Tirupati : టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు
ABN , Publish Date - Jun 28 , 2024 | 03:15 AM
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. టీటీడీకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలపై కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఐదేళ్లుగా ఇష్టారాజ్య నిర్ణయాలపై ఫిర్యాదుల వెల్లువ
ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధుల కేటాయింపు
దర్శనాల పేరిట వసూళ్లు... అడ్డగోలు నియామకాలు
అక్రమాలను గుర్తించేందుకు రంగంలోకి విజిలెన్స్
టీటీడీ పరిపాలనా భవనంలో, కొండపైనా తనిఖీలు
ఇంజనీరింగ్ విభాగాల్లో పలు రికార్డుల స్వాధీనం
కీలక అధికారులను ప్రశ్నించి, వివరాల సేకరణ
శ్రీవాణి ట్రస్టు విరాళాల వినియోగంపైనా ఆరా
తిరుపతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టడం ప్రకంపనలు సృష్టిస్తోంది. టీటీడీకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలపై కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతితో సహా పలు ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులు ఇటీవల డీజీపీ, సీఐడీ విభాగం అధిపతి, హోంమంత్రిని కలసి టీటీడీలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు చేశారు.
కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చిన సమయంలోనూ కొందరు పలు అవకతవకలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దేవస్థానం విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విజిలెన్స్ విచారణకు ఆదేశించడం టీటీడీ చరిత్రలోనే అరుదు. త్వరలో సీఐడీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారంతో గత ఐదేళ్లలో అనుచిత నిర్ణయాలు తీసుకున్న అధికారులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇంజనీరింగ్ పనుల్లో గోల్‌మాల్
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం జగన్‌కు స్వయానా చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్లకు పైగా టీటీడీ బోర్డు చైర్మన్‌గా కొనసాగారు. టీటీడీ చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ కూడా చేయని స్థాయిలో ఆయన అధికారం చెలాయించారు. సుబ్బారెడ్డి అనంతరం ఎన్నికల వరకూ భూమన కరుణాకర్‌రెడ్డి చైౖర్మన్‌గా వ్యవహరించారు. ఆయన కూడా జగన్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరుపడ్డారు. భూమన సైతం ఇంచుమించు వైవీ సుబ్బారెడ్డి తరహాలోనే అధికారం చెలాయించారు. మరోవైపు తిరుమల జేఈవో పోస్టులో డిప్యుటేషన్‌పై నియమితులైన ఏవీ ధర్మారెడ్డి తర్వాత అదనపు ఈవోగా పదోన్నతి పొంది ఐదేళ్ల పాటు కొనసాగారు.
చివరి దశలో ఈవో జవహర్‌రెడ్డి బదిలీతో ధర్మారెడ్డే ఇన్‌చార్జి ఈవోగా పనిచేశారు. ఆయన కూడా జగన్‌కు అత్యంత సన్నిహితుడని పేరుంది. ఈ ముగ్గురూ గత ఐదేళ్లుగా టీటీడీ వ్యవహారాలను శాసించారు. వీరి పాలనలోనే టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ పనులకు భారీ ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. అంతకుముందు ఏడాదికి సగటున రూ.150 కోట్లు ఇంజనీరింగ్ పనులకు కేటాయించేవారు.
అయితే గత ఐదేళ్లలో ఏకంగా రూ.3వేల కోట్లకు పైగా కేటాయించడం సంచలనం రేపింది. వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలంలో రూ.వెయ్యి కోట్ల వరకూ కేటాయించగా, భూమన చైర్మన్‌గా పనిచేసిన ఏడాదిలోపే రూ.2వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. పాలకమండలిలో కీలక వ్యక్తులు కమీషన్లకు కక్కుర్తి పడి, పర్సంటేజీల కోసమే అవసరం లేని నిర్మాణాలు కూడా ప్రతిపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణకు అంతకుముందే పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి బాగుచేసిన గోవిందరాజస్వామి సత్రాలను పూర్తిగా కూల్చివేసి కొత్తవి నిర్మించేందుకు రూ.600 కోట్లు కేటాయించారు. అలాగే నిక్షేపంగా ఉన్న స్విమ్స్ భవనాలను తొలగించి కొత్తవాటి నిర్మాణానికి రూ.300 కోట్లు కేటాయించారు. రోడ్ల నిర్మాణానికి సైతం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. ఇపుడు కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.
సలహాదారులకు రూ.లక్షలుసమర్పయామి
వైసీపీ హయాంలో టీటీడీలో అడ్డగోలు నియామకాలు పెద్ద ఎత్తున జరిగాయన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఆ పార్టీ కీలక నేతలకు కావాల్సిన వారిని అధికారులుగా, సలహాదారులుగా, ఉద్యోగులుగా నియమించారు. కొందరిని కాంట్రాక్టు ప్రాతిపదికన, మరికొందరిని రెగ్యులర్ పోస్టుల్లో నియమించారన్న ఆరోపణలు వచ్చాయి. సలహాదారులకు భారీగా జీతభత్యాలు చెల్లించారు. గతంలో టీటీడీలో ఏ విభాగానికీ ఇలా సలహాదారులను నియమించింది లేదు. అకౌంట్స్ విభాగానికి నరసింహమూర్తిని, ఇంజనీరింగ్ విభాగానికి కొండలరావు, రామచంద్రారెడ్డి, బర్డ్ ఆస్పత్రికి డాక్టర్ గురవారెడ్డి, విజిలెన్స్ విభాగంలో ప్రభాకర్‌ను సలహాదారులుగా నియమించగా సైబర్ సెక్యూరిటీ విభాగానికి సందీప్ అనే వ్యక్తిని సైబర్ ఎక్స్‌పర్ట్‌గా నియమించారు. ఆయన తర్వాత ఏకంగా ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్ అయ్యారు.
కీలకమైన ఎస్టేట్స్ విభాగంలో కూడా రిటైరైన అధికారి మల్లికార్జునను కొనసాగిస్తున్నారు. ఎస్వీబీసీకి సంబంధించి గాయని మంగ్లీ, విజయ్‌కుమార్ వంటివారిని సలహాదారులుగా నియమించారు. విద్యాశాఖలో, ధర్మ ప్రచార పరిషత్‌లో కూడా పలువురిని అడ్డగోలుగా నియమించారు. ఈ సలహాదారులకు రూ.లక్షకు పైగా వేతనం, వాహనం, వారికి గదులు కేటాయించి టీటీడీ ఖజానాను గుల్ల చేశారన్న ఆరోపణలున్నాయి.
ప్రజాసంబంధాల విభాగంలో కూడా జగన్ మీడియాలో పనిచేసిన నాగేశ్వరరావు అలియాస్ నగే్‌షను ఓఎస్డీ హోదాలో నియమించారు. ఇలాంటి అడ్డగోలు నియామకాలకు అంతూపొంతూ లేకుండాపోయింది. టీటీడీలో అడ్డగోలు వ్యవహారాలు శృతిమించి జరిగాయని కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రెండు రోజులుగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోనూ, కొండ మీద విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇంజనీరింగ్ విభాగాల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
కీలక అధికారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. మరోవైపు దర్శనాలు, సేవలకు సంబంధించిన టికెట్ల జారీతో పాటు శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన విరాళాల సేకరణ, వాటి వినియోగంపైనా దృష్టి పెట్టినట్టు సమాచారం. కాగా, సీఎం చంద్రబాబు ప్రకటించిన రీతిలోనే టీటీడీ ప్రక్షాళనకు చర్యలు మొదలవడంతో శ్రీవారి భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టారాజ్యంగా టికెట్ల కోటాల పెంపు
వైసీపీ ప్రభుత్వ హయాంలో దర్శనాల కోటాలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. గతంలో ఎమ్మెల్యేలకు రోజుకు ఒక లేఖను అనుమతించి దానిపై ఆరు టికెట్లు మాత్రమే జారీ చేసేవారు. వారు స్వయంగా వస్తే 10టికెట్ల వరకూ ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వంలో లేఖపై పది టికెట్లు ఇచ్చారు. గతంలో మంత్రులకు 10-15 టికెట్లు ఇచ్చేవారు. వైసీపీ హయాంలో అడిగినన్ని ఇచ్చారు. బోర్డు సభ్యులకు మునుపు రోజుకు 35 టికెట్లు ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన సభ్యులకు పరిమితి లేకుండా అడిగినన్ని జారీ అయ్యాయి.
చైర్మన్‌కు ఇంతకుముందు రోజుకు గరిష్ఠంగా 150 టికెట్లు ఇచ్చేవారు. వైసీపీ పాలనలో ఎన్ని అడిగితే అన్నీ ఇచ్చారు. ఇక గతంలో సుపథం టికెట్లను చైర్మన్ కార్యాలయం నుంచి జారీ చేసేవారు కాదు. వైసీపీ హయాంలో రోజుకు 500 నుంచీ వెయ్యి టికెట్లు ఇచ్చారు. మునుపు రోజుకు బ్రేక్ దర్శనం టికెట్లు 2వేల వరకూ జారీ అయ్యేవి. వైసీపీ ప్రభుత్వంలో ఆ సంఖ్య కాస్తా 6వేలకు చేరింది. జగన్‌కు, ధర్మారెడ్డికి సన్నిహితులైన వారికి కోటాతో నిమిత్తం లేకుండా అడిగినన్ని టికెట్లు జారీ అయ్యేవన్న ఆరోపణలున్నాయి. పలుకుబడి కలిగిన కొందరు మంత్రులు, పాలకమండలి సభ్యులు దర్శనాల పేరిట వ్యాపారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ఓ మహిళా మంత్రితో సహా నలుగురైదుగురు మంత్రులు దర్శన టికెట్లకు భారీగా వసూళ్లు చేసి స్వయంగా వారిని వెంటబెట్టుకుని వచ్చేవారు. మహిళా మంత్రి దర్శనాల అనంతరం వెళ్లిపోయేవారని, మిగిలిన మంత్రులు మాత్రం కొండపైనే మకాం వేసి వరుసగా రెండు మూడు రోజుల పాటు దర్శనాలకు వెళ్లేవారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపైనా ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.