Share News

Sajjala Bhargav Drama : పోలీసులపై ‘సజ్జల’ స్కెచ్‌!

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:29 AM

వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌ రెడ్డి డ్రైవర్‌ ఆడిన దొంగ అరెస్టు నాటకం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని తేలింది.

Sajjala Bhargav Drama : పోలీసులపై ‘సజ్జల’ స్కెచ్‌!

  • డ్రైవర్‌తో భార్గవ్‌ దొంగ అరెస్టు డ్రామా

  • సాంకేతిక దర్యాప్తులో తేలిన కుట్రకోణం ముందురోజు వైసీపీ పెద్దలతో టచ్‌లో..

  • సీరియ్‌సగా తీసుకున్న ఉన్నతాధికారులు

  • కేసు నమోదుకు రంగం సిద్ధం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌ రెడ్డి డ్రైవర్‌ ఆడిన దొంగ అరెస్టు నాటకం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని తేలింది. వీరంతా కలసి పోలీసులనే నిందితులుగా చూపే ప్రయత్నం చేయడంతో ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. తప్పుడు ఫిర్యాదు చేయించిన భార్గవ్‌పై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. సజ్జల భార్గవ్‌ వద్ద ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన యామత్తి సుబ్బారావు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల రెండో తేదీ రాత్రి మఫ్టీలో ఉన్న ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుళ్లు సుబ్బారావును ఇంటి వద్ద నుంచి అరెస్టు చేశారని, అతని ముఖానికి మంకీ క్యాప్‌ తొడిగి ఒక అపార్టుమెంట్‌లోకి తీసుకెళ్లి భార్గవ్‌ గురించిన అన్ని విషయాలు చెప్పాలని ఇష్టానుసారంగా కొట్టారని, అనంతరం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రి వద్ద వదిలేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఈ నెల 3న విజయవాడలోని సీపీ కార్యాలయానికి వెళ్లి పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • ఏం జరిగిందంటే...

వైసీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్‌ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సుబ్బారావును పోలీసులు తీసుకొచ్చారని చెబుతున్న మార్గాల్లో సీసీ ఫుటేజీని అధికారులు పరిశీలించారు. రెండో తేదీ రాత్రి అతడిని తీసుకొచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అలాగే ఆయా ప్రాంతాల్లో సెల్‌టవర్‌ లొకేషన్‌లోనూ సిగ్నల్‌ పాయింట్‌ సైతం రాలేదు. దీంతో అనుమానించిన పోలీసులు సుబ్బారావు నుంచి వాంగ్మూలం తీసుకోవడంతో అతనిలో తడబాటు మొదలైంది.


అరెస్టు చేసే సమయంలో సుబ్బారావు భార్య, పిల్లలను పోలీసులు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అతడి భార్య తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఏడాది క్రితం నుంచి ఉయ్యూరు వద్ద ఉన్న అరట్లకట్ట గ్రామంలో ఉంటున్నట్టు విచారణలో నిర్ధారణ అయింది. సింహాద్రి అప్పన్నపేటలో ఇంటి నుంచి రెండో తేదీ రాత్రి సుబ్బారావును అరెస్టు చేశారని ఫిర్యాదులో తెలపగా, ఆ రోజున అతని సెల్‌టవర్‌ లొకేషన్‌ అరట్లకట్టలో చూపించింది. ఇక రెండో తేదీన సాయంత్రమే విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి సమీపంలో ఉండే మిషనరీ ఆసుపత్రి వద్ద ఉన్న బస్టా్‌పలో కూర్చున్న సుబ్బారావును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరురాలైన చంద్రలీల స్కూటర్‌పై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లిన సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

అక్కడి క్యాజువాలిటీలో అతనికి ప్రాథమిక చికిత్స చేయించిన దృశ్యాలు ప్రభుత్వాసుపత్రి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగ అరెస్టు డ్రామాకు ముందురోజు నుంచి వైసీపీ పెద్దలతో సుబ్బారావు టచ్‌లో ఉన్నట్టు పోలీసులు సాంకేతికంగా నిర్ధారించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జునతో పాటు ఇతర వైసీపీ నేతలతో 1న అతను పలుమార్లు కాల్స్‌ మాట్లాడటంతో వారే ఈ నాటకాన్ని ఆడించారని గుర్తించారు. అసభ్యకర పోస్టింగ్‌లకు సంబంధించిన కేసుల్లో ఇరుక్కున్న భార్గవ్‌... బెయిల్‌ కోసమే ఇటువంటి డ్రామాలు ఆడిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను నిందితులుగా పేర్కొంటూ ఫిర్యాదు చేయడాన్ని ఉన్నతాధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. భార్గవ్‌పై కేసు నమోదుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 07:17 AM