AP News: విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారు: గంటా శ్రీనివాసరావు
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:08 PM
విశాఖ: నగరంలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు కెజిహెచ్ మార్చురీ వద్ద రమణయ్య బంధువులను పరామర్శించారు.
విశాఖ: నగరంలో రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, టీడీపీ నేతలు కెజిహెచ్ మార్చురీ వద్ద రమణయ్య బంధువులను పరామర్శించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. రమణయ్య హత్య దారుణమని, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక్కప్పుడు రాయలసీమలో చూసే భూ మాఫియా.. ఇప్పుడు విశాఖలోకి వచ్చేసిందన్నారు. విశాఖకు విష సంస్కృతి తీసుకొచ్చారని, ఒక రెవిన్యూ అధికారికి ప్రాణ రక్షణ లేకపోవడం భాదకరమని అన్నారు.
విశాఖలో ఒక ఎంపీ కుటుంబాన్ని 48 గంటలు చిత్రహింసలు పెడితే.. కనీసం సీఎం జగన్ ఒక్క సమీక్ష కూడా జరపలేదని.. అప్పుడే స్పందించి ఉంటే ఈ స్థితి వచ్చేది కాదని గంటా శ్రీనివాసరావు అన్నారు. హోం మంత్రి ఎక్కడో, డీజీపీ ఎక్కడో తెలియడం లేదని.. వారు విశాఖకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా కాకుండా.. క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారన్నారు. ప్రభుత్వ పెద్దల హస్తం దీని వెనుక ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సాధారణ పౌరుడుకి అన్యాయం జరిగితే సీఎం స్పందించాలని, అటువంటిది మండల మేజిస్ట్రేట్ హత్యకు గురైతే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
కాగా విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. కొమ్మది చరణ్ క్యాస్టల్‌లో ఈ ఘటన సంచలనం రేపింది. కొమ్మాదిలో తన ఇంట్లో ఉన్న రమణయ్యపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రాడ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. సీపీ రవిశంకర్ ఆయన్నర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మండల మేజిస్ట్రేట్‌కే భద్రత కరువైంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.