Kakinada Port Stake Sale : ఈడీ దూకుడు !
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:27 AM
కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది.
వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ విచారణ
కాకినాడ పోర్టు, సెజ్‌ను కొట్టేసిన వ్యవహారంలో మిగతా నిందితులకూ ఈడీ నోటీసులు
వారిని కూడా ప్రశ్నించనున్న అధికారులు
మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు
వాటాలు కొనటానికి వాడిన డబ్బులు ఎక్కడివి?
ఈ వ్యవహారంలో లబ్ధి ఎవరికి చేకూరింది?
విక్రాంత్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం
కాకినాడ, విజయవాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని పిలిపించి తాజాగా విచారించింది. ఈ కేసులో సీఐడీ నిందితులుగా చేర్చిన వారందరికీ ఈడీ నోటీసులు జారీచేసింది. వారందరినీ పిలిపించి ఒక్కొక్కరుగా విచారించనుంది. విక్రాంత్‌రెడ్డి విచారణ సందర్భంగా.. ప్రధానంగా ‘లావాదేవీ’లపై ఆరా తీసింది. డబ్బులు ఎలా వచ్చాయి.. ఎంత తరలించారు.. ఎవరికి లబ్ధి జరిగింది....అనే కోణంలో లోతుగా ఈడీ అధికారులు విక్రాంత్‌ను విచారించారు. గుచ్చి గుచ్చి లోతుగా ఆధారాలతో ప్రశ్నించారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు విక్రాంత్ సరిగా సమాధానాలు చెప్పకుండా డొంక తిరుగుడుగా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఇటీవల ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. విక్రాంత్ రెడ్డితోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి.. సంతానం ఆడిట్ కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేసింది.
అందులో భాగంగా ఇప్పుడు విక్రాంత్‌ను విచారణకు పిలిచింది. కాకినాడ సీపోర్టుకు అసలు యజమాని కేవీ రావును ఆనాడు జగన్ సన్నిహితులు బెదిరించి, భయపెట్టి కారుచౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీ పలు ప్రశ్నలు అడిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి. అందులో కాకినాడ సీపోర్టు కూడా ఒకటి. ఇందులో 41 శాతం వాటాను తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన ‘అరబిందో’ దక్కించుకుంది.
తనను బెదిరించి, భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు. ‘‘చెన్నైకు చెందిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని (జగన్) ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ముంబైకి చెందిన మరో సంస్థకూడా ఆడిట్ చేస్తుందంటూ సమాచారం ఇచ్చారు. రెండు సంస్థలకూ మేం సహకరించాం.
రికార్డులన్నీ వారి ముందుంచాం. మా సంస్థ ప్రభుత్వానికి 984 కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు ఆడిట్ కంపెనీ....వైసీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే సమయంలో మాకు విజయసాయిరెడ్డి ఫోన్ చేశారు. జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని కలవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న విక్రాంత్ ఇంటికెళ్లి కలిసి మాట్లాడాను. ‘మీరు ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం కుటుంబం జైలుకు వెళ్లకూడదు అనుకుంటే మీ కంపెనీ షేర్లన్నీ విక్రయించేయండి. ఇది నా మాట కాదు ముఖ్యమంత్రి జగన్ ‘ఆదేశం’ అని భయపెట్టారు. 41.14 శాతానికి 494 కోట్లకు ఖరారు చేశామని, డీల్ సెట్ చేసుకోమని ఏకపక్షంగా చెప్పారు. వేల కోట్ల ఆస్తులను కొట్టేశాక విక్రాంత్ రెడ్డి తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్‌కు నన్ను తీసుకెళ్లారు.. ‘ఇది చాలా అన్యాయం’ అని నేను అంటుండగా.. ‘విక్రాంత్ చెప్పినట్లు చెయ్యండి’ అంటూ జగన్ హుకుం జారీ చేశారు. అంతకు ముందు మేం ప్రభుత్వానికి రూ.904 కోట్లు ఎగ్గొట్టామని నివేదిక ఇచ్చిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ.. ఆ తర్వాత పన్ను ఎగవేత తొమ్మిది కోట్లే అని తేల్చింది’’ అని ఆ ఫిర్యాదులో ఆయన వెల్లడించారు.