Share News

Anakapalli: పరవాడ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం.. విషయం ఇదే..

ABN , Publish Date - Dec 23 , 2024 | 09:15 AM

పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి విష వాయువులు విడుదల అయ్యాయి. ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Anakapalli: పరవాడ ఫార్మాసిటీలో భారీ ప్రమాదం.. విషయం ఇదే..
Paravada Pharma City

అనకాపల్లి: పరవాడ ఫార్మా సిటీ (Paravada Pharma City)లో మరోసారి విష వాయువులు (Poisonous Gases) లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ (Rakshita Drugs) నుంచి విష వాయువులు విడుదల అయ్యాయి. ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కార్మికులు, కంపెనీ యాజమాన్యం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


రెండు నెలల్లో..

కాగా, పరవాడ ఫార్మాసిటీలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 26న జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్‌ ఫార్మా లేబొరేటరీలో విషవాయవులు లీక్ అయ్యాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ఒక్కసారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతిచెందగా.. 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబ నాయుడు సైతం స్పందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.


అలాగే డిసెంబర్ 6వ తేదీన ఫార్మాసిటీలోని శ్రీ ఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం సంభవించింది. ప్రొడక్షన్ బ్లాక్‌లోని డ్రయర్ యంత్రం నుంచి ప్రొడక్ట్ బయటకు తీసేందుకు కార్మికులు మ్యాన్ హోల్ ఓపెన్ చేశారు. దీంతో ప్రమాదవశాత్తూ కెమికల్స్ ఇద్దరి కార్మికులపై పడి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాపాయం తప్పింది. వరస ఘటనలతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


మంత్రి స్పందన..

పరవాడ ఫార్మా ప్రమాదంపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందించారు. పరవాడ ఫార్మా కర్మాగారంలో వరస ప్రమాదాలు సంభవించడం బాధాకరమని మంత్రి అన్నారు. ప్రమాదంలో గాయపడిన రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. విష వాయువు లీకేజీ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి వాసంశెట్టి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Dec 23 , 2024 | 12:47 PM