకు మాత్రం 10,700 క్యూసెక్కులు వదులుతున్నారు. డ్యాంలో ఆదివారం సాయంత్రానికి 73.553 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులకు గాను ప్రస్తుతం 1,624.09 అడుగుల మేర నీరు ఉంది. ఇన్‌ఫ్లో 29,847 క్యూసెక్కులు వస్తోంది.


ఎగువ పరివాహక ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. డ్యాం సమీపంలోని కొప్పళ, విజయనగర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మళ్లీ జలాశయం నిండేందుకు ఎలాంటి ఢోకా ఉండదని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ను బిగించి, ఆయకట్టుకు ప్రాణం పోసిన డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి మాట్లాడుతూ.. ఈతరం ఇంజనీర్లు, యువతకు కన్నయ్యనాయుడు ఆదర్శప్రాయుడని కొనియాడారు. రైతుల పాలిట ఆపద్బాంధవుడిలా వచ్చాడని, అపార అనుభవంతో స్టాప్‌లాగ్‌ అమర్చి, మూడు రాష్ట్రాల రైతుల ఆశలు నిలిపారని ప్రశంసించారు.

అనంతరం హైదరాబాద్‌ చేరుకున్న కన్నయ్యనాయుడుకు ఘనస్వాగతం లభించింది. మియాపూర్‌లోని మాతృశ్రీ కాలనీవాసులు ఆయన్ను టాపు లేని వాహనంలో కాలనీ ప్రధాన ద్వారం నుంచి ఇంటి వరకు ఊరేగించి పూలవర్షం కురిపించారు. ‘ఓ మహర్షీ.. మీ సేవలు భరత జాతికి ఇంకా కావాలి’ అంటూ ఆకాంక్షించారు. వారంరోజులకుపైగా కుటుంబానికి దూరంగా ఉండి.. ఇంత వృద్ధాప్యంలోనూ కన్నయ్య నాయుడు స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్స్‌ బిగించడంలో కీలక పాత్ర పోషించడం అభినందనీయమనీ, క్రస్ట్‌ గేట్ల తయారీలో ఆయన ఓ మహర్షి అని కొనియాడారు.

Updated Date - Aug 19 , 2024 | 03:03 AM