Share News

Gudivada Amarnath: అమర్‌.. అక్రమ నిర్మాణం

ABN , Publish Date - Jun 23 , 2024 | 01:10 AM

మంత్రి కావడంతో అధికారులు సైతం ఆయన ఆదేశాలకు ‘జీ హుజూర్‌’ అంటూ సాగిలపడిపోయేవారు.

Gudivada Amarnath: అమర్‌.. అక్రమ నిర్మాణం

  • నాడు వైసీపీ మంత్రిగా అధికార దుర్వినియోగం

  • జీవీఎంసీ అనుమతి లేకుండానే వాణిజ్య సముదాయం నిర్మాణం

  • జాతీయ రహదారిని ఆనుకుని జీ+4 భవనం

  • సెట్‌బ్యాక్‌లు విడిచిపెట్టకుండానే...

  • నోటీసులు జారీచేసినా బేఖాతరు

  • జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి

  • మంత్రిగా ఉండడంతో చర్యలకు వెనుకాడిన అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ పాలనలో గుడివాడ అమర్‌నాథ్‌ మంత్రిగా ఒరగబెట్టిందేమీ లేకపోయినా ఆయన ఎక్కడకు వెళ్లినా హడావుడి మాత్రం తక్కువేం లేదు!. మంత్రి కావడంతో అధికారులు సైతం ఆయన ఆదేశాలకు ‘జీ హుజూర్‌’ అంటూ సాగిలపడిపోయేవారు. దీన్ని ఆసరాగా తీసుకుని పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందిన గాజువాకలో అమర్‌ జాతీయ రహదారికి ఆనుకుని అడ్డగోలుగా ఐదంతస్థుల షాపింగ్‌మాల్‌ను నిర్మించేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే భవన నిర్మాణం పూర్తిచేసేశారు. దీనికి సమీపంలోనే ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు చెందిన భవనాన్ని వైసీపీ హయాంలో నిబంధనల పేరిట కూలగొట్టిన అధికారులు...ఇప్పుడు గుడివాడ అమర్‌ భవనం విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

అధికారం అండతో అడ్డగోలుగా నిర్మాణం

గాజువాకలోని చట్టివానిపాలెం వద్ద హైవేను ఆనుకుని అమర్‌నాథ్‌కు సుమారు 400 గజాల స్థలం ఉంది. అందులో వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం అనుమతి కోరుతూ జీవీఎంసీకి రెండేళ్ల కిందట ఆన్‌లైన్‌లో ప్లాన్‌కు దరఖాస్తు చేశారు. దరఖాస్తు ఫీజు కింద రూ.పది వేలు చెల్లించారు. అయితే భవన నిర్మాణ కోసం ప్రతిపాదించిన స్థలం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఆ రహదారిని భవిష్యత్తులో 80 మీటర్లకు విస్తరించాలని మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. మాస్టర్‌ప్లాన్‌ ప్లాన్‌ ప్రకారం రోడ్డు విస్తరణకు సర్వే నిర్వహించి ఇరువైపుల ఎంతవరకూ భూమి అవసరమవుతోందో గుర్తించి జీవీఎంసీ అధికారులు ఆర్‌డీపీ (రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) ఇవ్వాలి. ఒకవేళ ప్రైవేటు స్థలం కూడా రహదారి విస్తరణకు అవసరమని తేలితే ఆ మేరకు జీవీఎంసీ స్వాధీనం చేసుకుని, పరిహారంగా యజమానికి టీడీఆర్‌ ఇస్తుంది. ఆ ప్రక్రియ పూర్తికాకపోవడంతో మాజీ మంత్రి అమర్‌నాథ్‌ భవన నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తు ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉండిపోయింది. అయినప్పటికీ అధికారం అండతో మంత్రి భవన నిర్మాణం ప్రారంభించేశారు. పైగా నిర్మాణంలో సెట్‌బ్యాక్‌లు కనీసం విడిచిపెట్టలేదు. జాతీయ రహదారిని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం విస్తరిస్తే ఇప్పుడున్న రోడ్డుకు ఇరువైపులా కనీసం 15 అడుగులు వరకూ వెడల్పు పెరుగుతుంది. అక్కడి నుంచి రోడ్డు వైపు భవనం ముందుభాగంలో 20 అడుగులు సెట్‌బ్యాక్‌ కింద విడిచిపెట్టాలి. అయితే కనీసం ఐదు అడుగులు కూడా విడిచిపెట్టలేదు. అదేవిధంగా మూడువైపులా మూడు మీటర్లు చొప్పున సెట్‌బ్యాక్‌ కింద వదలాలి. ఒక మీటరు కూడా సెట్‌బ్యాక్‌ విడిచిపెట్టలేదు. పైగా భవనానికి పశ్చిమ వైపు నుంచి చట్టివానిపాలెం గ్రామంలోకి వెళ్లేందుకు ఐదు అడుగుల రోడ్డు ఉంది. దీన్ని కూడా భవిష్యత్తులో 30 అడుగులకు విస్తరించే ప్రతిపాదన ఉండడంతో అటు వైపు కూడా పది అడుగులు విడిచిపెట్టి తర్వాత భవనం నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఆ రోడ్డును అంటిపెట్టుకుని భవన నిర్మాణం చేసేశారు. ఆగమేఘాల మీద భవన నిర్మాణం పూర్తిచేసి ఎన్నికలకు ముందు అందులో పార్టీ కార్యాలయం ప్రారంభించేశారు.

Amar-Illegal-Constructions.jpg

టౌన్‌ప్లానింగ్‌ అధికారుల నోటీసులిచ్చినా బేఖాతరు

ప్లాన్‌ లేకుండా భవన నిర్మాణం చేయడంతోపాటు సెట్‌బ్యాక్‌ నిబంధనలు ఉల్లఘించారని, అదనపు అంతస్థులు నిర్మించారంటూ గాజువాక జోన్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. దీనిపై మంత్రి హోదాలో ఉన్న అమర్‌నాథ్‌ నేరుగా జీవీఎంసీ కీలక అధికారికి ఫోన్‌ చేశారు. దీంతో కీలక అధికారి గాజువాక టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఫోన్‌ చేసి అటువైపు కన్నెత్తి చూడద్దొంటూ హుకుం జారీచేయడంతో వారంతా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. తాజాగా వైసీపీ అధికారం కోల్పోవడం, అమర్‌నాథ్‌ కూడా గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అక్రమ భవన నిర్మాణం అంశం బయటపడింది. ఇదిలావుండగా, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నిరకాల నిబంధనలను పాటిస్తూ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తుండగా, జాతీయ రహదారి విస్తరణకు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం రెండడుగులు ముందుకువచ్చి భవనం నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో యంత్రాలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దానికి కూతవేటు దూరంలోనే మాజీ మంత్రి అమర్‌నాథ్‌ నిర్మించిన అక్రమ భవనం ఉండడ ంతో జీవీఎంసీ అధికారులు ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

gudivada-amarnath.jpg

జీవీఎంసీలోనే ప్లాన్‌ పెండింగ్‌

చట్టివానిపాలెంలో మా తాతల ఆస్తిగా వచ్చిన 400 గజాల స్థలంలో భవన నిర్మాణానికి మూడేళ్ల కిందటే జీవీఎంసీకి ప్లాన్‌ కోసం దరఖాస్తు చేశాం. అన్ని ఫీజులు చెల్లించడంతోపాటు రోడ్డు విస్తరణకు స్థలం కూడా జీవీఎంసీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాను. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆర్‌డీపీ జరగలేదనే కారణంతో ప్లాన్‌ను జీవీఎంసీలో ఇంకా పెండింగ్‌లో ఉంచారు. నా వైపు నుంచి ప్రభుత్వానికి కట్టాల్సిన అన్నిరకాల పన్నులు చెల్లించేశాను.

Updated Date - Jun 23 , 2024 | 05:52 PM