Share News

Dairy Chairman Anand Kumar : బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి

ABN , Publish Date - Dec 25 , 2024 | 06:30 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ బీజేపీలో చేరబోతున్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో చేరుతున్నారు.

Dairy Chairman Anand Kumar : బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి

  • పురందేశ్వరి సమక్షంలో నేడు రాజమహేంద్రవరంలో చేరిక

విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ బీజేపీలో చేరబోతున్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సమక్షంలో చేరుతున్నారు. మాజీ ప్రధాని వాజపేయి శతజయంతి సందర్భంగా అక్కడ బీజేపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. అక్కడ ఆనంద్‌కుమార్‌ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. అభిమానులు, అనుచరులు రాజమహేంద్రవరం రావాలని వాట్సాప్‌ ద్వారా ఆయన ఆహ్వానించారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేసిన ఆయన్ను చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సుముఖత చూపలేదు. పైగా కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ డెయిరీలో అక్రమాలపై దృష్టిపెట్టింది. డెయిరీ ఆస్తులను ఆనంద్‌ స్వాహా చేశారని.. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై ఇటీవల అసెంబ్లీ సభాసంఘం కూడా ఏర్పాటుచేశారు. అది విచారణ కూడా ప్రారంభించింది.

ఇంకోవైపు... ఆనంద్‌ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ పార్టీ నేతలు అడ్డుకోవడంతో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను నేరుగా కలిసి బీజేపీలో చేరేందుకు సంసిద్ధత తెలియజేశారు. అక్కడ భరోసా లభించడంతో రాష్ట్రానికి వచ్చి ఆ పార్టీ నేతలను కలిశారు. ఇదే సమయంలో సభాసంఘం విచారణకు రావడంతో ఆయన తొలుత వైసీపీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశంతో రాష్ట్ర నేతలు ఆయన్ను పార్టీలో చేర్చుకుంటున్నారు.

Updated Date - Dec 25 , 2024 | 06:30 AM